గంభీర్ కోచింగ్పై ఫ్యాన్స్ ఫైర్.. మరో గ్రెగ్ చాపెల్ అంటూ విమర్శలు!

గంభీర్ కోచింగ్పై ఫ్యాన్స్ ఫైర్.. మరో గ్రెగ్ చాపెల్ అంటూ విమర్శలు!

Gautam Gambhir : న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లకు మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజాలను పక్కన పెట్టడంపై క్రికెట్ అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. 2027 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో, ముఖ్యంగా ఇంగ్లాండ్ పర్యటనలో కీలక ప్రదర్శనలు చేసిన ప్లేయర్స్ ను పక్కన పెట్టడంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో గంభీర్ కోచింగ్ శైలిని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్రేగ్ చాపెల్ తో పోలుస్తూ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు.

చాపెల్ అంటూ విమర్శలు: 

గ్రేగ్ చాపెల్ కోచింగ్ కాలంలో జట్టులో తరచూ మార్పులు చేయడం వల్ల ఆటగాళ్లలో అభద్రతా భావం పెరిగిందని అప్పట్లో జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ లాంటి సీనియర్లు బహిరంగంగానే చెప్పుకొచ్చారు. చాపెల్ హయాం తన కెరీర్‌లోనే కఠినమైన కాలమని జహీర్ పేర్కొనగా, లీక్ అయిన ఈమెయిల్ సౌరవ్ గంగూలీతో ఉన్న విభేదాలను బయటపెట్టింది. అనంతరం 2007 వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్, శ్రీలంక చేతిలో ఓడి భారత్ లీగ్ దశలోనే వెనుదిరగడంతో చాపెల్ శకం ముగిసింది.

గౌతమ్ గంభీర్ విషయంలోనూ జట్టులో తరచూ మార్పులు చేస్తుండటంతో ప్లేయర్స్ లో అభద్రత పెరుగుతుందనే చర్చ కొనసాగుతుంది. ఆటగాళ్లకు స్పష్టమైన పాత్రలు, మెరుగైన కమ్యూనికేషన్ అవసరమని రెండేళ్ల క్రితమే జహీర్ ఖాన్ చెప్పిన విషయాన్ని క్రికెట్ అభిమానులు గుర్తుచేస్తున్నారు.

సీనియర్ల నిష్క్రమణలు.. టెస్టుల్లో వరుస ఓటములు: 

సీనియర్ల నిర్ణయాలు: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో సిడ్నీ టెస్ట్ నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ స్వయంగా తప్పుకోవడం, ఆ టూరు మధ్యలోనే రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడం అందరినీ షాక్ కి గురి చేశాయి. ఆ తర్వాత రోహిత్, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలగడం అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది.

టెస్టుల్లో ఘోర ఫలితాలు: గంభీర్ కోచింగ్‌లో వైట్-బాల్ క్రికెట్‌లో విజయాలు దక్కినా, టెస్టుల్లో వరుస ఓటములు ఎదురయ్యాయి. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3–0తో, సౌతాఫ్రికా చేతిలో 2-0తో టీమిండియా ఓడిపోయింది, గౌహతి టెస్టులో 408 పరుగుల తేడాతో ఓడటం రన్స్ పరంగా భారత్‌కు అతిపెద్ద టెస్ట్ పరాజయంగా నిలిచింది. డబ్ల్యూటీసీ 2025 ఫైనల్‌కు చేరలేకపోయిన భారత్, ప్రస్తుత సైకిల్‌లోనూ కష్టాల్లో నడుస్తోంది.