చిన్న చితకా కంపెనీకు కోట్లకు కోట్లు అప్పు ఇస్తున్న SBI

చిన్న చితకా కంపెనీకు కోట్లకు కోట్లు అప్పు ఇస్తున్న SBI

చిన్న పరిశ్రమలకు ఇచ్చే లోన్ పరిమితిని భారీగా పెంచాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. తన డిజిటల్ లెండింగ్ ప్రోగ్రామ్ ‘MSME డ్రీమ్’ కింద ఇచ్చే రుణాల గరిష్ట పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.5 కోట్ల నుంచి 10 రెట్లు పెంచి రూ.50 కోట్లకు చేస్తున్నట్లు బ్యాంక్ తెలిపింది. 2027 మార్చి నాటికి ఈ పెంపు పూర్తి చేయాలని బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ లోన్ లిమిట్ పెంపు ప్రక్రియను ఎస్‌బీఐ దశలవారీగా అమలు చేయనుంది. ఇందులో భాగంగా తొలి దశలో నవంబర్ 30 నాటికి రుణ పరిమితిని రూ.10 కోట్లకు పెంచనుంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న తన బ్రాంచ్ నెట్‌వర్క్ ద్వారా 2027 మార్చి నాటికి ఈ పరిమితిని రూ.50 కోట్లకు చేరుస్తామని ఎస్‌బీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.

వేగంగా లోన్స్..
MSME డ్రీమ్ ప్రోగ్రామ్‌ను 2023 డిసెంబర్‌లో ప్రారంభించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు డిజిటల్ పద్ధతిలో లోన్స్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ ప్లాట్‌ఫామ్ ఉపయోగపడుతుంది. ఈ పథకం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.2లక్షల 25వేల కోట్ల రుణాలను మంజూరు చేసింది బ్యాంక్. డిజిటల్ పద్ధతిలో వ్యాపార, ఆర్థిక వివరాలను పరిశీలించి ఎంత లోన్ ఇవ్వొచ్చనే అర్హతను ఈ సిస్టమ్ లెక్కిస్తుంది.

ALSO READ : శనివారం గోల్డ్ షాపింగ్ చేసేటోళ్లకు ఊరట.. 10 గ్రాములకు హైదరాబాదులో ఎంత తగ్గిందంటే?

ఈ పద్ధతి ద్వారా కేవలం 30 నుంచి 45 నిమిషాల్లోనే ప్రాథమిక రుణ అనుమతి లభిస్తుందని ఎస్‌బీఐ తెలిపింది. గతంలో లోన్ సొమ్ము చేతికి అందడానికి 3 నుంచి 4 వారాల సమయం పట్టేది. ఇప్పుడు ఆ సమయం ఒక వారానికి తగ్గిందని బ్యాంక్ వెల్లడించింది. డిజిటల్ రికార్డులను ఉపయోగించడం వల్ల డాక్యుమెంట్ల వెరిఫికేషన్ ప్రక్రియ వేగవంతమైంది. అప్పుల కోసం పరిశ్రమలు ఎక్కువ కాలం వేచి చూసే సమయం తగ్గిందని బ్యాంక్ చెప్పింది. 

ఆర్థిక వ్యవస్థలో MSMEల పాత్ర
దేశ పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పన, ఎగుమతుల్లో ఎంఎస్ఎంఈ రంగం కీలక పాత్ర పోషిస్తోంది. ఎకనామిక్ సర్వే 2025-26 ప్రకారం భారత్ జీడీపీలో ఈ రంగం వాటా 31.1 శాతంగా ఉంది. తయారీ రంగంలో 35.4 శాతం, మొత్తం ఎగుమతుల్లో 48.58 శాతం వాటాను ఈ పరిశ్రమలు కలిగి ఉన్నాయి. ఈ రంగం అవసరాలను గుర్తించి రుణ పరిమితిని పెంచుతున్నట్లు బ్యాంక్ వివరించింది. అలాగే సాధారణ రుణాలతో పోలిస్తే ఎంఎస్ఎంఈ డ్రీమ్ ద్వారా ఇచ్చిన లోన్స్ లో మొండి బకాయిలు తక్కువగా ఉన్నాయట.