హీరో స్ప్లెండర్ ప్లస్ XTEC, హోండా షైన్, TVS రైడర్.. ఈ మూడు బైక్‌లలో ఏది కొనాలి ? ఏది బెస్ట్ అంటే ?

 హీరో స్ప్లెండర్ ప్లస్ XTEC, హోండా షైన్, TVS రైడర్.. ఈ మూడు బైక్‌లలో ఏది కొనాలి ? ఏది బెస్ట్ అంటే ?

రోజు ప్రయాణాల కోసం బైక్ కొనాలనుకునే వారికి మార్కెట్లో ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. అయితే తక్కువ ధర, మంచి మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు ఉండే బైక్ కావాలని చాలామంది కోరుకుంటారు. మరికొందరు కొంచెం ఎక్కువ డబ్బు పెట్టినా మంచి పర్ఫార్మెన్స్, కంఫర్ట్, లేటెస్ట్ ఫీచర్లు ఉన్న బైక్ కొనాలని అనుకుంటారు....

ఇలాంటి వారిని ఆకట్టుకుంటున్న మూడు ప్రముఖ బైక్‌లు హీరో స్ప్లెండర్ ప్లస్ XTEC, హోండా షైన్ 125, TVS రైడర్. ఈ మూడింటికీ మార్కెట్లో మంచి గుర్తింపు ఉంది. అయితే ఇంజిన్, పవర్, మైలేజ్, కంఫర్ట్, ఫీచర్లు, ధర వంటి విషయాల్లో వీటి మధ్య తేడాలు ఉన్నాయి. మరి ఈ మూడు బైక్‌లలో ఏది బెస్ట్ ? మీ అవసరాలకు ఏ బైక్ సరిపోతుంది? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం...

 ఇంజిన్, పవర్ విషయంలో ఏ బైక్ ముందుందంటే ?
ముందుగా ఈ మూడు బైక్‌ల ఇంజిన్ సామర్థ్యం, పవర్ గురించి తెలుసుకుందాం..... హీరో స్ప్లెండర్ ప్లస్ XTECలో 97.2cc ఇంజిన్ ఉంది.   7.91 bhp పవర్, 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌ను  రోజు ప్రయాణాలు, మంచి మైలేజ్ కోసం రూపొందించారు. ఇందులో ఉండే i3S టెక్నాలజీ వల్ల ట్రాఫిక్‌లో బైక్ ఆపినప్పుడు ఇంజిన్ ఆటోమేటిక్‌గా ఆగుతుంది. మళ్లీ క్లచ్ నొక్కగానే స్టార్ట్ అవుతుంది. దీనివల్ల ఇంధనం ఆదా అవుతుంది.

హోండా షైన్ 125లో 123.94cc ఇంజిన్ ఉంటుంది.  10.59 bhp పవర్, 11 Nm టార్క్‌ను అందిస్తుంది. స్ప్లెండర్‌తో పోలిస్తే ఎక్కువ పవర్ ఉండటంతో ప్రయాణంలో మంచి పర్ఫార్మెన్స్  చూపిస్తుంది. ఇందులో 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉండటం మరో ప్రత్యేకత. ముఖ్యంగా ఎక్కువ దూరం ప్రయాణించేవారికి, అప్పుడప్పుడు హైవేపై వెళ్లేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఈ మూడింటిలో ఎక్కువ పవర్ ఇచ్చే బైక్ TVS రైడర్. ఇందులో 124.8cc ఇంజిన్ ఉంటుంది. 11.2 bhp పవర్, 11.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఎకో, పవర్ అనే రెండు రైడింగ్ మోడ్‌లు ఉంటాయి. అవసరాన్ని బట్టి మంచి మైలేజ్ కోసం ఎకో మోడ్, ఎక్కువ పర్ఫార్మెన్స్  కోసం పవర్ మోడ్ ఎంచుకోవచ్చు. కొన్ని iGO వేరియంట్లలో ఎక్స్ట్రా టార్క్ సదుపాయం కూడా ఉంది.

ఇంజిన్ పరంగా చూస్తే  TVS రైడర్ ఎక్కువ పవర్ అందిస్తుంది. హోండా షైన్ 125 పర్ఫార్మెన్స్, మైలేజ్ మధ్య మంచి బ్యాలెన్స్ ఐస్తుంది. హీరో స్ప్లెండర్ మాత్రం తక్కువ ఖర్చుతో రోజు ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.

