విశాఖపట్నంలోని కైలాసగిరి ఘాట్ రోడ్డుపై స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. అయితే రోడ్డు పక్కనే ఉన్న రక్షణ గోడ బస్సును అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న 37 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు, ఓ టీచర్ , డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే..
కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీ ఆదర్శ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌కు చెందిన విద్యార్థులు శనివారం (నవంబర్ 28, 2026) విహారయాత్ర కోసం విశాఖపట్నం వచ్చారు. మొత్తం ఎనిమిది బస్సుల్లో విద్యార్థులు పర్యటనకు రాగా.. కైలాసగిరి కొండపై నుంచి ఘాట్ రోడ్డులో కిందికి దిగుతున్న సమయంలో ఓ బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు బోల్తా పడింది. రక్షణ గోడ ఉండటంతో బస్సు లోయలోకి దూసుకెళ్లకుండా అక్కడే ఆగిపోయింది.
సమాచారం అందుకున్న ఆరిలోవ పోలీసులు, జిల్లా అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థులంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
విద్యామంత్రి నారా లోకేశ్ స్పందన
విశాఖపట్నంలోని కైలాసగిరి ఘాట్ రోడ్డుపై స్కూల్ బస్సు ప్రమాదానికి గురైన ఘటనపై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పందించారు. విద్యార్థులంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు చెప్పడంతో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని లోకేశ్ పేర్కొన్నారు. దూర ప్రాంతాలకు, విజ్ఞాన యాత్రలకు పిల్లలను తీసుకెళ్లే సమయంలో బస్సుల ఫిట్నెస్ను తప్పనిసరిగా తనిఖీ చేయాలని సూచించారు. స్కిల్డ్ డ్రైవర్లను నియమించడంతో పాటు విద్యార్థుల భద్రతకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని స్కూల్ యాజమాన్యాలకు సూచించారు.
