హైదరాబాద్: భాగ్యనగరంలో దొంగలు రెచ్చిపోతున్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్లో పట్టపగలే బీభత్సం జరిగింది. ఇంట్లోకి చొరబడి మహిళలను కట్టేసి రూ. 3.20 కోట్ల డబ్బును దొంగలు దోచుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మహిళలను కట్టేసి ఇంట్లో ఉన్న రూ. 3.20 కోట్ల నగదును దుండగులు దోచుకెళ్లారు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ మాన్సూరాబాద్ చండీశ్వర కాలనీ ప్లాట్ నంబర్ 61లో ఈ ఘటన జరిగింది.
సామ మణెమ్మ(65), ఆమె కోడలు మౌనికను బంధించి దుండగులు ఈ దోపిడీకి పాల్పడ్డారు. ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్న కొమ్మరవెల్లి సంపత్ కుమార్ రెడ్డి భారతదేశంలో స్థిరాస్తి కొనుగోలు కోసం రూ.3.20 కోట్లను బ్యాంకు ఖాతా ద్వారా తన బావ కుంభం విజయ్ కుమార్ రెడ్డికి పంపగా డ్రా చేసిన డబ్బులను దుండగులు చోరీ చేశారు.
డ్రా చేసిన రూ.3.30 కోట్లు నగదును బ్యాంక్ నుంచి మణెమ్మ కుటుంబానికి చెందిన నవీన్ ఇంట్లో భద్రపరిచాడు. కుటుంబ సభ్యులు వివాహానికి వెళ్లాల్సి ఉండటంతో నగదును అక్కడ ఉంచినట్లు సమాచారం. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ముసుగులు వేసుకున్న నలుగురు దుండగులు ఇంట్లోకి ప్రవేశించి ఈ దోపిడీకి పాల్పడ్డారు. ఆ సమయంలో ఇంట్లో మణెమ్మ, ఆమె కోడలు మౌనిక చేతులను కట్టేసి, నోళ్లకు ప్లాస్టర్ వేసి అరవకుండా చేసి రూ.3.30 కోట్ల నగదును దోపిడీ చేశారు.
ఇంట్లో ఉన్న మహిళలు దుండగులు వెళ్లాక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితుల పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో అంత పెద్ద మొత్తంలో నగదు ఉన్న విషయం తెలిసిన వారే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
