హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని తక్కువచేసి విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ నేతలకు పీసీసీ అధికార ప్రతినిధి గౌరి సతీశ్ వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. గురువారం కొందరు బీఆర్ఎస్ నేతలు.. రాహుల్ గాంధీని తక్కువచేసి ఆయనతో కలిసి భోజనం చేసినట్లు అశోక్ నగర్ క్రాస్ రోడ్డు వద్ద ఓ హోటల్ లో చిల్లర రాజకీయం చేశారని, మరోసారి ఇలాంటివి చేస్తే చూస్తూ ఊరుకోబోమని, తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు.
పదేళ్ల పాటు అధికారంలో ఉండి వాక్ స్వాతంత్ర్యాన్ని అణిచివేసిన బీఆర్ఎస్ ఇప్పుడు దాని గురించి మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కుటుంబం విషయంలో బీఆర్ఎస్ నేతలు ఇకనుంచి ఏమాత్రం గౌరవ, మర్యాదలు తప్పినా తెలంగాణలో తిరగనిచ్చేది లేదని హెచ్చరించారు.
