Health tips:పాలు, పెరుగు, పనీర్.. ఆరోగ్యానికి ఏది బెస్ట్? డైటీషియన్ల సలహా ఇదే

Health tips:పాలు, పెరుగు, పనీర్.. ఆరోగ్యానికి ఏది బెస్ట్?  డైటీషియన్ల సలహా ఇదే

మన రోజువారీ ఆహారంలో పాలు, పెరుగు, పనీర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఇవి శరీరానికి అవసరమైన ప్రోటీన్, కాల్షియం వంటి పోషకాలను అందిస్తాయి. అయితే ఈ మూడింటిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు చేస్తుంది? బరువు తగ్గాలనుకునేవారు, కండరాల బలం పెంచుకోవాలనుకునేవారు, జీర్ణక్రియ మెరుగుపరుచుకోవాలనుకునేవారు దేనిని ఎంచుకోవాలి? పోషకాహార నిపుణుల సూచనల గురించి తెలుసుకుందాం..

పాలు: ఎముకల బలానికి మంచిది

పాలలో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ బి12 పుష్కలంగా ఉంటాయి. 200 మి.లీ. పాలలో సుమారు 6–7 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. ఇవి ఎముకలు, దంతాల ఆరోగ్యానికి, కండరాల పనితీరుకు సహాయపడతాయి. రోజూ పాలు తాగడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. అయితే పాలు తాగినప్పుడు గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తే లాక్టోస్ లేని పాలను ఎంచుకుంటే మంచిదంటున్నారు డైటీషియన్లు.

తమ రోజువారీ ప్రోటీన్ , కాల్షియం అవసరాలను తీర్చుకోవాలనుకునే వారికి, ముఖ్యంగా పానీయాల రూపంలో పోషణను ఇష్టపడే వారికి పాలు ఓ సౌకర్యవంతమైన ఎంపికగా చెప్పవచ్చు. దీనిని అల్పాహారంలో, స్మూతీస్‌లో, గంజిలో కలుపుకోవచ్చు , నేరుగా అలాగే తాగవచ్చు.

పెరుగు: జీర్ణక్రియకు మేలు

పెరుగులో ప్రోటీన్, కాల్షియంతో పాటు ప్రయోజనకరమైన బ్యాక్టీరియా ఉంటాయి. ఇవి పేగుల ఆరోగ్యానికి, జీర్ణక్రియకు తోడ్పడతాయి. పాలతో పోలిస్తే కొంతమందికి పెరుగు సులభంగా జీర్ణమవుతుంది. భోజనంతో పాటు తీసుకోవడం మంచిది. అయితే అదనపు చక్కెర కలిపిన పెరుగుకు బదులుగా సాధారణ పెరుగును ఎంచుకోవాలి.

పనీర్: ప్రోటీన్ కోసం బెస్ట్

కండరాల బలం పెంచుకోవాలనుకునేవారికి పనీర్ మంచి ఆహారం. 100 గ్రాముల పనీర్‌లో సుమారు 18–19 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ముఖ్యంగా శాకాహారులకు ఇది మంచి ప్రోటీన్ వనరు. అయితే ఇందులో కొవ్వు, కేలరీలు కూడా ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి మితంగా తీసుకోవాలంటున్నారు న్యూట్రిషియన్లు. మాంసం, చేపలు,  గుడ్లపై ఆధారపడకుండా ప్రోటీన్  పెంచుకోవాలనుకునే శాకాహారులకు పనీర్ ప్రత్యేకంగా బాగా పనిచేస్తుంది. దీనిని సలాడ్‌లు, వేపుడు కూరలు, శాండ్‌విచ్‌లు, బుర్జీ , సాంప్రదాయ భారతీయ వంటకాలలో చేర్చుకోవచ్చు.

మరి ఏది ఎంచుకోవాలి?

ప్రోటీన్ కోసం పనీర్, జీర్ణక్రియకు పెరుగు, కాల్షియం కోసం పాలు ఉపయోగపడతాయి. ఈ మూడింటిలో ఒక్కటే ఉత్తమమని చెప్పలేం. మీ శరీర అవసరాలు, ఆరోగ్య పరిస్థితి, ఆహారపు అలవాట్లను బట్టి ఎంచుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. వీలైతే మూడింటినీ తగిన మోతాదులో సమతుల్య ఆహారంలో భాగంగా చేర్చుకోవడం మంచిదంటున్నారు.