కూలీ పనిచేసుకుని బతికే వృద్ధురాలు. రోజు మాదిరిగానే పని పూర్తయ్యాక ఇంటికి వెళ్తున్న సమయంలో దారుణానికి ఒడిగట్టాడు ఓ దుండగుడు. అది కూడా రైల్వే స్టేషన్ టాయిలెట్ లో వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడటం సంచలనంగా మారింది. మహారాష్ట్ర ముంబైలో జరిగిన ఈ దారుణ ఘటన జరగటం స్థానికంగా కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. ఘాట్కోపర్ రైల్వే స్టేషన్‌లోని పబ్లిక్ టాయిలెట్‌లో 60 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేశాడు నిందితుడు. 2026 నవంబర్ 26 (గురువారం ) రాత్రి ఈ ఘటన జరిగినట్లు రైల్వే పోలీసులు (జీఆర్పీ) శుక్రవారం వెల్లడించారు.
బాధితురాలు కూలీ పనుల కోసం ప్రతిరోజూ ఘాట్కోపర్ వస్తుంటారు. గురువారం పని ముగించుకుని తన 18 ఏళ్ల కుమార్తెతో కలిసి రైలు ఎక్కేందుకు స్టేషన్‌కు చేరుకున్నారు. రాత్రి 11:12 గంటల సమయంలో ఆమె ప్లాట్‌ఫామ్ నంబర్ 2 మీద ఉన్న టాయిలెట్‌కు వెళ్లారు. ఆ సమయంలో అక్కడ సిబ్బంది లేదా గార్డులు ఎవరూ లేకపోవడంతో దారుణానికి దిగాడు దుండగుడు.
స్టేషన్‌లోని సీసీటీవీ దృశ్యాల ప్రకారం.. వృద్ధురాలు టాయిలెట్‌లోకి వెళ్లిన కాసేపటికే 25 ఏళ్ల యువకుడు లోపలికి వెళ్లాడు. నిందితుడు తలుపు గడియ పెట్టి ఆమెపై అత్యాచారం చేయడమే కాకుండా, నుదుటిపై దాడి చేసి గాయపరిచినట్లు పోలీసులు చెప్పారు. నిందితుడు రాత్రి 11:19 గంటలకు బయటకు వచ్చి మెట్రో స్టేషన్ వైపు వేగంగా వెళ్లడం సీసీటీవీలో రికార్డు అయింది.
రాత్రి 11:22 గంటల సమయంలో బాధితురాలు బయటకు వచ్చి తన కుమార్తెకు విషయం చెప్పింది. వారిద్దరూ ప్లాట్‌ఫామ్ నంబర్ 4 దగ్గర ఉన్న జీఆర్పీ డెస్క్ దగ్గర ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు బాధితురాలిని చికిత్స కోసం రాజావాడి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు తస్లీమ్ నూర్ మహ్మద్‌ను ఘాట్కోపర్ లోని అసల్ఫా ప్రాంతంలో పోలీసులు పట్టుకున్నారు. నిందితుడికి గతంలో ఏదైనా నేర చరిత్ర ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
