దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన తర్వాతి సినిమాలపై క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానున్న ప్రభాస్ 'స్పిరిట్' చిత్రం తర్వాత, రణ్‌బీర్ కపూర్‌తో 'యానిమల్ పార్క్'ను పట్టాలెక్కించనున్నట్లు ఆయన చెప్పారు.
ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' అనే యాక్షన్ డ్రామా సిద్ధమవుతోంది. ఇందులో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా, త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్, టీ-సిరీస్ ఫిల్మ్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుందని చిత్ర బృందం తెలిపింది.
'స్పిరిట్' తర్వాత సందీప్ ఏ హీరోతో సినిమా చేస్తారనే విషయంపై కొద్దిరోజులుగా ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, చిరంజీవి వంటి అగ్ర హీరోలతో ఆయన సినిమా ఉండొచ్చని సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. టాలీవుడ్ హీరోలతో పాటు బాలీవుడ్ హీరోల అభిమానులు కూడా సందీప్ తమ హీరోలతో సినిమా చేయాలని కోరుకున్నారు.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సందీప్ ఈ ఊహాగానాలకు తెరదించారు. తన తర్వాతి ప్రాజెక్ట్ గురించి ఆయన స్పష్టతనిచ్చారు. 'స్పిరిట్' సినిమా పనులు పూర్తయిన వెంటనే ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా రణ్‌బీర్ కపూర్‌తో 'యానిమల్ పార్క్' మొదలుపెట్టబోతున్నట్లు చెప్పారు. ఇది 'యానిమల్' సినిమాకు సీక్వెల్ అని ఆయన వెల్లడించారు. సందీప్ ప్రకటనతో 'స్పిరిట్' తర్వాత ఆయన మళ్లీ బాలీవుడ్ హీరోతోనే పనిచేయనున్నట్లు ఖాయమైంది.
