రేపు(నవంబర్ 29).. అలుగునూరులో  దీక్షా దివస్ స్ఫూర్తి సభ

రేపు(నవంబర్ 29).. అలుగునూరులో  దీక్షా దివస్ స్ఫూర్తి సభ
  • ముఖ్య అతిథిగా కేటీఆర్‌‌‌‌.. 
  • ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న గంగుల
  • ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 
  • లక్ష మందిని సమీకరించాలని లక్ష్యం
  • 40 ఎకరాల్లో సభ ఏర్పాట్లు 
  •     బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ

కరీంనగర్, వెలుగు: తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిన చారిత్రక ఘట్టం ‘దీక్షా దివస్’కు కరీంనగర్ జిల్లా అలుగునూరు వేదిక కానుంది. ఈ నెల 29న ఆదివారం తిమ్మాపూర్ మండలం అలుగునూరు చౌరస్తా వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ‘దీక్షా దివస్ స్ఫూర్తి బహిరంగ సభ’ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు. సభ ఏర్పాట్లను కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పర్యవేక్షిస్తున్నారు. బహిరంగ సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా సుమారు లక్ష మందిని సమీకరించాలని బీఆర్ఎస్ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం అలుగునూరు వద్ద 40 ఎకరాల విస్తీర్ణంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సభను సక్సెస్ చేసేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు గత కొన్ని రోజులుగా గ్రామాలు, పట్టణాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. డప్పు దరువులతో, మహిళలకు బొట్టు పెట్టి ఆహ్వానిస్తూ జన సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కార్యకర్తలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

అలుగునూరు.. ఉద్యమ స్ఫూర్తికి వేదిక..

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు బయలుదేరినప్పుడు అలుగునూరు చౌరస్తా వద్ద పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అక్కడి నుంచి ఖమ్మం జైలుకు తరలించినా ఆయన తన దీక్షను విరమించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఉధృతమైంది. నాటి చారిత్రక పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు చాటిచెప్పేలా ఈసారి అలుగునూరులోనే ఈ భారీ సభను నిర్వహిస్తున్నట్లు గంగుల కమలాకర్ తెలిపారు. ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు, కవులు, మేధావులను సన్మానించనున్నట్లు చెప్పారు.