దాహం తీర్చుకోవడానికి అత్యంత సురక్షితమని నమ్మి కొనుగోలు చేసే ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిళ్ల నాణ్యతపై ఇప్పుడు తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా మినరల్ వాటర్ మార్కెట్లో అగ్రగామిగా ఉన్న ‘బిస్లరీ’ సంస్థకు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్(FSSAI) వరుసగా భారీ షాకులు ఇస్తోంది. మొన్నటికి మొన్న గోవా ప్లాంట్‌పై చర్యలు తీసుకున్న ఆహార భద్రతా నియంత్రణ సంస్థ.. తాజాగా పశ్చిమ బెంగాల్‌లోని బిస్లరీ ప్లాంట్ వాటర్ బాటిళ్ల శాంపిల్స్ కూడా ల్యాబ్ పరీక్షల్లో విఫలమవడంతో ప్రాసిక్యూషన్‌కు అనుమతి మంజూరు చేసింది.
పశ్చిమ బెంగాల్‌లోని జల్పైగురి జిల్లా తేలిపారా గ్రామంలో ఉన్న బిస్లరీ ప్లాంట్ నుంచి సేకరించిన నీటి శాంపిల్స్‌లో ప్రమాదకరమైన 'కోలిఫామ్ బ్యాక్టీరియా' ఉన్నట్లు ప్రాథమిక, రెఫరల్ ల్యాబ్ పరీక్షల్లో నిర్ధారణ అయింది. మురుగునీటి లీకేజీ లేదా దెబ్బతిన్న పైపుల ద్వారా ఈ బ్యాక్టీరియా నీటిలోకి చేరే అవకాశం ఉంటుంది. దీనిని తీవ్రంగా పరిగణించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆగస్టు 12, 2026న బ్యాచ్ PB 201 అమ్మకాలను నిషేధించింది. ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘన కింద బిస్లరీ ఇంటర్నేషనల్పై చట్టపరమైన చర్యలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కంపెనీ సదరు బ్యాచ్ వాటర్ బాటిళ్లను రీకాల్ చేసింది మార్కెట్ నుంచి. అసలు ట్విస్ట్ ఏంటంటే తాము చేసిన ఇండిపెండెంట్ టెస్టుల్లో ఎలాంటి క్వాలిటీ డీవియేషన్స్ జరగలేదని అన్నీ ఫుడ్ సేఫ్టీ నిబంధనలకు లోబడే ఉన్నాయని తాజాగా బిస్లరీ సంస్థ ప్రకటించింది.
గత వారం కూడా గోవాలోని బిస్లరీ ప్లాంట్‌పై ఎఫ్ఎస్ఎస్ఏఐ ఇలాంటి చర్యలే ప్రకటించింది. అక్కడ సేకరించిన నీటిలో పరిమితికి మించి బ్రోమేట్, అలాగే హానికరమైన పాలీన్యూక్లియర్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్(PAHs) ఉన్నట్లు తేలడంతో ఆ నీరు తాగడానికి సురక్షితం కాదని తేల్చింది. అయితే తమ ఉత్పత్తులు సురక్షితమేనని, అధికారులకు పూర్తిగా సహకరిస్తామని బిస్లరీ క్లారిఫై చేసింది.
ALSO READ : మేమూ విమానాలు నడుపుతాం పర్మిషన్ ఇవ్వండి.. మోడీ ప్రభుత్వానికి అదానీ రిక్వెస్ట్
ప్రజల్లో భయాందోళనలు సృష్టించడానికి కాకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చూడటానికే దేశవ్యాప్తంగా ప్యాకేజ్డ్ వాటర్ నమూనాలను సేకరిస్తున్నామని ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అధికారి రజిత్ పున్హాని తెలిపారు. రానున్న రోజుల్లో ఆహార పదార్థాల ప్యాకేజింగ్ మెటీరియల్‌పై కూడా తనిఖీలు ముమ్మరం చేస్తామని వెల్లడించారు. ఇదంతా ఇలా ఉంటే ఈ దాడులు కేవలం అంబానీ వాటర్ బిజినెస్ కి లాభం చేకూర్చేందుకే అనే వాదనలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. పెద్ద షేర్ ఉన్న కంపెనీ పేరు కరాబ్ చేసేందుకే ఇలాంటి పనులు జరుగుతున్నాయ్ అని కొందరు ఆరోపిస్తున్నారు. తాజాగా అంబానీ తెచ్చిన జియో ఆస్ట్రో విషయంలోనూ ప్రకటనకు కొన్ని నెలల ముందు ప్రత్యర్థి సంస్థ ఆస్ట్రోటాక్ పై పన్ను సోదాలు జరిగిన విషయం తెలిసిందే.
