ఎల్ నినో కొన్ని దేశాలను ఎండబెడుతుంటే.. మరికొన్ని దేశాలను నీట ముంచుతోంది. ఎల్ నినో పరిస్థితులతో పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న ఉష్ణోగ్రత మార్పులతో కొన్ని దేశాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పెరూ, ఈక్వెడార్ దేశాల్లో 12 గంటలు నాన్ స్టాప్ గా కురిసిన వానకు.. ఆ దేశాల్లో పట్టణాలు, గ్రామాలు జలదిగ్బంధంలో మునిగిపోయాయి.
పెరూ, ఈక్వెడార్ దేశాల్లో ఎల్ నినో ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలమైంది. పెరూలోని పియురా సిటీలో 2026 నవంబర్ 26( గురువారం) నుంచి 12 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి వీధులన్నీ నదులను తలపిస్తున్నాయి.
నార్తర్న్ పెరూలోని పియురా రాష్ట్ర రాజధాని పియురాలో భారీ వర్షాల వల్ల నడుము లోతు నీరు చేరింది. ఇక్కడ దాదాపు 2 వేల కుటుంబాలు ప్రభావితమైనట్లు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ చీఫ్ లూయిస్ వాస్క్వెజ్ ఆర్పీపీ రేడియో స్టేషన్‌కు తెలిపారు. శాంటా మార్గరీటా ప్రాంతంలో ఇళ్లలోకి నీరు చేరడంతో నిత్యావసరాలు, ఫర్నిచర్ కోల్పోయామని స్థానికులు చెప్పారు.
పియురాలోని జోస్ కాయెటానో హెరెడియా ఆసుపత్రిలోకి వరద నీరు చేరడంతో రోగులను ఆడిటోరియానికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న రోగులను ఐసీయూకు పంపారు. నగరంలోని ప్లాజా డి అర్మాస్ ప్రాంతంతో పాటు వ్యాపార సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లోకి నీరు చేరింది. నీటిని తొలగించేందుకు సైన్యం పంపింగ్ పరికరాలను ఏర్పాటు చేసింది. ఇంధనం కొరత వల్ల కొన్ని చోట్ల పంపింగ్ నిలిచిపోయిందని స్థానికులు ఆరోపించారు.
🚨#Peru: Suffering in #Piura. Thousands of streets without drainage. Not even the river has an outlet to the sea. 📹This image is of a road near the airport in the district of Castilla. ▪️Torrential rain has left vehicles stranded, a shopping mall affected & homes flooded. 📹 @JulioTalledoV @Agencia_Andina https://t.co/fMTcp25KPn
— ⚡️🌎 Sarwar 🌐⚡️ (@ferozwala) November 27, 2026
మరో నాలుగు రోజులు వర్షాలు
రాబోయే నాలుగు రోజుల్లో ఈ ప్రాంతంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నేషనల్ మెటరాలజీ అండ్ హైడ్రాలజీ సర్వీస్ హెచ్చరించింది. ఎల్ నినో ప్రభావం వల్ల సముద్ర తీరంలో అలల ఉధృతి పెరిగిందని, దీనివల్ల డజన్ల కొద్దీ పోర్టులను తాత్కాలికంగా మూసివేసినట్లు పెరూ నౌకాదళం తెలిపింది. పెరూ అధ్యక్షుడు కేకో ఫుజిమోరి తన కొలంబియా పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఆమె ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు ప్రకటించారు.
ఈక్వెడార్‌లో 34 మంది మృతి
పొరుగు దేశమైన ఈక్వెడార్‌లోనూ పరిస్థితి తీవ్రంగా ఉంది. అక్కడ భారీ వర్షాల వల్ల ఇప్పటివరకు 34 మంది మృతి చెందగా, 47 వేల మంది ప్రభావితమైనట్లు నేషనల్ సెక్రటేరియట్ ఫర్ రిస్క్ మేనేజ్‌మెంట్ శుక్రవారం వెల్లడించింది. మంటా నగరంలో రెండు నదులు పొంగి పొర్లడంతో వీధులు నీట మునిగాయి. మురుగు కాలువలు పొంగడంతో తీవ్రమైన దుర్వాసన వస్తోందని మంటా నివాసితులు ఫిర్యాదు చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రభావం
పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల సంభవించే ఎల్ నినో ఈ ఏడాది అత్యంత బలంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎల్ నినో, సాయుధ పోరాటాల వల్ల రాబోయే ఆరు నెలల్లో ప్రపంచంలోని 16 ప్రాంతాల్లో ఆకలి సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి సంస్థలు హెచ్చరించాయి. సుడాన్, దక్షిణ సుడాన్, సోమాలియా, నైజీరియా, యెమెన్ దేశాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుందని ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ), ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్ పీ) తెలిపాయి.
