గిరిజన మహిళల చేతివృత్తులకు కొత్త ఊతం : ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో

గిరిజన మహిళల చేతివృత్తులకు కొత్త ఊతం : ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో

తాడ్వాయి (ములుగు), వెలుగు: గిరిజన మహిళల్లో ఉన్న సంప్రదాయ కళానైపుణ్యాలను ప్రోత్సహించి, వారు తయారు చేసే హస్తకళా ఉత్పత్తులకు మార్కెట్ అనుసంధానం కల్పించి స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో అధికారులకు సూచించారు. శుక్రవారం మేడారంలోని సమ్మక్క సారలమ్మ మహిళా శక్తి సంఘాల సభ్యులతో ముఖాముఖి నిర్వహించి, వారు తయారు చేస్తున్న వెదురు హస్తకళలు, అలంకరణ వస్తువులను పరిశీలించారు. మహిళల పని విధానం, ఉత్పత్తుల తయారీలో ఎదురవుతున్న ఇబ్బందులు, వారి నైపుణ్యాలు, అనుభవాలను అడిగి తెలుసుకుని, మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా సూచనలు చేశారు. 

మహిళలు తయారు చేసే ప్రతి హస్తకళా ఉత్పత్తిపై సమ్మక్క సారలమ్మ దేవతలు-మేడారం పేరుతో ప్రత్యేక లోగోలు, స్టిక్కర్లు, ట్యాగ్​లు ఏర్పాటు చేయాలని సూచించారు. వెదురుతో పెన్స్​ స్టాండ్లు, ఫొటో ఫ్రేమ్​లు, ల్యాంప్​షెడ్లు, బుట్టలు, గృహోపకరణాలు, జ్ఞాపికలు వంటి ఆకర్షణీయమైన వస్తువులను తయారు చేసేలా మహిళలను ప్రోత్సహించాలన్నారు. గిరిజన మహిళా సంఘాల సభ్యులకు వెదురు హస్తకళల తయారీలో నెల రోజులపాటు ప్రత్యేక శిక్షణ అందించి, డిజైన్, నాణ్యత, ఫినిషింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు. శిక్షణ అనంతరం మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి మేడారంలో ప్రత్యేక విక్రయ కేంద్రం ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని చెప్పారు.