* తెలంగాణ రాష్ట్రంలో ఊరూరా క్రీడా జ్యోతి
* డిసెంబరు 1 నుంచి 8 వరకు ఖేలో ఇండియా టార్చ్ ర్యాలీ
* 33 జిల్లాలను చుట్టిరానున్న క్రీడా జ్యోతి
* ఉత్తర, దక్షిణ తెలంగాణలో రెండు వేర్వేరు మార్గాలు
* ఎల్బీ స్టేడియం నుంచి ర్యాలీలకు శ్రీకారం
* జిల్లాల్లో కలెక్టరేట్ల నుంచి ర్యాలీలు స్టార్ట్
* రాజధానిలో ప్రత్యేక ప్రచార వాహనాలు.. సెల్ఫీ పాయింట్లు
Khelo India: ఆదిలాబాద్ నుంచి గద్వాల వరకు.. సంగారెడ్డి నుంచి భద్రాద్రి వరకు.. తెలంగాణ అంతటా ఖేలో ఇండియా క్రీడల సందడి మొదలైంది. జాతీయ క్రీడల స్ఫూర్తిని రాష్ట్రంలోని 33 జిల్లాలకు చాటేలా క్రీడా జ్యోతి యాత్రకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. డిసెంబరు 1 నుంచి 8వ తేదీ వరకు ఈ యాత్ర కొనసాగనుంది. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం నుంచి రెండు ప్రత్యేక వాహనాలతో యాత్రను చేపట్టనున్నారు. ఒక వెహికిల్ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో, మరో వాహనం దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పర్యటించనుంది. ఎనిమిది రోజుల పాటు సాగే ఈ యాత్రకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (Sports Authority of Telangana - SATG) షెడ్యూల్‌ను ఫిక్స్ చేసింది.
డిసెంబరు 11 నుంచి 22 వరకు తెలంగాణలో ఎనిమిదో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 7 వేల మందికిపైగా క్రీడాకారులు పాల్గొననున్నారు. మొత్తం 20 వేదికల్లో 27 క్రీడాంశాలకు సంబంధించిన పోటీలు నిర్వహించనున్నారు. క్రీడలు జరిగే నగరాలకే సంబరాలు పరిమితం కాకుండా అన్ని జిల్లాల ప్రజలనూ భాగస్వాములను చేసేందుకు క్రీడా జ్యోతి యాత్రను చేపడుతున్నారు.
ఉత్తర తెలంగాణలో యాత్ర:
డిసెంబరు 1న హైదరాబాద్‌లో బయలుదేరే తొలి వాహనం అదే రోజు సాయంత్రం సంగారెడ్డి చేరుకుంటుంది. 2న ఉదయం మెదక్‌లో, సాయంత్రం కామారెడ్డిలో ర్యాలీలు నిర్వహిస్తారు. 3న ఉదయం నిజామాబాద్‌లో, సాయంత్రం నిర్మల్‌లో ర్యాలీలు జరుగుతాయి. 4న ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, 5న మంచిర్యాల, ములుగు జిల్లాల్లో క్రీడా జ్యోతి యాత్ర సాగుతుంది. 6న ఉదయం జయశంకర్ భూపాలపల్లిలో, సాయంత్రం పెద్దపల్లిలో ర్యాలీలు నిర్వహిస్తారు. 7న ఉదయం కరీంనగర్‌లో, మధ్యాహ్నం జగిత్యాలలో, సాయంత్రం రాజన్న సిరిసిల్లలో ర్యాలీలు జరుగుతాయి. 8న ఉదయం సిద్దిపేటలో, సాయంత్రం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ర్యాలీతో ఈ యాత్ర ముగుస్తుంది.
దక్షిణ తెలంగాణలో ర్యాలీ:
డిసెంబరు 1న హైదరాబాద్‌లో బయలుదేరే రెండో వాహనం అదే రోజు సాయంత్రం వికారాబాద్ చేరుకుంటుంది. 2న ఉదయం మహబూబ్‌నగర్‌లో, సాయంత్రం నారాయణపేటలో ర్యాలీలు నిర్వహిస్తారు. 3న జోగుళాంబ గద్వాల, వనపర్తి, 4న నాగర్‌కర్నూల్, నల్గొండ జిల్లాల్లో యాత్ర సాగుతుంది. 5న ఉదయం సూర్యాపేటలో, సాయంత్రం ఖమ్మంలో ర్యాలీలు జరుగుతాయి. 6న భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటిస్తుంది. 7న ఉదయం వరంగల్‌లో, మధ్యాహ్నం హనుమకొండలో, సాయంత్రం జనగామలో ర్యాలీలు నిర్వహిస్తారు. 8న ఉదయం యాదాద్రి భువనగిరి జిల్లాలో, సాయంత్రం రంగారెడ్డి జిల్లాలో ర్యాలీతో యాత్ర ముగుస్తుంది.
