వారసత్వంగా వచ్చిన బంగారాన్ని అమ్మి ఇల్లు కొనుగోలు చేసే వారు ఆ నగలు తమవేనని నిరూపించే తగిన ఆధారాలు కలిగి ఉండాలని ఆదాయ పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ ముంబై బెంచ్ స్పష్టం చేసింది. బంగారానికి సంబంధించిన యాజమాన్య హక్కులు, నగదు మూలాలను నిరూపించలేకపోతే పన్ను మినహాయింపు వర్తించదని పేర్కొంది. ఒక టాక్స్ పేయర్ తన తల్లిదండ్రులు, బామ్మ నుంచి వచ్చిన కేజీ 278 గ్రాముల బంగారాన్ని అమ్మిన కేసులో ట్రిబ్యునల్ ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.
బాధితుడు బంగారం అమ్మగా వచ్చిన డబ్బులను ఇల్లు కొనుక్కోవటానికి పెట్టుబడి పెట్టి.. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 54ఎఫ్ కింద రూ.34 లక్షల 39వేలను మినహాయింపు కోరాడు. అయితే ఆ బంగారం వారసత్వంగా వచ్చిందనడానికి తగిన డాక్యుమెంట్లను చూపలేదని పన్ను శాఖ ఆ క్లెయిమ్‌ను రిజెక్ట్ చేసింది. దీనికి తోడు బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన రూ.25 లక్షల 69వేలను కూడా లెక్కల్లో చూపని ఆదాయంగా అధికారులు పరిగణించారు. ఇందులో రూ.9లక్షల 36వేలు ఆయన ఖాతాలో, రూ.16లక్షల 32వేలు ఆయన భార్య ఖాతాలో జమ అయ్యాయి. ఆ సొమ్ము తన సేవింగ్స్ నుంచి వచ్చిందని, భార్యకు వేరే ఆదాయం ఉందని ఆయన వాదించినా అధికారులు అంగీకరించలేదు.
దీంతో మొత్తం రూ.60 లక్షలకు పన్ను కట్టాల్సిందేనని ఇన్కమ్ టాక్స్ శాఖ ఆదేశాలు ఇచ్చింది. దీనిపై దాఖలైన అప్పీల్‌ను విచారించిన ఐటీఏటీ, ఈ వ్యవహారాన్ని మళ్లీ పరిశీలించాలని అసెసింగ్ అధికారికి ఆదేశాలు జారీ చేసింది. అందుబాటులో ఉన్న ఆధారాలను మళ్లీ తనిఖీ చేసి నిర్ణయం తీసుకోవాలని కేసును రిమాండ్ చేసింది.
సెక్షన్ 54ఎఫ్ కింద మినహాయింపు ఎలా లెక్కించాలో జియోటస్ సీఈఓ విక్రమ్ సుబ్బురాజ్ వివరించారు. కేవలం లాభాన్ని మాత్రమే కాకుండా.. గోల్డ్ అమ్మినప్పుడు వచ్చిన మొత్తం సొమ్మును ఇంటి కొనుగోలుకు ఎంత వరకు వాడారనే దానిపై మినహాయింపు ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఉదాహరణకు రూ.40 లక్షలకు బంగారం అమ్మి.. అందులో రూ.30 లక్షలతో ఇల్లు కొంటే 75 శాతం లాభంపైనే పన్ను మినహాయింపు లభిస్తుందని చెప్పారు. వారసత్వంగా వచ్చిన బంగారం అమ్మేటప్పుడు గిఫ్ట్ డీడ్లు, వీలునామాలు, వాల్యుయేషన్ రిపోర్టులు, బ్యాంకు స్టేట్మెంట్లు భద్రపరుచుకోవటం ఇలాంటి సమయంలో అండగా నిలుస్తాయని సూచించారు.
