1981 నుంచి నేటి వరకు బంగ్లాదేశ్ అవామీలీగ్ పార్టీకి అధ్యక్షురాలుగా నాయకత్వం వహించిన షేక్ హసీనా ఆ దేశ ప్రధానిగా 1996 నుంచి 2024 వరకు అధికకాలంపాటు సేవలు అందించారు. 28 సెప్టెంబర్ 1947న జన్మించిన హసీనా తన తండ్రి బంగ్లాదేశ్ జాతిపిత అయిన షేక్ ముజిబుర్ రెహమాన్ అడుగుజాడల్లో నడిచారు. ఆమె భర్త పరమాణు శాస్త్రవేత్త ఎంఎ వాజిద్ మియా.
2024లో షేక్ హసీనా ప్రభుత్వం ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకించిన బంగ్లా యువత నిరసనలు, హింసాత్మక ఘటనలు, తీవ్రమైన అల్లర్లతో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. తుదకు యువత నిరసనలు హద్దులు మీరడంతో 5 ఆగస్టు 2024న ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి దేశం విడిచి షేక్ హసీనా భారత్‌లో ఆశ్రయం పొందారు.
ఆమె స్థానంలో నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రధానిగా ఎంపికయ్యారు. దాదాపు రెండు దశాబ్దాలు బంగ్లాదేశ్‌ను ఏలిన హసీనా రాజకీయ ప్రస్థానంలో ఊహించని మలుపు తిరిగింది. స్వపక్షం ఆమెను దేశాభివృద్ధికి నిర్మాత అనగా, విమర్శకులు నిరంకుశ పాలకురాలుగా అభివర్ణించారు.
విద్యార్థుల తిరుగుబాటుతో పదవి కోల్పోయిన హసీనా భారత్‌లో ఆశ్రయం పొంది ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ నేపథ్యంలో యుద్ధ నేరస్తులను విచారించే ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ ఆమెను దోషిగా తేల్చి మరణ శిక్షను ఖరారు చేయడం గమనార్హం.
షేక్ హసీనా రాజకీయ ఆటుపోట్లు
షేక్ హసీనా జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. నాలుగుసార్లు ప్రధానిగా పని చేశారు.
బంగ్లాదేశ్ రాజకీయాల్లో మూడు దశాబ్దాలు శాసించిన మహా మహిళా నేత హసీనా.. ఢాకా యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశారు. విద్యార్థి రాజకీయాల్లో క్రియాశీలకంగా పాల్గొన్నారు.
1968లో భర్త చనిపోగా కుమారుడు సజీద్ వాజెద్ మియా, కూతురు సైమా వాజెద్ పుతుల్ అండగా ఉన్నారు. ఆగస్టు 1975లో బంగ్లాదేశ్‌లో జరిగిన సైనిక తిరుగుబాటులో కుటుంబ సభ్యులు షేక్ ముజిబుర్ రెహమాన్, తల్లి, ముగ్గురు సోదరులు సహా కుటుంబ సభ్యులు హత్యకు గురి అయ్యారు. ఆ సమయంలో విదేశాల్లో ఉన్న షేక్ హసీనా, ఆమె చెల్లెలు రెహానా మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.
నాడు కూడా భారత ప్రభుత్వం హసీనాకు మన దేశంలో ఆశ్రయం కల్పించింది. ఆరు ఏండ్ల తర్వాత మే 1981లో బంగ్లాకు తిరిగివచ్చిన హసీనా అవామీ లీగ్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. నాటి నుంచి దాదాపు మూడు దశాబ్దాలపాటు హసీనా ఒకవైపు, ఆమె రాజకీయ ప్రత్యర్థి ఖలీదా జియా మరోవైపు పోటాపోటీగా రాజకీయాలను నడిపారు. ఈ ఇద్దరు మహిళా నేతలను ‘ది బ్యాట్లింగ్ బేగమ్స్’ అని పిలిచేవారు.
అత్యధిక కాలం బంగ్లాదేశ్ ప్రధానిగా..
