ఏటీఎం నుంచి డబ్బులు తీస్తున్నారా ? కస్టమర్లకు ఆర్‌బీఐ కొత్త రూల్స్.. ఇక చార్జీలెన్నో బ్యాంకులే చెప్పాలి!

 ఏటీఎం నుంచి డబ్బులు తీస్తున్నారా ? కస్టమర్లకు ఆర్‌బీఐ కొత్త రూల్స్.. ఇక  చార్జీలెన్నో బ్యాంకులే చెప్పాలి!

ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేసే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఏటీఎంలో ఉచితంగా ఎన్నిసార్లు డబ్బులు తీసుకోవచ్చు ? ఉచిత విత్ డ్రా పరిమితి దాటితే ఎంత ఛార్జీ పడుతుంది ? ఒకవేళ ఏటీఎం నుంచి డబ్బులు రాకపోయినా అకౌంట్‌లో మాత్రం డబ్బులు కట్ అయితే ఏం చేయాలి ? ఇలాంటి విషయాలపై బ్యాంకులు కస్టమర్లకు  స్పష్టమైన సమాచారం ఇవ్వాలని ఆర్‌బీఐ ఆదేశించింది.

ఏటీఎంల ద్వారా డబ్బులు విత్ డ్రా, పాయింట్ ఆఫ్ సేల్ (PoS) మెషీన్ల ద్వారా డబ్బులు  తీసుకోవడం, యూపీఐ ద్వారా డబ్బులు విత్ డ్రా చేయడం వంటి అంశాలకు సంబంధించిన గతంలో వేర్వేరుగా ఉన్న నిబంధనలను ఒకే చోట చేర్చింది. ఈ మేరకు నవంబర్ 27న కొత్త మాస్టర్ డైరెక్షన్ విడుదల చేసింది. 2008 నుంచి 2022 మధ్య జారీ చేసిన 17 పాత సర్క్యులర్లను కొట్టేస్తూ, వాటిలోని నిబంధనలను ఒకే మార్గదర్శకంలో పొందుపరిచింది. అయితే ఈ కొత్త ఆదేశాలు వెంటనే అమల్లోకి వచ్చాయి. మరి కొత్త నిబంధనల ప్రకారం ఏటీఎం వాడే వారికీ ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి ? ఉచిత లావాదేవీల పరిమితి మారిందా ? ఎక్స్ట్రా గా  ఎంత ఛార్జీ చెల్లించాలి ? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం...

 ఉచిత ఏటీఎం లావాదేవీలు ఎన్ని ?  
సాధారణంగా ప్రతి బ్యాంకు కస్టమరుకి నెలకు కొన్ని ఉచిత ఏటీఎం లావాదేవీల సదుపాయం ఉంటుంది. అయితే ఆ పరిమితి ఎన్ని లావాదేవీలకు ఉందో తెలియక చాలామంది అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.

ఒక నెలలో కస్టమర్ ఇప్పటికి ఎన్ని ఉచిత ఏటీఎం లావాదేవీలు ఉపయోగించుకున్నాడు    ? ఇంకా ఎన్ని ఉచిత లావాదేవీలు మిగిలి ఉన్నాయి ? ఉచిత పరిమితి దాటితే తరువాత లావాదేవీకి ఎంత ఛార్జీ పడుతుంది? అనే వివరాలను బ్యాంకులు కస్టమర్లకు తెలియజేయాలి. అంటే మీరు ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునేటప్పుడు ఉచిత లావాదేవీల పరిమితి దాటిన విషయం తెలియకుండా అదనపు ఛార్జీలు పడకుండా బ్యాంకులు ముందుగానే అప్రమత్తం చేయాలి.

 ఏటీఎంలలో  ప్రస్తుతం ఉన్న ఉచిత పరిమితి ఎంత?
ఇక్కడ ఖాకస్టమర్లు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ, ప్రస్తుతం అమల్లో ఉన్న ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితుల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం సేవింగ్స్ కస్టమర్లకు ఈ విధంగా ఉచిత లావాదేవీలు ఉన్నాయి.

మీ సొంత బ్యాంకు ఏటీఎంలో:
*ప్రతి నెలా 5 ఫ్రీ  విత్ డ్రాలు  చేసుకోవచ్చు.
*ఇందులో డబ్బులు తీసుకోవడం మాత్రమే కాకుండా, బ్యాలెన్స్ చెక్ చేయడం కూడా లావాదేవీలుగా  కూడా ఉంటాయి.

