ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 33 వేల 647 మంది పోలీసు సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉంటారు. 9 వేల 523 పోలింగ్ స్టేషన్ లొకేషన్లలో నిఘా నీడన ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా విస్తృత స్థాయిలో పోలీసు బలగాలను మోహరించారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా భద్రత కల్పిస్తామన్నారు.
రెండో విడత ఎన్నికల్లో మొత్తం 9వేల 523 పోలింగ్ స్టేషన్ లొకేషన్లు ఉండగా, వాటి పరిధిలో 40వేల 569 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. వీటిలో 1,840 హైపర్ సెన్సిటివ్ కేంద్రాలకు 9 వేల 48 మంది సిబ్బందిని, 2వేల 43 సెన్సిటివ్ కేంద్రాలకు 8వేల164 మంది సిబ్బందిని కేటాయించారు. మిగిలిన 5వేల 689 సాధారణ పోలింగ్ కేంద్రాల్లోనూ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
ఎన్నికల విధుల కోసం అందుబాటులో ఉన్న పోలీసు బలగాల్లో 29 మంది ఎస్పీలు, 48 మంది అదనపు ఎస్పీలు, 140 మంది డీఎస్పీలు, 721 మంది సీఐలు, ఆర్ఐలు, 1,507 మంది ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, 2,911 మంది ఏఎస్ఐలు, ఏఆర్ఎస్ఐలు, 5,225 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 17,076 మంది కానిస్టేబుళ్లు, 5,990 మంది హోంగార్డులు ఉన్నారు. ఇదిలా ఉండగా.. రెండో విడతలో 4 వేల 933 సర్పంచ్ స్థానాలకు గాను 11వందల 66 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3వేల 848 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 2న మూడో విడత ఎన్నికలతో ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగుస్తాయి.
ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఐజీ ఎస్. హరికృష్ణ హెచ్చరించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా, నిరంతర పెట్రోలింగ్, రూట్ మొబైల్ బృందాలు, స్ట్రైకింగ్ ఫోర్సెస్ ద్వారా భద్రతను పర్యవేక్షిస్తామని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని, ప్రలోభాలకు లొంగకుండా ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
