మాజీ ఎంపీ, ప్రముఖ నటి 37 ఏళ్ల వయస్సులో పెళ్లి

మాజీ ఎంపీ, ప్రముఖ నటి 37 ఏళ్ల వయస్సులో పెళ్లి

కోల్‎కతా: బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మాజీ ఎంపీ మిమీ చక్రవర్తి 37 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నారు. మెరైన్ ఇంజనీర్ సిద్ధార్థ దత్తాను ఆమె వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో 2026, నవంబర్ 26న కోల్‌కతాలో వీరిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్‎లోని కలింపాంగ్‌లో డిసెంబర్ 5న సంప్రదాయ పద్ధతిలో వివాహం జరగనుంది. ఈ వేడుకలు మూడు రోజుల పాటు కొనసాగుతాయని సమాచారం. 

అనంతరం జల్ పాయ్ గురిలో రిసెప్షన్ నిర్వహించనున్నారు. చిత్ర పరిశ్రమకు చెందిన స్నేహితులు, సహచరుల కోసం డిసెంబర్ 11న కోల్‌కతాలో గ్రాండ్ రిసెప్షన్ ఇవ్వనున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. తన వివాహానికి సంబంధించిన ఫోటోలను మిమీ చక్రవర్తి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలో.. మిమీ, సిద్ధార్థ తెలుపు, బంగారు రంగు దుస్తులు ధరించి పెళ్లి పత్రాలపై సంతకాలు చేస్తున్నారు. ఈ నూతన జంటకు సోషల్ మీడియాలో అభిమానుల నుంచి అభినందనలు వెలువెత్తుతున్నాయి. 

మిమీ మూవీ కెరీర్

దివంగత దర్శకుడు రితుపర్ణో ఘోష్ రూపొందించిన ‘గానెర్ ఒపారే’ సీరియల్ తో మిమీ చక్రవర్తి కెరీర్ ప్రారంభించారు. ‘శుధు తోమారి జొన్యో’, ‘గాంగ్‌స్టర్’, ‘పోస్తో’, ‘డ్రాకులా సర్’, ‘భానుప్రియ భూతేర్ హోటల్’ వంటి చిత్రాల్లో నటించారు. ఇటీవల సృజిత్ ముఖర్జీ దర్శకత్వంలో ‘ఎంపరర్ వర్సెస్ శరత్ చంద్ర’ చిత్రంలో కనిపించారు. ‘జహా బొలిబో శొత్తో బొలిబో’, ‘డైనీ’ వంటి ఓటీటీ షోలలోనూ నటించారు.

సినీ ఇండస్ట్రీ నుంచి పొలిటికల్ ఎంట్రీ

టెలివిజన్, సినిమా రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మిమీ చక్రవర్తి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా జాదవ్ పూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. 17వ లోక్ సభలో ఎంపీగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే, 2024, ఫిబ్రవరి 15న తన ఎంపీ పదవికి ఆమె రాజీనామా చేశారు.