అతి ఎక్కువ కాలం బంగ్లాదేశ్ ప్రధానిగా హసీనా పని చేశారు. 2001లో అధికారానికి దూరం అయ్యారు. ఆ తర్వాత 2008లో మళ్లీ అధికారం చేజిక్కించుకొని 2014, 2018 ఎన్నికల్లో నిరాటంకంగా గెలిచి ప్రపంచంలోనే అత్యధిక కాలం పనిచేసిన మహిళా నేతల్లో ఒకరిగా రికార్డు నెలకొల్పారు. ఆమె పాలనలో బంగ్లాదేశ్ అభివృద్ధిపథంలో నడిచినా పలు సందర్భాల్లో అపఖ్యాతిని మూటగట్టుకున్నారు.
తన ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతను అణచివేయడం, మీడియాపై ఆంక్షలు విధించడం, ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడంతో నిరంకుశ నేతగా పేరు తెచ్చుకున్నారు. ఇదే క్రమంలో 2024లో స్వాతంత్ర్య సమరయోధుల పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడంతో విద్యార్థుల నిరసనలు తీవ్రరూపం దాల్చి హింసాత్మక ఘటనలు, మరణాలు సంభవించాయి. 15 జులై 2024 నుంచి 15 ఆగస్టు 2024 మధ్య జరిగిన అల్లర్లలో, ప్రభుత్వ అణచివేతలో 1,400 మంది ప్రాణాలు కోల్పోయారని ఐరాస అంచనా వేసింది.
రానున్న రోజుల్లో ఏం కానుంది!
బంగ్లాదేశ్‌లో అవామీ లీగ్ పార్టీని నిషేధించడం, హసీనాకు మరణ శిక్ష విధించడంతో 16 డిసెంబరు 2026 రోజు షేక్ హసీనా బంగ్లాదేశ్‌కు తిరిగి వెళితే ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఇటీవల హసీనా ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తనను అరెస్టు చేసి జైలులో పెట్టినా, తనకు మరణ శిక్ష విధించినా భయపడకుండా తన దేశానికి వెళ్తానని తెలిపారు.
నేటికీ ఢిల్లీ నుంచి తన పార్టీ కార్యకర్తలకు ఆదేశాలు ఇస్తూ హసీనా తన పార్టీని నడిపిస్తున్నట్లు స్పష్టం అవుతున్నది. తనపై విధించిన మరణ శిక్షపై ఆమె అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఆమె అప్పీల్ ఆమోదం పొందితే కొత్తగా విచారణ జరిగి శిక్ష తగ్గింపు జరిగే అవకాశం ఉంది.
అయితే విచారణ సమయంలో కోర్టుకు హసీనా ప్రత్యక్షంగా హాజరుకావాల్సి ఉంటుంది. లేదా భారత్‌లో ఉంటూనే కోర్టు తీర్పులను పొందవచ్చు. అప్పీల్ చేస్తే ఆమె శిక్ష రద్దు కూడా కావచ్చు.
గత తొమ్మిది మాసాలుగా బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా పనిచేస్తున్న రెహమాన్ ఇప్పటివరకు చైనా, జపాన్, మలేషియా దేశాలలో పర్యటించినప్పటికీ సెప్టెంబర్‌లో భారత్‌లో జరిగిన బ్రిక్స్ సమావేశంలో పాల్గొనకపోవడం గమనార్హం.
భారత్‌లో ఆశ్రయం
5 ఆగస్టు 2024న షేక్ హసీనా భారత్‌కు వచ్చి ఆశ్రయం పొందారు. బంగ్లాదేశ్ 1971లో పాకిస్తాన్ నుంచి విముక్తి పొందిన సందర్భంగా ‘విజయ దినోత్సవం’ జరుపుకుంటున్నవేళ 16 డిసెంబర్ 2026 రోజు భారతదేశం నుంచి ఢాకాకు తిరిగి వస్తున్నట్లు ఆమె ఇటీవల ప్రకటించారు.
ఇప్పటికే తారీక్ రెహమాన్ నేతృత్వంలోకి ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రభుత్వం హసీనాను తమకు అప్పగించాలని భారత్‌ను కోరడం కూడా జరిగింది. ఆమె భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తే తక్షణమే అరెస్టు చేసి జైలుకు పంపుతామని నేటి బంగ్లా ప్రభుత్వం స్ఫష్టం చేసింది. మరోవైపు బంగ్లాదేశ్ ప్రభుత్వం తనకు ఢిల్లీ నుండి ఢాకాకు రావడానికి ఏర్పాట్లు చేయాలని హసీనా కోరారు.
- డా. బుర్ర మధుసూదన్ రెడ్డి-
గమనిక: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ [email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.
