పాలు తాగడం వల్ల లివర్ క్యాన్సర్ ముప్పు పెరుగుతుందా..? పరిశోధకులు చెప్పిన షాకింగ్ విషయాలు!

పాలు తాగడం వల్ల లివర్ క్యాన్సర్ ముప్పు పెరుగుతుందా..? పరిశోధకులు చెప్పిన షాకింగ్ విషయాలు!

పాలు ఆరోగ్యానికి మంచివని, వాటిని రోజూ తాగడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయని మనకు తెలుసు. ముఖ్యంగా కాల్షియం, ప్రోటీన్లు వంటి పోషకాలు పాల ద్వారా లభిస్తాయి. అయితే పాలు, పాలకు బదులుగా ఉపయోగించే కొన్ని ప్రత్యామ్నాయ పానీయాలు తీసుకోవడం వల్ల కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరిగే అవకాశం ఉందని ఒక అధ్యయనం వెల్లడించింది.

ముఖ్యంగా పాలు లేదా పాల ప్రత్యామ్నాయాలను ఎక్కువగా తీసుకునే వారిలో కాలేయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే దీనికి తోడు  కాలేయంలో పేరుకుపోయే కొవ్వు, దాని వల్ల వచ్చే జీవక్రియ సంబంధిత సమస్యలు కూడా ఒక కారణం కావచ్చని వారు చెబుతున్నారు.

అసలు ఈ అధ్యయనం ఏం చెబుతోంది?
ఈ అధ్యయనంలో హెపటోసెల్యులర్ కార్సినోమా (HCC) అనే ఒక రకమైన కాలేయ క్యాన్సర్‌పై పరిశోధన చేశారు. కాలేయంలో వచ్చే క్యాన్సర్లలో HCC చాలా ముఖ్యమైన రకం. ఈ క్యాన్సర్‌కు పాలు, పాల ప్రత్యామ్నాయాల వినియోగానికి ఏమైనా సంబంధం ఉందా ? ఒకవేళ సంబంధం ఉంటే, కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం కూడా దీనికి కారణమవుతుందా ? అనే విషయాలను పరిశోధకులు పరిశీలించారు. ఈ పరిశోధన కువైట్‌లోని ఆరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగింది.

ఇందులో కాలేయ క్యాన్సర్ ఉన్న 53 మంది రోగులను పరిశీలించారు. ఇంకా కాలేయ క్యాన్సర్ లేని 196 మందిని ఎంపిక చేసుకున్నారు.
వీరందరినీ నేరుగా ఇంటర్వ్యూ చేసి, వారి ఆహారపు అలవాట్ల గురించి వివరాలు సేకరించారు. ముఖ్యంగా పాలు, పాలకు బదులుగా తీసుకునే పానీయాలను ఎంత తరచుగా తాగుతున్నారనే విషయాన్ని తెలుసుకున్నారు.

ఇంకా వారి వినియోగాన్ని రెండు రకాలుగా విభజించారు. ఒకటి వారానికి మూడు గ్లాసుల కంటే తక్కువ తాగే వారు.
మరొకటి వారానికి మూడు గ్లాసులు లేదా అంతకంటే ఎక్కువ తాగే వారు. ఈ వివరాలను విశ్లేషించి, పాలు తాగే అలవాటుకు కాలేయ క్యాన్సర్‌కు మధ్య ఏమైనా సంబంధం ఉందా అని పరిశోధించారు.

పాలు తాగేవారిలో క్యాన్సర్ ప్రమాదం  
ఈ అధ్యయనంలో పరిశోధకులు ఒక ఆసక్తికరమైన విషయాన్ని గుర్తించారు. పాలు, పాల ప్రత్యామ్నాయాలను తీసుకునే వారిలో కాలేయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తీసుకోని వారితో పోలిస్తే దాదాపు ఆరు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గణాంకాల విశ్లేషణలో తేలింది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆరు రెట్లు ఎక్కువగా ఉందని చెప్పడం వల్ల పాలు తాగడం నేరుగా క్యాన్సర్‌కు కారణమవుతుందని  కాదు. ఈ అధ్యయనం రెండు విషయాల మధ్య సంబంధాన్ని మాత్రమే గుర్తించింది. పాలు తాగడం వల్లే క్యాన్సర్ వచ్చిందని నిరూపించలేదు.

కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి, క్యాన్సర్‌కు సంబంధం ఏమిటి?
ఈ అధ్యయనంలో మరో ముఖ్యమైన అంశం MASLD. MASLD అంటే జీవక్రియ సంబంధిత సమస్యల కారణంగా కాలేయంలో కొవ్వు పేరుకుపోయే పరిస్థితి. సాధారణంగా అధిక బరువు, పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం, మధుమేహం, రక్తంలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండటం వంటి సమస్యలు ఉన్నవారిలో ఈ పరిస్థితి కనిపించవచ్చు. కాలేయంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతే కాలక్రమేణా కాలేయానికి వాపు, దెబ్బతినడం, మచ్చలు ఏర్పడటం వంటి సమస్యలు రావచ్చు. కొంతమందిలో ఈ పరిస్థితి మరింత తీవ్రమై కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని కూడా పెంచవచ్చు. పరిశోధకులు పాలు, పాల ప్రత్యామ్నాయాల వినియోగం ఇంకా కాలేయ క్యాన్సర్ మధ్య ఉన్న సంబంధంలో MASLD ఎంతవరకు పాత్ర పోషిస్తుందో కూడా పరిశీలించారు.

మరి పాలు తాగడం పూర్తిగా మానేయాలా?
ఈ అధ్యయనం ఆధారంగా అందరూ పాలు తాగడం మానేయాలని చెప్పలేం. ఎందుకంటే ఈ పరిశోధనలో పాల్గొన్న వారి సంఖ్య చాలా తక్కువ. అంతేకాకుండా, వారు గతంలో ఎంత పాలు తాగారనే విషయాన్ని వారి సొంత సమాచారంపైనే ఆధారపడి తెలుసుకున్నారు. అలాగే ఇది ఒక నిర్దిష్ట సమయంలో వ్యక్తుల ఆరోగ్య పరిస్థితులను పోల్చి చేసిన పరిశోధన. అందువల్ల పాలు తాగడం వల్లే కాలేయ క్యాన్సర్ వచ్చిందని ఖచ్చితంగా చెప్పడానికి వీలులేదు. పాల రకాలు, వాటిలోని కొవ్వు శాతం, చక్కెర కలిపిన పాల పానీయాలు, వ్యక్తుల ఇతర ఆహారపు అలవాట్లు వంటి అంశాలను కూడా భవిష్యత్తులో మరింత వివరంగా పరిశీలించాల్సి ఉంది.

కాలేయ ఆరోగ్యం కోసం ఏం చేయాలి?
కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
*శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి.
*రోజూ తగినంత శారీరక వ్యాయామం చేయాలి.
*మధుమేహం, రక్తంలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండటం వంటి సమస్యలను కంట్రోల్లో ఉంచుకోవాలి.
*బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవాలి.
*చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు, హై  కేలరీల ఆహారాన్ని లిమిట్ చేయాలి.
*కాలేయంలో కొవ్వు పేరుకుపోయే సమస్య ఉన్నట్లు తెలిస్తే వైద్యుల సలహా మేరకు పరీక్షలు, చికిత్స చేయించుకోవాలి.

చివరిగా ఏంటంటే ఈ అధ్యయనం పాలు తాగడం వల్ల కాలేయ క్యాన్సర్ వస్తుందని నిరూపించలేదు. అయితే పాలు, పాల ప్రత్యామ్నాయాల వినియోగానికి, కాలేయ క్యాన్సర్ ప్రమాదానికి మధ్య ఒక సంబంధం ఉండవచ్చని సూచించింది. ఇందులో కాలేయంలో కొవ్వు పేరుకుపోయే MASLD సమస్య కూడా కొంతవరకు ఉండొచ్చని  వెల్లడించింది. ఈ విషయాన్ని మరింత స్పష్టంగా తెలుసుకోవడానికి పెద్ద సంఖ్యలో ప్రజలపై, ఎక్కువ కాలం పాటు పరిశోధనలు చేయాల్సి ఉంది. కాబట్టి ఈ ఒక్క అధ్యయనాన్ని చూసి పాలు తాగడం మానేయాల్సిన అవసరం లేదు. పాలు తాగడం వల్లే కాలేయ క్యాన్సర్ వస్తుందని భయపడకుండా, బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకుంటూ కాలేయ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ముఖ్యం.