ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్-–బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాలకు ఒక ముల్లులా మారారని, ఆమె అక్కడ ఉండటం వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయనే విషయాన్ని న్యూఢిల్లీ ఇప్పుడిప్పుడే గుర్తిస్తోందని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హుమాయున్ కబీర్ వ్యాఖ్యానించారు. డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌కు తిరిగి రావాలనే హసీనా ప్రణాళికపై భారత్ స్పందించడానికి నిరాకరించిన మరుసటి రోజే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గురువారం విదేశాంగ మంత్రిత్వ శాఖలో విలేకరులతో మాట్లాడిన కబీర్, హసీనాను ఒకరి ఇంట్లోకి అకస్మాత్తుగా వచ్చిన అనిష్ట అతిథితో పోల్చారు. భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉన్న నేరస్థుల అప్పగింత ఒప్పందం ప్రకారం మాత్రమే హసీనా తిరిగి రావాల్సి ఉంటుందని, ఆమెను చేతులకు సంకెళ్లతో లేదా కఠిన నిఘా మధ్యే తీసుకువస్తామని కబీర్ స్పష్టం చేశారు. "ఆమె ఒక నేరస్థురాలు. సాధారణ పౌరులకు ఒక విధానం, నేరస్థులకు మరో విధానం ఉంటుంది. ఆమె నేరస్థుల జాబితాలోకి వస్తారు. ఆమె తనంతట తానుగా తిరిగి రావడం కాదు, భారత్ ఆమెను మాకు అప్పగిస్తుంది" అని ఆయన తేల్చి చెప్పారు.
