హైదరాబాద్: నగరంలోని బావర్చి హోటల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగిన ఘర్షణపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జ్ మన్నె క్రిశాంక్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదైంది.కాంగ్రెస్ నాయకుడు వెంకట తేజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు BNS సెక్షన్లు 118(1), 352, 191(3), 190 కింద కేసు నమోదు చేశారు.
రాహుల్ గాంధీ చిత్రపటంతో అవమానకరంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులను అడ్డుకునేందుకు వెళ్లిన తమపై దాడికి పాల్పడ్డారని వెంకట తేజ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. హోటల్లో లైట్లు ఆపివేసి మరీ దాడి చేశారని, ఈ ఘటనలో కాంగ్రెస్ నాయకులకు చెందిన సుమారు 10 తులాల బంగారం చోరీకి గురైందని ఆరోపించారు.
ఫిర్యాదు స్వీకరించిన చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హోటల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తూ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఫుటేజ్ ఆధారంగా ఘర్షణకు దారితీసిన పరిస్థితులు, దాడి ఆరోపణలు, బంగారం చోరీ ఆరోపణలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
