2024 ఎన్నికలు చట్టబద్దం కావు.. 850 సీట్లతో ప్రజాస్వామ్యానికి ముప్పు: రాహుల్ గాంధీ

2024 ఎన్నికలు చట్టబద్దం కావు.. 850 సీట్లతో ప్రజాస్వామ్యానికి ముప్పు: రాహుల్ గాంధీ

డీలిమిటేషన్ పేరుతో దేశ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. లోక్‌సభ స్థానాలను 850కి పెంచడం ద్వారా బీజేపీకి ఇష్టానుసారంగా వ్యవహరించే అవకాశం కల్పిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఓటు చోరీ జరుగుతోందని దేశ ప్రజలు, ముఖ్యంగా యువత గుర్తించారని అన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఓటు చోరీకి పాల్పడ్డారని ఆరోపించారు.

2024 ఎన్నికలు అసలు న్యాయబద్ధంగా జరగలేదని రాహుల్ గాంధీ  ఆరోపించారు. ఎన్నికల కమిషన్ మోదీ చెప్పినట్లుగా ఎన్నికల మ్యాప్‌ను రూపొందిస్తోందని, బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల నియోజకవర్గాల పునర్విభజనకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. దేశంలో కులగణన నిర్వహించడం బీజేపీకి ఇష్టం లేదని ఆరోపించారు. ఎన్నికల్లో రిగ్గింగ్‌కు బీజేపీ పాల్పడుతోందని దేశవ్యాప్తంగా ప్రజలకు తెలుసని రాహుల్ అన్నారు. 

డీలిమిటేషన్ కమిషన్‌ను మోదీ ప్రభుత్వం తన ఆధీనంలో ఉంచుకుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. 2027 జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్లను కూడా ప్రస్తుతమున్న 543 లోక్‌సభ స్థానాల ప్రాతిపదికన అమలు చేయాలన్నారు. 850 సీట్ల ప్రతిపాదన ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారుతుందని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.