ఇష్టం వచ్చినట్లు బ్యాంకు అకౌంట్లు బ్లాక్ చేస్తామంటే తాట తీస్తాం: బ్యాంకులకు RBI వార్నింగ్

ఇష్టం వచ్చినట్లు బ్యాంకు అకౌంట్లు బ్లాక్ చేస్తామంటే తాట తీస్తాం: బ్యాంకులకు RBI వార్నింగ్

హఠాత్తుగా మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిందనే మెసేజ్ వస్తే గుండె ఆగినంత పనవుతుంది కదూ. అత్యవసర సమయాల్లో మన కష్టార్జితం మనకే అందకుండా నెలల తరబడి బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన కష్టాలకు RBI తాజాగా ఫుల్‌స్టాప్ పెట్టింది. ఈ నిర్ణయం కస్టమర్లకు భారీ ఊరటను కలిగిస్తుంది. సైబర్ మోసాలు, మనీ మ్యూలింగ్ చేస్తున్న అకౌంట్లను అరికట్టే క్రమంలో అమాయక కస్టమర్లు ఇబ్బంది పడకూడదని రిజర్వు బ్యాంక్ తీసుకున్న కొత్త నిర్ణయాలు సామాన్య ప్రజలకు పెద్ద ఊరటను ఇవ్వుంది.

కారణం చెప్పకుండా ఖాతా ఫ్రీజ్ చేయలేరు:
ఇప్పటివరకు అనుమానాస్పద లావాదేవీల పేరుతో బ్యాంకులు ఎడాపెడా కస్టమర్ల బ్యాంక్ ఖాతాలను, బిజినెస్ అకౌంట్లను ఫ్రీజ్ చేసేది. కానీ కొత్త రూల్స్ ప్రకారం.. బ్యాంకులు ఇష్టం వచ్చినట్లు ఖాతాలపై 'డెబిట్ హోల్డ్' పెట్టడానికి వీల్లేదు. ఖాతాను ఫ్రీజ్ చేసిన వెంటనే డిజిటల్ మార్గాల్లో లేదా మరుసటి పనిదినంలోగా కస్టమర్‌కు తప్పనిసరిగా దీని గురించి తెలియజేయాలి. అందులో ఎందుకు హోల్డ్ లో పెట్టారో స్పష్టమైన కారణం, దాన్ని తొలగించుకునే విధానం, సంబంధిత అధికారి ఫోన్ నంబర్ వివరాలను అందించాలని రిజర్వు బ్యాంక్ ఆదేశించింది.

సమస్య పరిష్కారానికి గడువు:
ఖాతాపై హోల్డ్ పడితే ఇకపై నెలల తరబడి ఎదురుచూడాల్సిన పనిలేదు. కస్టమర్ తన వివరణ, ఆధారాలను సమర్పించడానికి 7 రోజుల సమయం ఉంటుంది. కస్టమర్ వివరణ ఇచ్చిన 7 రోజుల్లోగా బ్యాంకు దానిని పరిశీలించి.. సంతృప్తి చెందితే వెంటనే సదరు బ్యాంక్ అకౌంట్ పై హోల్డ్ ఎత్తివేయాలి. ఒకవేళ కేసును పోలీసులకు రిఫర్ చేసినా.. 30 రోజుల్లోగా పోలీసుల నుంచి ఎలాంటి తదుపరి ఆదేశాలు రాకపోతే 31వ రోజున బ్యాంకు కచ్చితంగా అకౌంట్‌పై ఉన్న హోల్డ్‌ను తొలగించాలి.

ALSO READ : కొత్త రకం క్రెడిట్ కార్డ్ మోసం: ICICI కస్టమర్‌కి రూ.లక్షా 30వేలు లాస్.. ఈ తప్పు అస్సలు చేయెుద్దు!

అమాయకులకు రక్షణ.. 
కేవలం అనుమానాస్పద మొత్తాన్ని మాత్రమే హోల్డ్ చేయాలి తప్ప, తీవ్రమైన నేర ఆరోపణలు ఉంటే తప్ప మొత్తం ఖాతాను స్తంభింపజేయకూడదు. అంతేకాకుండా ఈ విషయంలో కస్టమర్ల కంప్లెయింట్లను 30 రోజుల్లోగా పరిష్కరించడానికి ప్రతి బ్యాంకు ప్రత్యేక నోడల్ అధికారిని నియమించి, వారి వివరాలను బ్రాంచీల్లో కస్టమర్లకు కనిపించేలా ఏర్పాటు చేయాలి. జులై 1, 2027 నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనలు సామాన్య ఖాతాదారులకు అభయహస్తంగా మారనున్నాయి.