కరీంనగర్, వెలుగు : బంగారు నగల కోసం ఓ మహిళను కిరాతకంగా హత్య చేసిన కేసులో ముగ్గురు నేరస్తులకు కరీంనగర్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు జీవిత ఖైదుతోపాటు ఒక్కొక్కరికి రూ.9 వేల- చొప్పున జరిమానా విధిస్తూ శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ రజ్వీచమన్ కు చెందిన షేక్ గౌస్ పాషా, హుస్సేనీపురకు చెందిన వంకడాయ్ మోహన్, రజ్వీ చమన్ కు చెందిన మహ్మద్ నూర్జాహన్ బేగం కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వీరు 2023 అక్టోబర్ 1న శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన గుండారపు ప్రమీల(58)తోపాటు ఆమె తండ్రికి పూజలు చేయిస్తామని గ్రామంలోని శివాలయం ఆవరణకు ఆటోలో తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లాక షేక్ గౌస్ పాషా బాధితురాలు ప్రమీలను కత్తితో బెదిరించి బంగారు ఆభరణాలు లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో విచక్షణారహితంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. మృతురాలి మెడలోని బంగారు పుస్తెలతాడు, ఒక చెవి దిద్దు (మొత్తం సుమారు 27.2 గ్రాముల బంగారం) దోచుకుని ముగ్గురు నిందితులు ఆటోలో పరారయ్యారు.
ఈ ఘటనపై కేశవపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన మూడు రోజుల్లోనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులపై కోర్టులో పక్కా ఆధారాలతో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. దీంతో వారిపై నేరం రుజువు కావడంతో ముగ్గురికీ జీవిత ఖైదు విధిస్తూ కరీంనగర్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో నేరస్తులకు కఠిన శిక్ష పడేలా ఏసీపీ సీసీఆర్ బీ శ్రీనివాస్ జి పర్యవేక్షణలో కోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం. ప్రతాప్, అప్పటి దర్యాప్తు అధికారి(అప్పటి హుజూరాబాద్ రూరల్ సీఐ) బి. సంతోష్ కుమార్, ప్రస్తుత కేశవపట్నం ఎస్హెచ్ఓ ఎన్. నరేశ్‌రెడ్డి, కోర్టు డ్యూటీ ఆఫీసర్ పి. కరుణాకర్, సీఎంఎస్ ఎం. సత్తయ్య ను కరీంనగర్ సీపీ గౌష్ ఆలం అభినందించారు.
