మెటాలో రూ.9 కోట్ల జాబ్ వదులుకున్న హైదరాబాద్ మహిళ.. ఈమె ప్లానింగ్ మామూలుగా లేదుగా!

మెటాలో  రూ.9 కోట్ల జాబ్ వదులుకున్న హైదరాబాద్ మహిళ.. ఈమె ప్లానింగ్ మామూలుగా లేదుగా!

ఆమెది పితృస్వామ్య భావజాలం ఉన్న కుటుంబం.. అంటే ఆడపిల్లలకు ఉద్యోగాలు ఎందుకు.. ఏదో చదివారు అయిపోయింది.. పెళ్లి చేసుకుని.. ఇల్లు చూసుకుంటూ ఉండక.. అనే మనస్తత్వం. అలాంటి కుటుంబం నుంచి వచ్చి.. ఉస్మానియా యూనివర్సిటీలో చదివి.. అక్కడి నుంచి అమెరికా వరకు.. మోర్గాన్ స్టాన్లీ, అమెజాన్, మెటా లాంటి పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసిన అనుభవం. అంత ఉన్నత స్థానాలను అందుకున్న మహిళ తన 9 కోట్ల రూపాయల ఉద్యోగానికి రాజీనామా చేసిన న్యూస్ ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. 

వివరాల్లోకి వెళ్తే..  మెటా కంపెనీలో ఏడాదికి సుమారు 9 కోట్ల 29 లక్షల  (1 మిలియన్ డాలర్లు) జీతం తీసుకుంటున్న బాల సాహిత్య వడ్లమాని తన ఉద్యోగాన్ని వదిలేశారు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఆమె, బిగ్ టెక్ కంపెనీల్లో ఉన్నత స్థానాలను అధిరోహించిన తర్వాత సొంతంగా అడ్వైజరీ ప్రాక్టీస్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.

పితృస్వామ్య భావజాలం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన తనకు, సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ కోసమే అమెరికా వెళ్లాలని నిశ్చయించుకున్నట్లు బాల సాహిత్య ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆమె, అక్కడ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. అకడమిక్ ఎక్సలెన్స్ కోసం ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ నుంచి ప్రశంసలు అందుకున్నారు. అనంతరం అమెరికాలోని డార్ట్ మౌత్ కాలేజీలో మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ పూర్తి చేశారు. మాస్టర్స్ ప్రోగ్రామ్ సమయంలో డ్యూక్ యూనివర్సిటీలో ఎక్స్ఛేంజ్ స్టూడెంట్ గా చదివి 4.0 జీపీఏ సాధించారు.

కెరీర్ ప్రయాణం

బాల సాహిత్య తన వృత్తిని మోర్గాన్ స్టాన్లీ కంపెనీలో టెక్నాలజీ అనలిస్ట్ గా ప్రారంభించారు. అక్కడ ఆమె ప్రారంభ జీతం ఏడాదికి 1.10 లక్షల డాలర్లు (సుమారు రూ.1.02 కోట్లు). ఆ తర్వాత ఆమె అమెజాన్ లో చేరారు. అక్కడ అలెక్సాలో ఆడియో ఎంటర్‌టైన్‌మెంట్, పేమెంట్స్ విభాగాల్లో పనిచేశారు. అమెజాన్ లో ఆమె జీతం మోర్గాన్ స్టాన్లీ కంటే రెట్టింపు అయ్యింది.

కొన్నేళ్ల తర్వాత ఆమె ఫేస్ బుక్ మాతృసంస్థ అయిన మెటా కంపెనీలోకి మారారు. అక్కడ ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ వంటి సెక్యూరిటీ ఫీచర్లపై పనిచేశారు. మెటాలో ఆమె  ప్యాకేజీ 1 మిలియన్ డాలర్లకు పైగా చేరింది. తన 28 ఏళ్ల వయసులో మిలియనీర్ అయ్యానని, 31 ఏళ్ల నాటికి ఏడాదికి 1 మిలియన్ డాలర్లకు పైగా సంపాదించినట్లు ఆమె తన లింక్డ్ ఇన్ ప్రొఫైల్ లో పేర్కొన్నారు.

వీసా సమస్యలు

అమెరికాలో బాల సాహిత్య ప్రయాణం సులభంగా సాగలేదు. ఎఫ్-1 స్టూడెంట్ వీసాపై అక్కడికి వెళ్లిన ఆమెకు, మూడో ప్రయత్నంలో హెచ్-1బీ వీసా లభించింది. అది కూడా రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ (ఆర్ఎఫ్ఈ) తర్వాతే అప్రూవ్ అయ్యింది. ఆ తర్వాత ఆమె ఓ-1 వీసాకు మారి, అనంతరం అత్యుత్తమ ప్రతిభ ఉన్న వారికి ఇచ్చే ఈబీ-1ఏ వీసాను కూడా సాధించారు.

బిగ్ టెక్ నుంచి రాజీనామా

అత్యధిక జీతం వస్తున్నప్పటికీ, జీవితానికి ఒక అర్థం ఉండాలనేది ఆమె ఉద్దేశం. జీతం ముఖ్యం కాదు.. నచ్చిన పని చేయడం ముఖ్యం అంటూ ఆమె బిగ్ టెక్ కంపెనీల నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం ఆమె సొంతంగా అడ్వైజరీ ప్రాక్టీస్ నిర్వహిస్తూ, స్టార్టప్ వ్యవస్థాపకులకు ప్రోడక్ట్ స్ట్రాటజీ, ఏఐ ఇంటిగ్రేషన్ అంశాల్లో సలహాలు ఇస్తున్నారు. 

ALSO READ : మేమూ విమానాలు నడుపుతాం పర్మిషన్ ఇవ్వండి.. మోడీ ప్రభుత్వానికి అదానీ రిక్వెస్ట్

వృత్తిలో మార్పు కోరుకునే వారికి ఆమె ఒక మూడు ప్రశ్నల సూత్రం సూచించారు. కొత్త ఉద్యోగం వల్ల మెరుగైన వ్యక్తులు పరిచయం అవుతారా, ప్రస్తుత ఉద్యోగంలో లేని కొత్త నైపుణ్యాలు వస్తాయా, భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు లభిస్తాయా అని ప్రశ్నించుకోవాలని చెప్పారు. వీటిలో కనీసం రెండింటికి సానుకూల సమాధానం వస్తే ఉద్యోగం మారవచ్చని ఆమె వివరించారు.