దక్షిణాదికి అన్యాయం జరగదు.. 50 శాతం అసెంబ్లీ, పార్లమెంటు సీట్లు పెరుగుతయ్: ఏపీ సీఎం చంద్రబాబు

దక్షిణాదికి అన్యాయం జరగదు.. 50 శాతం అసెంబ్లీ, పార్లమెంటు సీట్లు పెరుగుతయ్: ఏపీ సీఎం చంద్రబాబు
  •     మహిళలకు 33% రిజర్వేషన్ అవసరం
  •     డీలిమిటేషన్‌కు మద్దతివ్వండి
  •     ఏపీ సీఎం చంద్రబాబు పిలుపు

న్యూఢిల్లీ, వెలుగు:  కేంద్ర కేబినెట్ ఆమోదించిన 50 శాతం డీలిమిటేషన్ ఫార్ములాతో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని, అన్ని రాష్ట్రాలకూ పూర్తి ప్రయోజనం కలుగుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ఫార్ములాతో తెలంగాణలో లోక్‌సభ స్థానాలు 17 నుంచి 26కు, ఏపీలో 25 నుంచి 38కి, తమిళనాడులో 39 నుంచి 59కి, కర్నాటకలో 28 నుంచి 42కు, కేరళలో 20 నుంచి 30కి పెరుగుతాయని, ఐదు దక్షిణాది రాష్ట్రాల సీట్లు 129 నుంచి 195కు చేరుతాయని, లోక్‌సభలో దక్షిణాది వాటా 23.76 శాతంగానే కొనసాగుతుందని తెలిపారు.

శుక్రవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, ఇతర కేంద్ర మంత్రులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 1971 జనాభా లెక్కల ఆధారంగా జరిగిన పునర్విభజనతో లోక్‌సభ స్థానాలు 543గా ఉన్నాయని, అప్పట్లో 58.8 కోట్ల జనాభాకు దాదాపు 10 లక్షల మందికి ఒక ఎంపీ ఉండేవారని చెప్పారు. ఇప్పుడు దేశ జనాభా 147 కోట్లకు చేరడంతో 27 లక్షల మందికి ఒక ఎంపీ ఉన్నారని, 50 శాతం సీట్లు పెరిగితే ప్రతి 18 లక్షల మందికి ఒక ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు. 2011 లేదా 2026 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు.

బిల్లుకు మద్దతివ్వండి

దేశ ప్రయోజనాల కోసం అన్ని రాజకీయ పార్టీలు డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులకు మద్దతివ్వాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. గత సెషన్‌లో కొన్ని పార్టీలు బిల్లును వ్యతిరేకించాయని, మళ్లీ అలాంటి చారిత్రక తప్పిదం చేయొద్దని హితవు పలికారు. మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్లు ఇప్పుడు అమలు దశకు చేరుకుంటున్నాయని, ఈ రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకిస్తే మహిళా ప్రాతినిధ్యాన్ని అడ్డుకున్నట్లేనని అన్నారు. దేశ నిర్మాణంలో మహిళలు సమాన భాగస్వాములు కావాలని, వారికి 33 శాతం రిజర్వేషన్ అవసరమని చెప్పారు. కుటుంబ నియంత్రణ పాటించినందుకు లోక్‌సభలో వాటా కోల్పోతామని దక్షిణాది రాష్ట్రాలు గతంలో భయపడ్డాయని, సంతానోత్పత్తి రేటు తగ్గుతున్న నేపథ్యంలో పెద్ద కుటుంబాలకు ప్రోత్సాహకాలు ఇచ్చి ఎక్కువ మంది పిల్లలను కనేలా ప్రజలను ప్రోత్సహించాలని సూచించారు.