నీతి కథ : తన మనవరాలికి తాతయ్య చెప్పిన.. ఐకమత్యమే మహాబలం కథ

నీతి కథ : తన మనవరాలికి తాతయ్య చెప్పిన.. ఐకమత్యమే మహాబలం కథ

రామయ్యది ఉమ్మడి కుటుంబం. అతని కొడుకులు, కోడళ్ళు కలిసిమెలిసి ఉంటారు. కలసికట్టుగా వ్యవసాయం చేసుకుంటారు. వాళ్ల ఐకమత్యం చూసి రామయ్య చాలా సంతోషపడేవాడు. కానీ రామయ్య మనవళ్లు, మనవరాళ్లు మాత్రం ఆట బొమ్మల కోసం, చిరుతిళ్ళ కోసం, పెన్నులు, పెన్సిళ్ల కోసం ఎప్పుడూ ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ ఉండేవాళ్లు. అది చూసి రామయ్య బాధపడేవాడు. “అస్తమానం అలా గొడవపడకండి. ఐకమత్యంగా ఉండడం అలవాటు చేసుకోండి” అంటూ పిల్లలకు ఎన్నోసార్లు చెప్పిచూశాడు. అయినా వాళ్ల ప్రవర్తనలో మార్పు రాలేదు.

ఒకరోజు పిల్లలందర్నీ సరదాగా బయటకు తీసుకెళ్ళాడు రామయ్య. దారిలో ఒక చెట్టు కింద కొన్ని కుక్కలు గుంపుగా కనబడ్డాయి. “మీలో ఎవరైనా ఆ కుక్కలపై రాయి విసరగలరా?” అని మనవళ్ళను, మనవరాళ్ళను అడిగాడు. ‘నేను విసురుతాను’ అంటే ‘నేను విసురుతాను’ అంటూ పిల్లలందరూ పోటీపడ్డారు.

రామయ్య తన చిన్న మనవరాలి చేతిలో ఒక గులకరాయి పెట్టి, కుక్కలపై విసరమన్నాడు. రాయి విసరగానే కుక్కలన్నీ తలో దిక్కుకు పరిగెత్తాయి. కొద్దిగా ముందుకు నడిచాక వాళ్లకు ఒక తేనెతుట్టె కనబడింది. పిల్లలకు తేనెతుట్టె చూపిస్తూ “మీలో ఎవరైనా ఆ తేనెతుట్టెపై రాయి విసరగలరా?” అని అడిగాడు. దానికి వాళ్లు “అమ్మో! తేనెతుట్టెపై రాయి విసిరితే, తేనెటీగలన్నీ వచ్చి మనల్ని కుడుతాయి కదా!” అన్నారు.

“కుక్కల్లో ఐకమత్యం లేదు. అందుకే రాయి విసరంగనే తలో దిక్కుకు పరిగెత్తుతాయి. అందుకే మీరందరూ కుక్కలపై రాయి విసరడానికి పోటీపడ్డారు. తేనెటీగల్లో ఐకమత్యం ఎక్కువ. అన్నీ ఏకమై శత్రువులపై దాడి చేస్తాయి. అందుకే మీరు తేనెటీగల జోలికి వెళ్లడానికి భయపడ్డారు. జంతువులైనా, పక్షులైనా, స్నేహితులైనా, కుటుంబ సభ్యులైనా కలసి కట్టుగా, ఐకమత్యంగా ఉండాలి. అప్పుడే ఎదుటివాళ్లు మనకు విలువ, గౌరవం ఇస్తారు” అని చెప్పాడు రామయ్య. తాతయ్య చెప్పింది పిల్లలకు అర్థమైంది. ‘ఐకమత్యమే మహాబలం’ అని ఒప్పుకున్నారు. అప్పటినుంచి పిల్లలంతా కలిసిమెలిసి ఉంటూ, సంతోషంగా ఆడుకుంటున్నారు.