బంగారం రేట్లలో హెచ్చుతగ్గులు కొనసాగుతుండటంతో భారతీయులు ఇప్పుడే నగలు కొనాలా లేక ధరలు తగ్గే వరకు వేచి చూడాలా అనే సందిగ్ధంలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో గోల్డ్ ఈటీఎఫ్ నుంచి ఆభరణాల కొనుగోలు వ్యూహం (బ్రిడ్జ్ బయింగ్ స్ట్రాటజీ) ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ వ్యూహం ప్రకారం వినియోగదారులు నేరుగా నగలు కొనడానికి బదులుగా గోల్డ్ ఈటీఎఫ్‌లలో చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టాలి. ఆ తర్వాత తమకు అవసరమైనప్పుడు ఆ పెట్టుబడిని నగదుగా మార్చుకుని ఆభరణాలు కొనుగోలు చేయవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్‌లు దేశీయంగా ఉన్న బంగారం ధరల ఆధారంగా పనిచేస్తాయి. వీటిని డీమ్యాట్ ఖాతాలో ఉంచుకోవచ్చు. ఫిజికల్ గోల్డ్ కొన్నప్పుడు ఉండే మేకింగ్ చార్జీలు, వేస్టేజ్, జీఎస్టీ వంటి ఖర్చులు వీటిలో ఉండవు.
కొద్ది నెలల తర్వాత పెళ్లిళ్లు, పండుగల కోసం నగలు కొనాలనుకునే వారు వెంటనే భౌతిక బంగారాన్ని కొనాల్సిన అవసరం లేదని పీఎన్‌జీఎస్ డైరెక్టర్ అమిత మోదక్ చెప్పారు. ఆ డబ్బును గోల్డ్ ఈటీఎఫ్‌లో పెట్టుబడి పెట్టవచ్చని ఆయన సూచించారు. ఈటీఎఫ్ యూనిట్ల విలువ బంగారం ధరలకు అనుగుణంగా మారుతూ ఉంటుంది. నగలు కొనే సమయం వచ్చినప్పుడు ఈటీఎఫ్ యూనిట్లను అమ్మి ఆ సొమ్మును బ్యాంక్ ఖాతాలోకి బదిలీ చేసుకోవాలి. ఆ డబ్బుతో జ్యువెలరీ షాపులో నగలు కొనవచ్చు. ఈటీఎఫ్ యూనిట్లను నేరుగా షాపులో ఇచ్చి నగలు తీసుకోలేమని.. ముందుగా వాటిని అమ్మేయాలని స్పష్టం చేశారు.
పెట్టుబడి ఇలా..
ఈ వ్యూహాన్ని లెమన్ రీసెర్చ్ హెడ్ గౌరవ్ గార్గ్ ఒక ఉదాహరణతో వివరించారు. ఒక కుటుంబం ఆరు నెలల తర్వాత రూ.5 లక్షల విలువైన నగలు కొనాలనుకుంటే ఆ మొత్తాన్ని గోల్డ్ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఒకవేళ బంగారం ధర 8 శాతం పెరిగితే ఆ పెట్టుబడి విలువ రూ.5 లక్షల 40వేలకు చేరుతుంది. రేటు తగ్గితే ఈటీఎఫ్ విలువ కూడా తగ్గుతుంది కానీ మార్కెట్లో బంగారం ధర తగ్గడం వల్ల నగలను తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. 6 నెలల కాలంలో నెలకు రూ.83వేల 333 చొప్పున పెట్టుబడి పెట్టడం వల్ల సగటు కొనుగోలు ధర తగ్గుతుందని తెలిపారు.
ఈ వ్యూహం కేవలం బంగారం రేట్ల ఓలటాలిటీ అంటే హెచ్చుతగ్గుల నుంచి రక్షణ పొందడానికే తప్ప కచ్చితమైన లాభాల కోసం కాదని నిపుణులు స్పష్టం చేశారు. మార్కెట్ రిస్క్ అవగాహన ఉన్నవారు. 6 నెలల నుంచి ఏడాదిలోపు నగలు కొనాలనుకునే వారు ఈ పద్ధతిని పరిశీలించవచ్చని గౌరవ్ గార్గ్ సూచించారు.
