కొత్త రకం క్రెడిట్ కార్డ్ మోసం: ICICI కస్టమర్‌కి రూ.లక్షా 30వేలు లాస్.. ఈ తప్పు అస్సలు చేయెుద్దు!

కొత్త రకం క్రెడిట్ కార్డ్ మోసం: ICICI కస్టమర్‌కి రూ.లక్షా 30వేలు లాస్.. ఈ తప్పు అస్సలు చేయెుద్దు!

టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో.. సైబర్ నేరగాళ్లు కూడా అంతే తెలివిగా కొత్త ఎత్తుగడలతో సామాన్యులను నిలువునా ముంచేస్తున్నారు. "మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతున్నాయి.. దాన్ని పాలంటే మేము చెప్పినట్లు చేయండి" అంటూ భయపెట్టి, మన చేతులారా మన అకౌంట్ల సేఫ్టీని మనమే తొలగించుకునేలా చేస్తున్నారు. తాజాగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఒక రైల్వే ఉద్యోగికి ఎదురైన చేదు అనుభవం అందరినీ షాక్‌కి గురిచేస్తోంది. లక్షల రూపాయలను కేవలం నిమిషాల వ్యవధిలో సైబర్ కేటుగాళ్లు ఎలా కొల్లగొట్టారో తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.

అహ్మదాబాద్‌లోని అమ్రైవాడి ప్రాంతానికి చెందిన 47 ఏళ్ల పంకజ్ కుమార్ మండల్ రైల్వే శాఖలో కమర్షియల్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. గురునానక్ జయంతి సెలవు రోజున ఇంట్లో ఉన్న ఆయనకు సాయంత్రం సమయంలో ఒక గుర్తుతెలియని నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తాను ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నానని పరిచయం చేసుకున్న అవతలి వ్యక్తి.. మండల్ క్రెడిట్ కార్డుపై నెలకు రూ.2వేల999 చొప్పున 'సెక్యూరిటీ ఛార్జ్' యాక్టివేట్ అయిందని నమ్మించాడు. అనవసరంగా డబ్బులు కట్ అవుతాయని ఆందోళన చెందిన మండల్ ఆ ఛార్జీలను వెంటనే నిలిపివేయాలని కోరారు.

ఇదే అదనుగా భావించిన నేరగాళ్లు తమ అసలు ప్లాన్‌ను అమలు చేశారు. కాసేపటికే మరో నంబర్ నుంచి ఒక మహిళ ఫోన్ చేసి, ఛార్జీని డీయాక్టివేట్ చేసే ప్రక్రియ వివరిస్తున్నట్లు నటించింది. ఆమె సూచనల మేరకు మండల్ తన ఫోన్‌లోని ఐసీఐసీఐ iMobile యాప్ ఓపెన్ చేశారు. అందులో యాక్టివ్‌గా ఉన్న 'సెక్యూరిటీ అలర్ట్' ఫీచర్‌ను ఆఫ్ చేయాలని ఆ మహిళ చెప్పడంతో.. వాళ్లు చెప్పింది నిజమేనని నమ్మిన కస్టమర్ దానిని డిసేబుల్ చేశారు. అంతే వెంటనే ఫోన్ కట్ అయింది. సెక్యూరిటీ అలర్ట్ ఆగిపోవడంతో కేవలం నిమిషాల వ్యవధిలోనే ఆయన క్రెడిట్ కార్డు నుంచి రూ.లక్షా 29వేలకు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ జరిగిపోయింది.

ALSO READ : చిన్న చితకా కంపెనీకు కోట్లకు కోట్లు అప్పు ఇస్తున్న SBI

మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసి కార్డును బ్లాక్ చేయించారు. బ్యాంక్ అధికారులు ఎప్పుడూ ఫోన్ చేసి యాప్‌లోని సెక్యూరిటీ ఫీచర్లను ఆఫ్ చేయమని అడగరని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అప్రమత్తంగా ఉండకుండా ఇలాంటి మాయమాటలు నమ్మితి చివరికి ఇలానే నష్టపోవాల్సి ఉంటుంది. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు మీకు దగ్గరలోని సదరు బ్యాంక్ శాఖకు వెళ్లి అక్కడి సిబ్బందితో మాట్లాడటం లేదా అధికారిక కస్టమర్ కేర్ నంబరుకు కాల్ చేసి మీకు వచ్చిన కాల్ గురించి వివరించి అది నిజమైనదేనా కాదా అని ముందుగా తెలుసుకోవటం భారీ ఆర్థిక నష్టాల నుంచి రక్షిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అనధికారిక నంబర్ల నుంచి కాల్స్ వస్తే ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా కట్ చేయటం సేఫ్ అని గుర్తుంచుకోండి.