హైదరాబాద్: ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ ఘటన కలకలం రేపింది. జేబా బాగ్ డీ-క్లాస్ ప్రాంతంలోని మహమ్మద్ వసీమ్ నివాసంలో గుర్తుతెలియని దొంగలు చోరీకి పాల్పడి సుమారు 70 తులాల బంగారు ఆభరణాలను అపహరించారు.
వివరాల్లోకి వెళ్తే.. నవంబర్ 27వ తేదీ సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో మహమ్మద్ వసీమ్ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి చాలీస్వా కార్యక్రమానికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దుండగులు ఇంట్లోకి చొరబడ్డారు. అనంతరం బీరువాలో భద్రపరిచిన సుమారు 70 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు.
కార్యక్రమం ముగించుకుని కుటుంబ సభ్యులు తిరిగి ఇంటికి చేరుకోగా, ఇల్లు చిందరవందరగా కనిపించింది. బీరువాలోని బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించి వెంటనే ఆసిఫ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ చోరీకి పాల్పడిన నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
