బ్యాంకులో డబ్బులు దాచుకుంటున్నాం.. అవసరమైనప్పుడు మన డబ్బును మనమే ఏటీఎం నుంచి తీసుకుంటున్నాం. కానీ అలా మన డబ్బును తీసుకోవడానికి కూడా బ్యాంకులకు ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది. నెలకు కొన్ని అదనపు ఏటీఎం లావాదేవీలు చేస్తే ఏడాదికి వందలు, వేల రూపాయలు ఛార్జీల రూపంలో కోల్పోవాల్సి వస్తోంది. ఐదేళ్లు, పదేళ్లు లెక్కేస్తే ఈ మొత్తం మరింత భారంగా మారుతుంది. కొన్ని సందర్భాల్లో ఏటీఎం ఛార్జీల భారం ఏడాదికి రూ.1,600 దాటుతోంది. అంటే కేవలం నగదు విత్డ్రా చేసుకోవడం, ఇతర సేవల కోసమే ఖాతాదారుల జేబులకు చిల్లు పడుతోంది.
ఈ క్రమంలో.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఏటీఎం, పాయింట్ ఆఫ్ సేల్ (PoS) లావాదేవీలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది. గతంలో జారీ చేసిన 17 సర్క్యులర్లను ఒకే చోటికి తీసుకొచ్చి నిబంధనలను మరింత స్పష్టంగా చేసింది. ఉచిత లావాదేవీల పరిమితి దాటిన తర్వాత బ్యాంకులు వసూలు చేసే ఛార్జీలపై గరిష్ఠ పరిమితిని రూ.23గా నిర్ణయించింది. దీనికి 18 శాతం జీఎస్టీ కలిపితే ఒక లావాదేవీకి గరిష్ఠంగా రూ.27.14 చెల్లించాల్సి ఉంటుంది.
సొంత బ్యాంకు ఏటీఎంలో నెలకు ఐదు ఉచిత లావాదేవీలు చేసుకోవచ్చు. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో మెట్రో నగరాల్లో మూడు, ఇతర ప్రాంతాల్లో ఐదు ఉచిత లావాదేవీలు అందుబాటులో ఉంటాయి. ఈ పరిమితి దాటితేనే ఛార్జీలు వర్తిస్తాయి. అయితే సాంకేతిక సమస్యల వల్ల విఫలమైన లావాదేవీలు, ఏటీఎంలో నగదు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో విఫలమైన లావాదేవీలకు ఛార్జీలు విధించకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది.
ఖాతాదారులు గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే.. బ్యాంకులో డబ్బులు దాచుకోవడమే కాదు, వాటిని విత్డ్రా చేసుకునే విధానంపైనా అవగాహన ఉండాలి. అవసరానికి మించి ఏటీఎం లావాదేవీలు చేయకుండా, డిజిటల్ చెల్లింపులను వినియోగిస్తే అనవసర ఛార్జీల నుంచి కొంతవరకు తప్పించుకోవచ్చు.
