సిరాజ్‌ను ఎందుకు పక్కనపెడుతున్నారు? .. టీమ్ మేనేజ్‌మెంట్పై అశ్విన్ హాట్ కామెంట్స్!

సిరాజ్‌ను ఎందుకు పక్కనపెడుతున్నారు? .. టీమ్ మేనేజ్‌మెంట్పై అశ్విన్ హాట్ కామెంట్స్!

Mohammed Siraj: న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో నలుగురు పేసర్లతో బరిలోకి దిగినా మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) పేరు తుది జట్టులో లేకపోవడం పెద్ద దుమారమే రేపుతోంది. ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) సైకిల్‌లో 11 మ్యాచ్‌ల్లో 43 వికెట్లతో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ సిరాజ్. 2025లో ఇంగ్లాండ్‌తో సిరీస్‌ను 2–2తో సమం చేయడంలోనూ అతడు బౌలింగ్ లో కీలకంగా వ్యవహరించాడు. అలాంటి బౌలర్‌ను క్రైస్ట్‌చర్చ్ రెండో టెస్టులోనూ పక్కన పెట్టడంపై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) తన యూట్యూబ్ ఛానల్‌లో ఘాటుగా స్పందించాడు.

పాత బౌలర్ల శకం ముగుస్తోందా: 

* భారత ప్లేయింగ్ XIలో మహమ్మద్ సిరాజ్‌కు చోటు లేదన్న సంకేతం స్పష్టంగా కనిపిస్తోందని, పేసర్ల వరుసలో బహుశా అతను ఇప్పుడు నితీశ్ కుమార్ రెడ్డి కంటే వెనుకబడ్డాడేమో అని ఆర్. అశ్విన్ అన్నాడు. ప్రస్తుతం సిరాజ్ తీవ్ర నిరాశలో ఉంటాడని, ఎవరైనా అతడితో కూర్చుని మాట్లాడి, తన బాధ చెప్పుకునే అవకాశం ఇచ్చి, సరైన దారి చూపిస్తే బాగుంటుందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. వేదిక మారింది కానీ సీన్ మాత్రం మారలేదన్న అశ్విన్, సిరాజ్ చాలా సున్నిత మనస్కుడు కావడంతో తనకు బాధగా ఉందని చెప్పాడు. ఈరోజు సిరాజ్‌కు జరిగింది రేపు మరొకరికి జరగొచ్చని, జట్టులో అస్థిరత నెలకొంటోందని హెచ్చరించాడు.

గుర్నూర్ బ్రార్‌ను స్క్వాడ్‌లోకి.. సిరాజ్ కి నో ఛాన్స్: 

తుది జట్టులో సుదీర్ఘకాలం కొనసాగాలంటే సిరాజ్ ముందున్న ఏకైక దారి అసాధారణ ప్రదర్శన చేయడమే.. తదుపరి అవకాశం వచ్చినప్పుడు గంటకు 145 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి ఐదు వికెట్ల ప్రదర్శన చేస్తే తప్ప వేరే మార్గం లేదని తేల్చిచెప్పాడు. పాత పర్ఫార్మర్లను పక్కన పెట్టి మేనేజ్‌మెంట్ పూర్తిగా కొత్త దిశగా వెళ్తున్నట్లు కనిపిస్తోందని, సిరాజ్‌కు ఇది అంత తేలికైన ముగింపు కాదని అన్నాడు.

రహానే, మురళీ కార్తీక్ ఆవేదన: 

హాగ్లే ఓవల్‌లో రెండో టెస్టుకు కూడా సిరాజ్‌ను పక్కన పెట్టడంతో, టాస్ తర్వాత అతను సన్‌గ్లాసెస్‌తో కళ్లను కవర్ చేసుకుని కనిపించాడు. సోనీ స్పోర్ట్స్‌లో ఈ దృశ్యాలపై అజింక్య రహానే, మురళీ కార్తీక్ స్పందించారు. సిరాజ్ దృశ్యాలను చూస్తూ రహానే స్పందించగా, అతను ఏడుస్తున్నాడా? అని మురళీ కార్తీక్ ప్రశ్నించారు. డిఎస్పీ భాయ్ చాలా ఎమోషనల్ గా ఉండే ఆటగాడు కావడంతో ఖచ్చితంగా లోపల బాధపడుతుంటాడని కార్తీక్ అన్నారు. 

ALSO READ : 20వ సీజన్‌కు నేను రెడీ, పల్టాన్‌కు పండగే.. కెప్టెన్గా రీఎంట్రీ తర్వాత రోహిత్ ఫస్ట్ రియాక్షన్

వన్డే సిరీస్‌లోనూ బెంచ్‌కే పరిమితం చేయడం, స్వదేశంలో వెస్టిండీస్ వన్డే సిరీస్‌లోనూ చివరి మ్యాచ్‌లోనే ఛాన్స్ ఇవ్వడం అతడిని బాధపెట్టే విషయాలని కార్తీక్ చెప్పారు. సంఖ్యలు చూస్తే నాకు ఆశ్చర్యమేస్తోంది.. ఆడించనప్పుడు అసలు స్క్వాడ్‌లోకి తీసుకోకండి.. ఫామ్ సరిగా లేదనో, నెట్స్‌లో బాగా వేయడం లేదనో అనిపిస్తే టూర్‌కు తీసుకెళ్లొద్దు, తీసుకెళ్లి కూర్చోబెట్టడం వల్ల ఏంటీ ప్రయోజనం అని మురళీ కార్తిక్ నిలదీశాడు.