మేము కలిసే ఉన్నాం.. కాంగ్రెస్, ఎస్పీ కూటమిలో విభేదాల్లేవు: అఖిలేశ్ యాదవ్

 మేము కలిసే ఉన్నాం.. కాంగ్రెస్, ఎస్పీ కూటమిలో విభేదాల్లేవు: అఖిలేశ్ యాదవ్

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకంపై కలిసే నిర్ణయం తీసుకుంటామని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్‌ అఖిలేశ్ యాదవ్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్, ఎస్పీ కలిసే ఉన్నాయని, ఇరు పార్టీల్లో అభ్యర్థుల ఎంపికలో గెలుపు అవకాశాలకే ప్రాధాన్యం ఇస్తామని శుక్రవారం వెల్లడించారు. కూటమిలో ప్రతిష్టంభన నెలకొన్నట్లు వస్తున్న వార్తలను ఖండిస్తూ.. రెండు పార్టీలు కలిసి పోటీ చేసేందుకు కట్టుబడి ఉన్నాయని చెప్పారు. 

‘చాలా కుట్రలు జరుగుతున్నాయి. కానీ మేమంతా కలిసే ఉన్నాం’ అని అఖిలేశ్‌ వ్యాఖ్యానించారు. ఎస్పీ, కాంగ్రెస్‌ కలిసి ఎన్ని సీట్లలో పోటీ చేయాలి? ప్రచారాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలి? అనే అంశాలపై చర్చించి నిర్ణయిస్తాయని తెలిపారు. కూటమి తరఫున గెలుపు అవకాశాలున్న అభ్యర్థికే టికెట్‌ ఇస్తామన్నారు. పీడీఏ (పిచ్డా, దళిత్‌, అల్పసంఖ్యాక్‌) వ్యూహం ప్రకారం ఎన్నికల్లో ముందుకు సాగుతామన్నారు. వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనార్టీలను కలుపుకుని ఎన్నికలకు సిద్ధమవుతున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 403 అసెంబ్లీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఎస్పీ చాలా కాలంగా సన్నద్ధమవుతోందన్నారు. 

డీలిమిటేషన్‌తో పార్టీల వైఖరి తెలుస్తది..

పార్లమెంట్‌లో డీలిమిటేషన్‌ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఏ పార్టీ ఎవరికి మద్దతుగా ఉందో స్పష్టమవుతుందని అఖిలేశ్‌ అన్నారు. ఓటరు జాబితాల్లో అవకతవకలు, ఎన్నికలకు సంబంధించిన ఇతర అంశాలతో ప్రతిపక్షాలను బీజేపీ బిజీగా ఉంచుతోందని ఆరోపించారు. ఎన్నికల సంఘంపై నమ్మకం లేదని, దాని ఉద్దేశాలు స్పష్టంగా లేవని విమర్శించారు. అధికారులు, ఎన్నికల సంఘం చేయాల్సిన పనులను కూడా ప్రతిపక్షాలు చేయాల్సి వస్తోందన్నారు.