వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లలో ప్రయాణిస్తే మంచి సౌకర్యాలతో పాటు నాణ్యమైన ఆహారం కూడా లభిస్తుందని ప్రయాణికులు ఆశిస్తారు. కానీ ఓ ప్రయాణికుడికి మాత్రం వందే భారత్ రైలులో చేదు అనుభవం ఎదురైంది. అల్పాహారంగా ఇచ్చిన వడలో ఏకంగా ఒక ఇనుప బోల్టు కనిపించింది. వడ తింటున్న సమయంలో ఆ బోల్టు అతడి పళ్ల మధ్య ఇరుక్కోవడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. వెంటనే దానికి సంబంధించిన వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో రైల్వే శాఖ, ఐఆర్‌సీటీసీ స్పందించాయి.
వడలో ఇనుప బోల్టు
సమర్థ్ కొడియాల్ అనే ప్రయాణికుడు బెంగళూరు నుంచి బెల్గాం వెళ్లేందుకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నాడు. ఈ సమయంలో రైలులో అతడికి అల్పాహారంగా వడ ఇచ్చారు. అయితే వడ తింటుండగా అతడి పళ్ల మధ్య ఒక్కసారిగా ఏదో గట్టిగా తగిలింది. మొదట ఏంటో అర్థం కాలేదు. దీంతో వడను పరిశీలించగా అందులో ఒక పెద్ద ఇనుప బోల్టు కనిపించింది. దీంతో అతడు ఆశ్చర్యపోయాడు. ప్రయాణికులకు ఇచ్చే ఆహారంలో ఇలాంటివి ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశాడు. వెంటనే ఆ బోల్టు, వడకు సంబంధించిన వీడియోను రికార్డ్ చేశాడు.
సోషల్ మీడియాలో రైల్వేకు ఫిర్యాదు
ఈ ఘటనపై సమర్థ్ నవంబర్ 27న ఎక్స్(X)లో వీడియోను షేర్ చేశాడు. తన పోస్టులో రైల్వే అధికారులతో పాటు ఐఆర్‌సీటీసీని కూడా ట్యాగ్ చేశాడు. బెంగళూరు నుంచి బెల్గాం ప్రయాణంలో తనకు ఇచ్చిన వడలో ఇనుప బోల్టు కనిపించిందని ఫిర్యాదు చేశాడు. ఆహారంలో ఇలాంటివి ఉండటం చాలా తీవ్రమైన విషయమని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కోరాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో నెటిజన్లు కూడా ఆహార నాణ్యతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వందే భారత్ వంటి ఆధునిక రైలులో ప్రయాణికులకు అందించే ఆహారంలో ఇలాంటి నిర్లక్ష్యం ఎలా జరిగిందని కొందరు ప్రశ్నిస్తున్నారు.
ప్రయాణికుడికి క్షమాపణ చెప్పిన IRCTC
ఈ ఘటనపై ప్రయాణికుడు చేసిన ఫిర్యాదుకు ఐఆర్‌సీటీసీ స్పందించింది. ప్రయాణికుడికి ఎదురైన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించామని, సంబంధిత ఆహార సరఫరా సంస్థపై కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా వంటగది సిబ్బందికి ప్రత్యేక సూచనలు చేసినట్లు పేర్కొంది. ఆహారం తయారు చేయడానికి ముందు వంటగదిలో ఉపయోగించే పరికరాలను పూర్తిగా చెక్ చేయాలని, వంటగది పరిసరాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించినట్లు వెల్లడించింది. అయితే, సంబంధిత ఆహార సరఫరా సంస్థపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు.
రైళ్లలో ఆహార నాణ్యతపై మళ్లీ చర్చ
రైళ్లలో ప్రయాణికులకు ఇచ్చే ఆహార నాణ్యతపై గతంలోనూ చాల ఫిర్యాదులు వచ్చాయి. కొన్నిసార్లు ఆహారంలో పురుగులు కనిపించాయని, మరికొన్నిసార్లు నాణ్యత లేని భోజనం ఇస్తున్నారని ప్రయాణికులు సోషల్ మీడియాలో ఫిర్యాదులు చేశారు. ఇప్పుడు వందే భారత్ రైలులో వడ్డించిన వడలో ఇనుప బోల్టు కనిపించడం మరోసారి ఆహార భద్రతపై చర్చకు దారితీసింది.
ఒకవేళ ఆ ప్రయాణికుడు ఆ బోల్టును గుర్తించకుండా తినేసి ఉంటే పళ్లు, నోటికి తీవ్ర గాయాలు అయ్యే ప్రమాదం ఉండేది. ఇలాంటి ఘటనలు జరగకుండా ఆహారం తయారీ నుంచి ప్రయాణికులకు అందించే వరకు ప్రతి దశలోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తానికి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే కాకుండా, వారికి అందించే ఆహారం కూడా సురక్షితంగా, నాణ్యంగా ఉండేలా రైల్వే అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.
A large bolt found in Vada in the Vande Bharath meal while travelling from Bengaluru to Belagavi today. This is a huge lapse in food quality. Please look into this matter @RailMinIndia @RailwaySeva @RailMadad @IRCTCofficial @railcomplaint #IndianRailways #VandeBharat https://t.co/VQxoUhtXIv
— samarth kodial (@SamKodial) November 27, 2026