ఇతర బ్యాంకుల ఏటీఎంలలో:
*మెట్రో నగరాల్లో నెలకు 3 ఉచిత లావాదేవీలు.
*నాన్ మెట్రో నగర ప్రాంతాల్లో నెలకు 5 ఉచిత లావాదేవీలు.
*అయితే  ఇతర బ్యాంకుల ఏటీఎంల విషయంలో మెట్రో నగర ప్రాంతాల కోసం ఇచ్చిన పరిమితులను కలిపి వేర్వేరుగా ఉపయోగించుకోలేరు. మొత్తంగా ఉచిత లావాదేవీల సంఖ్య ఐదుకు మించకూడదు.

 ఉచిత పరిమితి దాటితే ఎంత ఛార్జీ పడుతుంది?
మీకు ఇచ్చిన ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితి పూర్తయిన తర్వాత మరోసారి ఏటీఎం ఉపయోగిస్తే బ్యాంకు ఛార్జీ వసూలు చేయవచ్చు. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం, ఉచిత పరిమితికి మించి చేసే ప్రతి అదనపు లావాదేవీకి గరిష్టంగా రూ.23 ఛార్జీ విధించవచ్చు. దీనికి వర్తించే పన్నులు అదనంగా ఉంటాయి.

ఉదాహరణకు, మీరు ఒక నెలలో  ఐదు ఉచిత లావాదేవీలను  ఉపయోగించుకున్నారు అనుకుందాం. ఆ తర్వాత మరోసారి ఏటీఎం నుంచి డబ్బులు తీసుకుంటే బ్యాంకు గరిష్టంగా రూ.23తో పాటు పన్నులను ఛార్జ్ చేయవచ్చు. అయితే బ్యాంకులు  ఈ నిర్ణయం మేరకు మరిన్ని ఉచిత లావాదేవీలను కూడా అందించవచ్చు.  

 మెట్రో, నాన్ మెట్రో ఏటీఎంల వివరాలు కూడా
ఏటీఎం ఏ ప్రాంతంలో ఉంది? అది మెట్రో నగర పరిధిలోకి వస్తుందా? లేక నాన్ మెట్రో ప్రాంతంలో ఉందా? అనే విషయం చాలామంది కస్టమర్లకు  తెలియదు. దీని వల్ల ఉచిత లావాదేవీల పరిమితిపై గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది.

ఈ సమస్యను తగ్గించేందుకు ఏటీఎం మెట్రో ప్రాంతంలో ఉందా? మెట్రోయేతర ప్రాంతంలో ఉందా? అనే వివరాలను ఏటీఎం స్క్రీన్‌పై సందేశం ద్వారా లేదా స్టిక్కర్లు, పోస్టర్ల ద్వారా స్పష్టంగా తెలియజేయాలని ఆర్‌బీఐ ఆదేశించింది. అంతేకాదు, ఏటీఎంల చిరునామాలు, వాటి ప్రాంతాలకు సంబంధించిన వివరాలు బ్యాంకుల డేటాబేస్‌లో ఎప్పటికప్పుడు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి.

 ఏటీఎంలో డబ్బులు రాకపోయినా ఛార్జీలు కట్ చేస్తారా?
ఏటీఎం ఉపయోగించే సమయంలో చాలామందికి ఎదురయ్యే సమస్య ఇది. కొన్నిసార్లు ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నిస్తే సాంకేతిక సమస్యల కారణంగా నగదు బయటకు రాదు. మరికొన్ని సందర్భాల్లో ఏటీఎంలో నగదు లేకపోవడం, సర్వర్ సమస్యలు, నెట్‌వర్క్ సమస్యల వల్ల లావాదేవీ విఫలమవుతుంది. అయితే ఇలాంటి లావాదేవీలను కూడా ఉచిత ఏటీఎం లావాదేవీల్లో ఒకటిగా లెక్కించకూడదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

అంటే ఏటీఎంలో నగదు లేకపోవడం వల్ల ట్రాన్సక్షన్ ఫెలమైతే, సర్వర్ లేదా నెట్‌వర్క్ సమస్యల వల్ల డబ్బులు రాకపోతే, ఏటీఎం హార్డ్‌వేర్ లేదా సాఫ్ట్‌వేర్ సమస్యల వల్ల లావాదేవీ ఆగిపోతే, బ్యాంకు లేదా సేవా సంస్థ వైపు ఉన్న సమస్యల వల్ల ట్రాన్సక్షన్ ఫెలమైతే...
వీటిని  ఏటీఎం ట్రాన్సక్షన్లుగా పరిగణించకూడదు. అందువల్ల వీటికి ఎలాంటి ఛార్జీలు విధించకూడదు.