ర్యాలీల్లో క్రీడాకారులు, విద్యార్థులు:
అన్ని జిల్లాల్లో ఆయా జిల్లా కలెక్టరేట్ల నుంచి ర్యాలీలు ప్రారంభమయ్యేలా షెడ్యూల్ రూపొందించారు. స్థానిక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు, ఒలింపిక్ సంఘాలు, క్రీడా సంఘాల ప్రతినిధులను కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని క్రీడా ప్రాధికార సంస్థ (Sports Authority of Telangana - SATG) సూచించింది.
స్థానిక క్రీడాకారులు, క్రీడా అకాడమీల్లో శిక్షణ పొందుతున్న 14 ఏళ్లు పైబడిన బాలబాలికలు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ సభ్యులు, కళాశాలల విద్యార్థులు ర్యాలీల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని స్టేట్ స్పోర్ట్స్ ఆథారిటీ కోరింది. పోలీసు బ్యాండ్, బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రచార సామగ్రి, ఫ్లెక్సీలపై ఖేలో ఇండియా లోగో, మస్కట్‌కు ప్రాధాన్యమివ్వాలని జిల్లా క్రీడా శాఖ అధికారులకు తెలిపింది. ఈ మేరకు నవంబరు 28న అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ సర్క్యులర్ జారీ చేసింది.
హైదరాబాద్‌లో క్రీడల సందడి:
ఖేలో ఇండియా ప్రచార కార్యక్రమాలకు నవంబరు 25 నుంచి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్లు, ప్రజలు ఎక్కువగా సందర్శించే ప్రాంతాల్లో ప్రత్యేక ఆకర్షణలను ఏర్పాటు చేస్తున్నారు. ఖేలో ఇండియా మస్కట్ నీలమణి నమూనాలు, భారీ స్పోర్ట్స్ జెర్సీలతో సెల్ఫీ పాయింట్లను రూపొందించారు. నగరంలోని ఎంపిక చేసిన భవనాలపై ప్రత్యేక కాంతులతో ఖేలో ఇండియా లోగోను ప్రదర్శించే ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబరు 7 నుంచి 9 వరకు ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్, ఆ వెంటనే ఖేలో ఇండియా క్రీడలు జరగనున్నాయి. ఈ రెండు కార్యక్రమాల ప్రచారాన్ని అనుసంధానం చేశారు. ప్రత్యేక ప్రచార వాహనాలపై ఖేలో ఇండియాతో పాటు ఇన్వెస్ట్ తెలంగాణ లోగోలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పొందుపర్చింది.
క్రీడా జ్యోతికి ప్రత్యేక చరిత్ర:
అంతర్జాతీయ క్రీడల్లో జ్యోతికి ప్రత్యేక స్థానం ఉంది. 1928లో ఆమ్‌స్టర్‌డామ్ ఒలింపిక్స్‌లో తొలిసారిగా క్రీడా జ్యోతిని వెలిగించారు. 1936లో బెర్లిన్ ఒలింపిక్స్ సందర్భంగా జ్యోతి యాత్ర సంప్రదాయం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఒలింపిక్స్‌తో పాటు వివిధ అంతర్జాతీయ, జాతీయ క్రీడల సందర్భంగా జ్యోతి యాత్రలు నిర్వహిస్తున్నారు. క్రీడాస్ఫూర్తికి, ఐక్యతకు ప్రతీకగా భావించే ఈ జ్యోతిని ఖేలో ఇండియా సందర్భంగా తెలంగాణలోని అన్ని జిల్లాలకు తీసుకెళ్తున్నారు. ఓ వైపు స్టేడియాల్లో జాతీయ పోటీలకు ఏర్పాట్లు జరుగుతుండగా.. మరోవైపు క్రీడా జ్యోతి యాత్రతో రాష్ట్రవ్యాప్తంగా ఆటల పండుగ మొదలుకానుంది.
8th Edition of Khelo India Youth Games – Telangana 2026 11-22 December 2026. https://t.co/RQvJTfeZtC
— IPRDepartment (@IPRTelangana) November 28, 2026
