న్యూఢిల్లీ: నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల బిల్లులపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంట్లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహాలపై చర్చించేందుకు శనివారం (నవంబర్ 28) ప్రతిపక్ష ఇండీ కూటమి భేటీ అయ్యింది. ఢిల్లీలోని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ఈ భేటీ జరిగింది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, పవన్ ఖేరా ఈ భేటీకి హాజరయ్యారు.
సమాజ్వాదీ పార్టీ, సీపీఐ, సీపీఎం, ఆర్జేడీ, టీఎంసీ ప్రతినిధులు కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న రాజ్యాంగ సవరణ బిల్లును ఎలా ఎదుర్కోవాలనే అంశంపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఇండీ కూటమిలోని డీఎంకే, ఎన్సీపీ ఎస్పీ పార్టీలు కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీకి ఆ పార్టీల ప్రతినిధులు హాజరు కాలేదు. ఈ పరిణామం ఇండీ కూటమికి భారీ ఎదురు దెబ్బగా మారింది.
2026, నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. లోక్సభలో నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీల్లో, రాజ్యసభలో డిసెంబర్ 2, 3 తేదీల్లో చర్చ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేసేందుకు వీలుగా లోక్సభ, అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచే నిబంధనను కొత్త బిల్లులో కేంద్ర ప్రభుత్వం చేర్చినట్లు సమాచారం. ఎన్సీపీ ఎస్సీ, డీఎంకే మద్దతు ప్రకటించడంతో గతంలో వీగిపోయిన డీలిమిటేషన్తో కూడిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఈసారి ఆమోదం పొందడటం ఖాయమని దేశ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
డీఎంకే మద్దతు
కేంద్ర ప్రభుత్వం సవరించిన పునర్విభజన బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు తమిళనాడు సీఎం ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రకటించింది. తమ డిమాండ్లను కేంద్రం పరిష్కరించిందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, తమిళనాడుకు ప్రస్తుతం ఉన్న 7.18 శాతం సీట్ల వాటాను తగ్గించకూడదని డీఎంకే తీర్మానం చేసింది. 1971 జనాభా లెక్కల ఆధారంగా ఉన్న ప్రస్తుత ప్రాతినిధ్యాన్ని మరో 25 ఏళ్ల పాటు మార్చకూడదని డిమాండ్ చేసింది.
పార్టీల మధ్య విమర్శలు
పునర్విభజన అంశంపై కాంగ్రెస్ వైఖరిని డీఎంకే విమర్శించింది. కాంగ్రెస్ గతంలో ఒకలా చెప్పి ఇప్పుడు మాట మార్చిందని ఆరోపించింది. అటు ఎన్సీపీ శరద్ పవార్ వర్గం బిల్లుకు మద్దతు ఇవ్వడంపై మహారాష్ట్ర కాంగ్రెస్ నేత విజయ్ వడెట్టివార్ మండిపడ్డారు. ఇది ఇండియా కూటమికి వెన్నుపోటు పొడవడమేనని ఆరోపించారు. సిద్ధాంతాల కంటే అధికారం, డబ్బుకే ఆ పార్టీ ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు.
ప్రభుత్వ వైఖరి
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఉద్దేశాన్ని బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది వివరించారు. మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. దేశం ఆర్థికంగా, సామాజికంగా మారుతున్న వేళ పార్లమెంట్ కూడా కొత్త రూపు సంతరించుకోవాలని, అందుకే పునర్విభజన బిల్లు తెస్తున్నట్లు పేర్కొన్నారు. నవంబర్ 29న బీజేపీ ఎంపీలందరూ సమావేశం కావాలని ఆ పార్టీ ఆదేశించింది.
ALSO READ : మోడీ సర్కార్కు బిగ్ రిలీఫ్: డీలిమిటేషన్ బిల్లుకు DMK మద్దతు..!
ఇతర నేతల స్పందన
నియోజకవర్గాల సంఖ్య పెంచడం అవసరమేనని జేఎంఎం నేత మనోజ్ పాండే అభిప్రాయపడ్డారు. అయితే అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించిన తర్వాతే ముందుకు వెళ్లాలని కోరారు. కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే బాగుండేదని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ చెప్పారు. బీజేపీకి దేశ సరిహద్దుల కంటే ఎన్నికల సరిహద్దులే ముఖ్యమని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ విమర్శించారు.
