తమిళనాడులోని తిరుపరంకుండ్రం కొండపై ఎట్టకేలకు కార్తీక దీపం వెలిగింది. దీపం వెలిగించే విషయంలో కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు న్యాయస్థానం తీర్పుతో తెరపడింది. కోర్టు ఆదేశాలతో భారీ పోలీసు బందోబస్తు మధ్య కొండపై దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు.
దీపం వెలిగించేందుకు అన్ని అడ్డంకులు తొలగడంతో సంప్రదాయబద్ధంగా కొండపై కార్తీక దీపాన్ని వెలిగించారు. కొండపై జ్వలించిన దివ్యజ్యోతిని చూసి భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. హరోం హర నినాదాలతో తిరుపరంకుండ్రం గిరి పరిసరాలు మార్మోగాయి.
దీపోత్సవం ప్రశాంతంగా జరిగేలా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కోర్టు ఉత్తర్వుల మేరకు అధికారులు, పోలీసుల పర్యవేక్షణలో కార్యక్రమం కొనసాగింది. కొండపై దీపం వెలగడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. తమ సంప్రదాయాన్ని కొనసాగించేందుకు చేసిన న్యాయపోరాటం ఫలించిందని పలువురు భక్తులు హర్షం వ్యక్తం చేశారు. దీంతో తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపోత్సవం భక్తిశ్రద్ధలతో జరిగింది.
