జెర్సీ నంబర్ 7 మార్చమన్న న్యూమరాలజిస్ట్.. దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన ధోనీ!

జెర్సీ నంబర్ 7 మార్చమన్న న్యూమరాలజిస్ట్.. దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన ధోనీ!

MS Dhoni Jersey Number 7: క్రికెట్ ప్రపంచంలో నంబర్ 7 అంటే వెంటనే గుర్తొచ్చే పేరు మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni).. ఐకానిక్ జెర్సీ నంబర్ 7 వెనుక ఉన్న అసలు కథను, ఫ్లైట్‌లో ఒక న్యూమరాలజీ నిపుణుడికి తాను ఇచ్చిన దిమ్మతిరిగే కౌంటర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ (CSK) దిగ్గజం తాజాగా బయటపెట్టాడు. జావేద్ అక్తర్, వైభవ్ ముంజాల్‌లతో జరిగిన ప్రత్యేక సంభాషణలో మహీ షేర్ చేసుకున్న ఈ ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

జెర్సీ నంబర్ 7నే ధోనీ ఎందుకు ఎంచుకున్నాడు: 

* టీమిండియా తరపున అరంగేట్రం చేసిన నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, తాను నంబర్ 7 ఎంచుకోవడానికి గల సింపుల్ కారణాన్ని ఎంఎస్ ధోనీ వివరించాడు. 

* పుట్టిన తేదీ లింక్: ధోనీ పుట్టిన తేదీ జూలై 7, 1981 (7/7). అందుకే తనకు 7వ నంబర్ అంటే ప్రత్యేకమైన ఇష్టం ఉండేది.

* అరంగేట్రం రోజున ఛాన్స్: భారత జట్టులోకి అరంగేట్రం చేసినప్పుడు నీకు ఏ నంబర్ జెర్సీ కావాలని అడిగారని, తాను వెంటనే 7 కావాలని కోరానని ధోనీ చెప్పాడు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో 7వ నంబర్ అందుబాటులో ఉండటంతో తనకు ఇష్టమైన లక్కీ నంబర్ దక్కిందని తెలిపాడు.

న్యూమరాలజిస్ట్ సలహాకు ధోనీ సూపర్ పంచ్: 

ఒకసారి విమాన ప్రయాణంలో (ఫ్లైట్‌లో) తనకు ఎదురైన సరదా అనుభవాన్ని ధోనీ గుర్తు చేసుకున్నాడు. ఫ్లైట్‌లో కలిసిన ఓ న్యూమరాలజీ నిపుణుడు, అదృష్టం మరింత కలిసిరావాలంటే జెర్సీ నంబర్ 7ను మార్చి వేరే నంబర్ పెట్టుకోవాలని ధోనీకి సూచించాడు. ఆ సలహాను సున్నితంగా తిరస్కరించిన ధోనీ, ఇలా మార్చుకుంటూ పోతే దీనికి అంతం ఎక్కడ అని ప్రశ్నించాడు. సార్, ఇది ఎక్కడ ఆగుతుంది? ఈరోజు 7 నుంచి 11కు మారుస్తాను, రేపు 11 నుంచి 15కు మారుస్తాను– అంటే నేనే తప్పులు చేస్తూ పోయి, ఆ తప్పులన్నింటినీ నంబర్లపై తోసేస్తూ ఉండాలా? (Sir, yeh rukega kahan pe? Aaj saath se main 11 kar loon, kal 11 se main 15 kar loonga– matlab khud ki galti karta rahoonga, number pe thopta rahoonga) అని ఆ నిపుణుడికి ధోనీ ఇచ్చిన సమాధానం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

Thala for a Reason క్రేజ్ వెనుక అసలు సీక్రెట్ ఇదే: 

నంబర్ 7 ఇంత పెద్ద పాప్-కల్చర్ బ్రాండ్‌గా మారడానికి తన అభిమానులే కారణమని ఎంఎస్ ధోనీ క్రెడిట్ ఇచ్చాడు. నా ఫ్యాన్స్ ప్రతి విషయాన్ని కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు చేస్తూ చివరకు ఏదో ఒక విధంగా 7వ నంబర్‌కు లింక్ చేయడం మొదలుపెట్టారని ధోనీ నవ్వుతూ చెప్పాడు. అలా కాలక్రమేణా నంబర్ 7 తన గుర్తింపులో భాగమైపోయిందని, దాని నుంచే సోషల్ మీడియాలో అత్యంత పాపులర్ అయిన Thala for a reason ట్రెండ్ పుట్టుకొచ్చిందని మహేంద్ర సింగ్ ధోనీ పేర్కొన్నాడు.