ఏటీఎం ఉపయోగించే ప్రతి ఒక్కరికీ నిబంధనలు అర్థమయ్యేలా ఉండాలని ఆర్‌బీఐ సూచించింది. దీని ప్రకారం బ్యాంకులు  ఏటీఎంలలో  ఏటీఎం నుంచి ఒకసారి ఎంత డబ్బు తీసుకోవచ్చు? నెలకు ఎన్ని ఫ్రీ ట్రాన్సక్షన్స్  ఉంటాయి ?
ఫ్రీ ట్రాన్సక్షన్స్ తరువాత ఎంత ఛార్జీ చెల్లించాలి ? ఈ సమాచారాన్ని ఇంగ్లీష్, హిందీతో పాటు స్థానిక భాషలో కూడా కనిపించేలా ఉంచాలి.

 ఇక PoS మెషీన్ల ద్వారా కూడా 
ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాల్లో మరో ముఖ్యమైన అంశం PoS మెషీన్ల ద్వారా క్యాష్ విత్ డ్రా ..... సాధారణంగా షాపులు, వ్యాపార సంస్థల్లో మనం డెబిట్ కార్డుతో బిల్లులు చెల్లించడానికి ఉపయోగించే మెషీన్లనే PoS (Point of Sale) టెర్మినల్స్ అంటారు. ఇప్పుడు ఈ మెషీన్ల ద్వారా క్యాష్ తీసుకునే సదుపాయానికి సంబంధించిన నిబంధనలను కూడా ఆర్‌బీఐ ఒకే మార్గదర్శకంలో పొందుపరిచింది.

PoS మెషీన్ల ద్వారా ఎంత డబ్బు తీసుకోవచ్చు?
ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం PoS మెషీన్ల ద్వారా నగదు తీసుకునేటప్పుడు ఈ పరిమితులు వర్తిస్తాయి.
*ఒక్కో లావాదేవీలో గరిష్టంగా రూ.2,000 తీసుకోవచ్చు.
*నెలలో అన్ని ప్రాంతాల్లో కలిపి గరిష్టంగా రూ.10,000 వరకు నగదు తీసుకోవచ్చు.
*ఈ సేవపై కస్టమర్లకు ఛార్జీలు విధిస్తే, అవి తీసుకున్న నగదు మొత్తంలో 1 శాతానికి మించకూడదు.
ముఖ్యంగా, షాపులో ఏదైనా వస్తువు కొనుగోలు చేసినప్పుడే నగదు తీసుకోవాలనే నిబంధన లేదు. ఏ వస్తువూ కొనకుండా కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉండాలి.

ఒకవేళ వస్తువులు కొనుగోలు చేయడంతో పాటు డబ్బులు కూడా తీసుకుంటే, బిల్లులో వస్తువుల ధర, తీసుకున్న డబ్బు  మొత్తాన్ని విడివిడిగా చూపించాలి. అలాగే ఈ సదుపాయం అందుబాటులో ఉందా ? దానికి ఎంత ఛార్జీ వర్తిస్తుంది? అనే వివరాలను వ్యాపారులు స్పష్టంగా తెలియజేయాలని ఆర్‌బీఐ సూచించింది.

 UPI ద్వారా ఏటీఎంలో కార్డు లేకుండానే  
చేతిలో ఏటీఎం కార్డు లేకపోయినా UPI సహాయంతో డబ్బులు తీసుకునే సదుపాయం కూడా ఉంది. దినినే Cardless Cash Withdrawal అంటారు. ఈ విధానంలో కస్టమర్  UPI ద్వారా ట్రాన్సక్షన్ అనుమతి ఇస్తారు. తరువాత సంబంధిత ఏటీఎం నెట్‌వర్క్ ద్వారా డబ్బుల విత్ డ్రా  ప్రక్రియ పూర్తవుతుంది. ఈ విధానానికి సంబంధించిన నిబంధనలను కూడా ఆర్‌బీఐ కొనసాగించింది.
 
ఏటీఎం నుంచి డబ్బులు రాకపోయినా అకౌంట్లో డబ్బులు కట్ కావడం, అనవసరంగా ఛార్జీలు విధించడం, ఫెలైన ట్రాన్సక్షన్ కి డబ్బులు వసూలు చేయడం వంటి సమస్యలు ఎదురైతే కస్టమర్లు ముందుగా  బ్యాంకును సంప్రదించవచ్చు. సమస్య పరిష్కారం కాకపోతే, వర్తించే నిబంధనల ప్రకారం ఆర్‌బీఐ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ పథకం ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది.