రెండో టెస్టులో పీకల్లోతు కష్టాల్లో గిల్ సేన.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు ఆవిరేనా..? 

రెండో టెస్టులో పీకల్లోతు కష్టాల్లో గిల్ సేన.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు ఆవిరేనా..? 

Team India WTC Final Hopes: క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లే ఓవల్‌లో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్ 116/6 దగ్గర నిలిచి, ఇంకా 240 పరుగులు వెనుకబడి ఉంది. తొలి టెస్టు డ్రా కావడంతో ఈ మ్యాచ్ గెలవడం టీమిండియాకు తప్పనిసరి అయింది. కానీ న్యూజిలాండ్ పేసర్ల స్వింగ్, బౌన్స్ ముందు భారత టాప్ ఆర్డర్ తడబడటంతో మ్యాచ్ చేజారే ప్రమాదం కనిపిస్తోంది. ప్రస్తుతం భారత్ 50 శాతం పాయింట్లతో పట్టికలో వెనుకబడ్డ జట్లలో ఒకటిగా నిలవడంతో, ఫైనల్ రేసులో నిలవాలంటే అద్భుతం జరిగి ఈ మ్యాచ్‌ను గెలవడంతో పాటు మిగిలిన మ్యాచ్‌లలోనూ వరుస విజయాల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

జురెల్ పైనే టీమిండియా భవితవ్యం: 

మూడో రోజు ఆటలో ధృవ్ జురెల్ (7*)తో కలిసి టెయిలెండర్లు ఎంతసేపు క్రీజులో నిలబడి లోటును తగ్గిస్తారనే దానిపైనే టీమిండియా భవితవ్యం ఆధారపడి ఉంది. ఫీల్డింగ్‌లో క్యాచ్‌లు చేజారడం, ఆరంభాలు దక్కినా భారీ ఇన్నింగ్స్‌లుగా మార్చలేకపోవడం ఇండియన్ టీమ్ కు పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. ఈ టెస్టులో ఓడిపోతే 2025–27 డబ్ల్యూటీసీ ఫైనల్ దారి మరింత కష్టంగా మారుతుంది కాబట్టి, ఫైనల్ ఆశలు పూర్తిగా ఆవిరవకుండా ఉండాలంటే భారత్ అసాధారణ ఆటతీరు కనబరచాల్సిందే.

ఫీల్డింగ్‌లో తడబాటు.. బౌలింగ్‌లో శ్రమ: 

రోజంతా బంతితోనూ, ఫీల్డింగ్‌లోనూ భారత్ ఇబ్బంది పడింది. 49 పరుగుల దగ్గర గల్లీలో టామ్ బ్లండెల్ క్యాచ్ జారవిడవడంతో, అతను 89 పరుగులతో కివీస్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చివరకు గుర్నూర్ బ్రార్ బౌలింగ్‌లో లాంగ్ లెగ్‌లో అవుటయ్యాడు. ఆకాశ్ దీప్ (5/99) ఐదు వికెట్లు తీసినా, అతని బౌలింగ్‌లో 3 క్యాచ్‌లు నేలపాలయ్యాయి. బుమ్రాకు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. కివీస్ చివరి వరుస బ్యాటర్లు 66 రన్స్ జోడించడం ఆతిథ్య జట్టుకు పెద్ద బలం ఇచ్చింది.

వెల్లింగ్టన్ నుంచి క్రైస్ట్‌చర్చ్‌కు మారిన సీన్

* వెల్లింగ్టన్ తొలి టెస్టులో ఒకే ఇన్నింగ్స్‌లో 720/9 చేసిన భారత బ్యాటర్లు, హాగ్లే ఓవల్‌లో స్వింగ్, బౌన్స్ ముందు నిలబడలేకపోయారు. 

* టాప్ ఆర్డర్ పతనం: ఆరో బంతికే యశస్వి జైస్వాల్ సున్నాకు ఔట్ కాగా, కైల్ జేమీసన్ బౌలింగ్‌లో దేవదత్ పడిక్కల్ (21) కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. జేమీసన్ బౌన్స్‌తో ఇబ్బంది పెట్టగా, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (17) స్లిప్స్‌లో వెనుదిరిగాడు.

* పంత్, రాహుల్ అవుట్: జాకబ్ డఫీ బౌలింగ్‌లో పెద్ద షాట్‌కు వెళ్లి రిషబ్ పంత్ (23) వికెట్ పారేసుకోగా, మోకాలిపై కూర్చుని డ్రైవ్ ఆడబోయిన కేఎల్ రాహుల్ (25) పాయింట్‌లో డెవాన్ కాన్వే చేతికి చిక్కాడు.

* ఆఖరి బంతి షాక్: చివరి సెషన్‌లో సుమారు 90 నిమిషాల పాటు జురెల్ (45 బంతుల్లో 7*), సుందర్ (60 బంతుల్లో 10) నెమ్మదిగా ఆడినా, రోజు ఆఖరి బంతికి నాథన్ స్మిత్ వేసిన షార్ట్ బాల్‌ను సుందర్ స్లిప్స్‌లో లాథమ్ చేతిలో పెట్టాడు. కివీస్ టెయిలెండర్లలాగే మూడో రోజు మన లోయర్ ఆర్డర్ నిలబడితే తప్ప లోటు తగ్గడం కష్టం.