సాధారణంగా 16 ఏళ్ల వయసులో పిల్లలు చదువులు, పరీక్షలు, ఆటపాటలతో బిజీగా ఉంటారు. వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుక్కోవడానికి తల్లిదండ్రులను డబ్బులు అడుగుతుంటారు. కానీ కేరళకు చెందిన ఒక 16 ఏళ్ల బాలుడు మాత్రం ఇందుకు పూర్తిగా వేరే. చిన్న వయసులోనే సొంతంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కంపెనీని ప్రారంభించి నడుపుతున్నాడు. అంతేకాదు, తన తండ్రినే కంపెనీలో ఉద్యోగిగా నియమించుకొని.. ఆయనకు నెలకు ఏకంగా రూ.2 లక్షల జీతం కూడా ఇస్తున్నాడు.
ఆ బాలుడి పేరు రౌల్ జాన్ అజు. కేరళలోని కొచ్చికి చెందిన రౌల్ ప్రస్తుతం 12వ తరగతి కామర్స్ చదువుతున్నాడు. చిన్న వయసులోనే ఏఐ టెక్నాలజీపై పట్టు సాధించడంతో అతడికి 'AI కిడ్ ఆఫ్ ఇండియా' అనే పేరు వచ్చింది. చదువుకుంటూనే ఒక టెక్నాలజీ కంపెనీని నడుపుతుండటం, తన తండ్రికి ఉద్యోగం ఇవ్వడంతో రౌల్ కథ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
చిన్నప్పటి నుంచే టెక్నాలజీపై ఆసక్తి
రౌల్‌కు చిన్నప్పటి నుంచే కంప్యూటర్లు, టెక్నాలజీ అంటే చాలా ఇష్టం. మొదట్లో వీడియో ఎడిటింగ్ నేర్చుకోవడంతో అతడి ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది. సుమారు తొమ్మిదేళ్ల వయసులోనే ఏఐ టెక్నాలజీపై ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు. కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ, తనకు వచ్చిన ఆలోచనలను ఆచరణలో పెట్టేవాడు. రౌల్ తండ్రి గతంలో అడోబ్ కంపెనీలో పనిచేయడంతో అతడికి కొన్ని ఆధునిక సాఫ్ట్వేర్ టూల్స్ ఉపయోగించే అవకాశం లభించింది. వాటి సహాయంతో టెక్నాలజీపై మరింత అవగాహన పెంచుకున్నాడు.
స్కూల్ ప్రాజెక్ట్‌తో మొదలైన ప్రయాణం
రౌల్ చిన్నప్పుడు చేసిన ప్రయోగాల్లో ఒకటి మీబాట్ (MeBot) అనే రోబోట్. స్కూల్ సైన్స్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ రోబోట్‌ను తయారు చేశాడు. ఈ రోబోట్ మనుషులతో మాట్లాడగలదు. అంతేకాదు, సొంత గొంతుతో మాట్లాడేలా కూడా రూపొందించాడు. ఒక చిన్న స్కూల్ ప్రాజెక్ట్‌గా మొదలైన ఈ ప్రయోగమే తర్వాత అతడిని ఏఐ రంగంలో మరిన్ని కొత్త ఆవిష్కరణలు చేసేలా ప్రోత్సహించింది.
ఇప్పటికే 15 ఏఐ టూల్స్ తయారీ
ప్రస్తుతం రౌల్ ఏఐ రియల్మ్ టెక్నాలజీస్‌తో కలిసి పనిచేస్తున్నాడు. ఇప్పటివరకు దాదాపు 15 ఏఐ టూల్స్‌ను అభివృద్ధి చేసినట్లు సమాచారం. అతడు తయారు చేసిన వాటిలో RESQ AI, MeBot, ZapGap, Investo AI, FeedFye వంటి టూల్స్ ఉన్నాయి. టెక్నాలజీని కేవలం తాను నేర్చుకోవడమే కాకుండా, ఇతరులకు కూడా నేర్పించాలనే ఉద్దేశంతో థింక్క్రాఫ్ట్ అకాడమీని ప్రారంభించాడు.
