న్యాయవ్యవస్థలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించి ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాజమహేంద్రవరం జిల్లా కోర్టు 222 ఏళ్లు, రాజమండ్రి బార్ అసోసియేషన్ 131 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన న్యాయ ఉత్సవాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు.
న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్యానికి కీలకమైన పునాది అని, ప్రజల హక్కుల పరిరక్షణలో రాజకీయ ప్రజాప్రాతినిధ్య వ్యవస్థతో పాటు న్యాయవ్యవస్థ కూడా కీలక పాత్ర పోషిస్తోందని సీఎం పేర్కొన్నారు. తాటి ఆకులపై తీర్పుల ప్రతులు రాసిన కాలం నుంచి నేటి కృత్రిమ మేధ (ఏఐ) వరకు న్యాయవ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు.
న్యాయపాలన, కేసుల నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టేందుకు త్వరలో లీగల్ ఏఐ స్టాక్‌ను అమలు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. యూనిఫైడ్ డిజిటల్ లా డిపాజిటరీ ద్వారా చట్టాలు, నిబంధనలు, ప్రభుత్వ ఉత్తర్వులు, కేసుల రికార్డులను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఏఐ ఆధారిత కేసుల విశ్లేషణ, కౌంటర్ అఫిడవిట్ల తయారీ వంటి సేవలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆన్‌లైన్ లిటిగేషన్ కేస్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ ద్వారా 8.4 లక్షల కేసులను నిర్వహిస్తున్నామని చెప్పారు.
లోక్ అదాలత్‌లు, ఆర్బిట్రేషన్, మీడియేషన్ వంటి ప్రత్యామ్నాయ విధానాలతో కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. వివిధ కోర్టుల్లో ప్రభుత్వం కూడా ప్రతివాదిగా ఉన్న కేసులను న్యాయస్థానాల సహకారంతో త్వరగా పరిష్కరించి ప్రజలకు ప్రయోజనం కల్పించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా వివరించారు.
రాజమహేంద్రవరం చారిత్రక ప్రాధాన్యాన్ని ప్రస్తావిస్తూ ఆదికవి నన్నయ్య, కందుకూరి వీరేశలింగం పంతులు వంటి మహనీయులు ఈ ప్రాంతానికి కీర్తి తెచ్చారని పేర్కొన్నారు. ఆర్థర్ కాటన్ నిర్మించిన బ్యారేజీతో ఉభయ గోదావరి జిల్లాల డెల్టా సస్యశ్యామలంగా మారిందన్నారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాది పూర్తి చేస్తామని ప్రకటించారు. త్వరలో జరగనున్న గోదావరి పుష్కరాలకు సుప్రీంకోర్టు, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
టంగుటూరి ప్రకాశం పంతులు వంటి న్యాయవాదులు స్వాతంత్ర పోరాటంలో ధైర్యసాహసాలు ప్రదర్శించారని గుర్తుచేశారు. రాజమండ్రి బార్ అసోసియేషన్‌లో న్యాయవాదిగా పనిచేసిన జస్టిస్ కోకా సుబ్బారావు భారత సుప్రీంకోర్టు తొమ్మిదో ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారని ప్రస్తావించారు.
న్యాయం అందరికీ సమానంగా, సకాలంలో అందాలన్న రాజ్యాంగ విలువలను పరిరక్షించేందుకు న్యాయవ్యవస్థతో కలిసి పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్‌ను వికసిత్ భారత్‌గా, ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
