విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) కార్యదర్శి కార్తికేయ మిశ్రా ప్రయాణిస్తున్న సమయంలో విజయవాడ బైపాస్‌లోని వెంకటపాలెం టోల్‌గేట్ దగ్గర గొడవ జరిగింది. ఈ ఘటనలో విధుల్లో ఉన్న ఐదుగురు టోల్‌గేట్ ఉద్యోగాలు కోల్పోయారు. కార్తికేయ మిశ్రా తన వాహనంలో విజయవాడ బైపాస్ మీదుగా వెళ్తుండగా వెంకటపాలెం టోల్‌గేట్ వద్దకు చేరుకున్నారు.
ఈ సమయంలో ఆయన డ్రైవర్ టోల్‌గేట్ సిబ్బందిని బ్యారియర్ ఎత్తాలని కోరారు. అయితే, విధుల్లో ఉన్న సిబ్బంది గుర్తింపు కార్డు చూపించాలని అడిగారు. డ్రైవర్ తాను సీఎంఓ అధికారికి చెందిన వాహనంలో ఉన్నట్లు చెప్పినప్పటికీ, సిబ్బంది గుర్తింపు కార్డు అడిగినట్లు సమాచారం. దీంతో కార్తికేయ మిశ్రా ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాహనంపై అధికారిక జెండా లేకపోవడంతో అధికారులు ఎవరనే విషయం సిబ్బంది గుర్తించలేకపోయారని టోల్‌గేట్ సూపర్‌వైజర్ వివరించి క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ ఈ వ్యవహారం తీవ్ర పరిణామాలకు దారితీసింది. కార్తికేయ మిశ్రా ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను, టోల్ నిర్వహణ సంస్థ ప్రతినిధులను పిలిపించి మాట్లాడారు.
విధుల్లో ఉన్న సిబ్బందిని తొలగించాలని ఆదేశించారు. దీంతో.. టోల్‌గేట్ దగ్గర పనిచేస్తున్న ముగ్గురు టోల్ కలెక్షన్ సిబ్బంది, ఒక సూపర్‌వైజర్, ఒక షిఫ్ట్ ఇన్‌ఛార్జి కలిపి.. మొత్తం ఐదుగురు ఉద్యోగాలు కోల్పోయారు.