దీని ద్వారా విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర ఆసక్తి ఉన్నవారికి ఏఐ టెక్నాలజీని ఎలా ఉపయోగించాలి? దాన్ని వారి పనుల్లో ఎలా ఉపయోగించుకోవాలి? అనే విషయాలపై శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ ద్వారా ఇప్పటివరకు దాదాపు 5 లక్షల మందికి శిక్షణ అందించాడు.
సొంత తండ్రినే ఉద్యోగిగా
రౌల్ కథలో అందరినీ ఎక్కువగా ఆశ్చర్యపరుస్తున్న విషయం ఇదే. తన సొంత కంపెనీలో తండ్రినే ఉద్యోగిగా నియమించుకున్నాడు. ఆయనకు నెలకు రూ.2 లక్షల జీతం కూడా ఇస్తున్నాడు. రౌల్ తండ్రికి ఇప్పటికే పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసిన అనుభవం ఉంది. అమెజాన్, అడోబ్, విప్రో, ఐబీఎం వంటి ప్రముఖ సంస్థల్లో ఆయన పనిచేశారు.
తన కంపెనీని మరింత అభివృద్ధి చేసుకోవడానికి తండ్రి అనుభవం ఉపయోగపడుతుందని రౌల్ భావించాడు. అందుకే ఆయనను తన కంపెనీలో ఉద్యోగిగా నియమించుకున్నాడు. ఈ నిర్ణయం వెనుక రౌల్ ఆలోచన కూడా ఆసక్తికరంగా ఉంది. తన ఫోన్ ద్వారా ప్రపంచంలోని ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చని, కానీ తన తండ్రికి ఉన్న ఉద్యోగ అనుభవాన్ని, ఆయన నేర్చుకున్న విషయాలను ఇంటర్నెట్ ద్వారా అంత ఈజీగా పొందలేనని రౌల్ చెబుతున్నాడు. అందుకే తండ్రిని తన కంపెనీలోకి తీసుకుని, ఆయన అనుభవం నుంచి నేర్చుకుంటూ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు.
సాధారణంగా టెక్నాలజీ రంగంలోకి వెళ్లాలంటే ఇంజినీరింగ్ లేదా కంప్యూటర్ సైన్స్ చదవాలని చాలామంది అనుకుంటారు. కానీ రౌల్ మాత్రం ప్రస్తుతం 12వ తరగతిలో కామర్స్ చదువుతున్నాడు. కొచ్చిలోని నార్త్ ఎడపల్లిలో ఉన్న జీహెచ్ఎస్ఎస్ స్కూల్లోనే చదువుకుంటూనే ఏఐ కంపెనీని నడుపుతున్నాడు. ఒకవైపు స్కూల్ చదువులు, మరోవైపు కంపెనీ పనులు.. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. తనకు టెక్నాలజీపై ఆసక్తి ఉండటంతో, ఆ రంగంలో కొత్త విషయాలు నేర్చుకోవడానికి చదువుతో సంబంధం లేదని తన ప్రయాణం ద్వారా నిరూపిస్తున్నాడు.
ఢిల్లీ ఏఐ సదస్సులోనూ రౌల్
రౌల్ ప్రతిభ కేవలం తన కంపెనీ వరకే పరిమితం కాలేదు. ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో కూడా పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ముఖ్యమైన పాత్ర పోషించబోతోంది? ఈ రంగంలో యువత ఎలా ముందుకు రావాలి? అనే విషయాలపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. అంతేకాదు, విధాన రూపకర్తలతో కూడా మాట్లాడి ప్రభుత్వ సేవల్లో ఏఐ టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవచ్చనే అంశాలపై చర్చించాడు.
యువతకు రౌల్ ఇచ్చే మెసేజ్
ఏఐ టెక్నాలజీని కేవలం ఉపయోగించుకోవడమే కాకుండా, దాని ద్వారా కొత్త కొత్త ఆవిష్కరణలు చేయాలని రౌల్ యువతకు సూచిస్తున్నాడు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదని, ఆసక్తి, కష్టపడే తత్వం ఉంటే చిన్న వయసులోనే గొప్ప విజయాలు సాధించవచ్చని అతడి ప్రయాణం చెబుతోంది.