 బరువు, సీటింగ్ సౌకర్యం ఎలా ఉన్నాయంటే 
బైక్ కొనేటప్పుడు ఇంజిన్‌తో పాటు దాని బరువు, సీటు ఎత్తు, కూర్చునే విధానం కూడా ముఖ్యమే.

ఈ మూడు బైక్‌లలో హీరో స్ప్లెండర్ ప్లస్ XTEC చాలా తేలికగా ఉంటుంది. అందువల్ల రద్దీగా ఉండే రోడ్లపై ఈజీగా నడపవచ్చు. తక్కువ స్పీడుతో ప్రయాణించేటప్పుడు కూడా కంట్రోల్ చేయడం సులభం. కొత్తగా బైక్ నడపడం నేర్చుకునేవారికి కూడా ఇదొక  మంచి సెలెక్షన్.

హోండా షైన్ 125 స్ప్లెండర్‌తో పోలిస్తే కొంచెం బరువు ఎక్కువగా ఉంటుంది. అయితే దీని సీటింగ్ పొజిషన్ సౌకర్యంగా ఉంటుంది. ఇద్దరు కూర్చుని ప్రయాణించడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. రోజూ ఎక్కువ దూరం ప్రయాణించేవారికి మంచి ఆప్షన్.

TVS రైడర్ ఈ మూడు బైక్‌లలో  కొంచెం బరువుగా ఉంటుంది. అయితే దీని సీటు ఎత్తు తక్కువగా ఉండటం వల్ల చాలామంది రైడర్లకు సౌకర్యంగా ఉంటుంది. స్పోర్టీగా ఉండే రైడింగ్ పొజిషన్, మంచి గ్రౌండ్ క్లియరెన్స్ దీని ప్రత్యేకతలు. రద్దీగా ఉండే రోడ్లపై కూడా చురుగ్గా నడపవచ్చు.

 సస్పెన్షన్, బ్రేకింగ్ సిస్టమ్ ఎలా ఉన్నాయంటే 
బైక్‌పై ప్రయాణించేటప్పుడు గుంతలు, స్పీడ్ బ్రేకర్లు ఎదురవుతుంటాయి. అలాంటి సమయంలో సస్పెన్షన్ బాగుంటే ప్రయాణం సౌకర్యంగా ఉంటుంది. ఈ మూడు బైక్‌లలో ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్ ఉంటుంది.

హీరో స్ప్లెండర్ ప్లస్ XTEC, హోండా షైన్ 125 బైక్‌లలో వెనుక వైపు రెండు షాక్ అబ్జార్బర్లు ఉంటాయి. TVS రైడర్‌లో మాత్రం మోనోషాక్ సస్పెన్షన్ ఉంటుంది. దీనిని అవసరానికి అనుగుణంగా అడ్జస్ట్ చేసుకునే సదుపాయం కూడా ఉంది.

బ్రేకింగ్ విషయానికి వస్తే ఈ మూడు బైక్‌లలో వేరియంట్‌ను బట్టి తేడాలు ఉంటాయి.

*హీరో స్ప్లెండర్ కొన్ని వేరియంట్లలో ముందు డ్రమ్ బ్రేక్, మరికొన్ని వేరియంట్లలో ముందు డిస్క్ బ్రేక్ ఉంటుంది.
*హోండా షైన్ 125లో కూడా వేరియంట్‌ను బట్టి ముందు డిస్క్ బ్రేక్  ఉంటుంది.
*TVS రైడర్లో వేరియంట్‌ను బట్టి ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లతో పాటు డ్యూయల్ ఛానల్ ABS  కూడా లభిస్తుంది.

వీల్స్ విషయానికి వస్తే స్ప్లెండర్, షైన్‌లో 18 అంగుళాల వీల్స్ ఉంటాయి. TVS రైడర్‌లో 17 అంగుళాల వీల్స్, వెడల్పాటి టైర్లు ఉంటాయి. ఇవి బైక్‌కు స్పోర్టీ లుక్‌ను ఇస్తాయి.

 ఫీచర్ల విషయంలో ఏ బైక్‌లో ఎక్కువ సౌకర్యాలు ఉన్నాయంటే 
ఇప్పుడు చాలా మంది బైక్ కొనేటప్పుడు మైలేజ్‌తో పాటు డిజిటల్ డిస్‌ప్లే, బ్లూటూత్, మొబైల్ ఛార్జింగ్ వంటి ఫీచర్లను కూడా చూస్తున్నారు.

హీరో స్ప్లెండర్ ప్లస్ XTECలో సాధారణ స్ప్లెండర్‌తో పోలిస్తే ఇందులో ఎక్కువ ఫీచర్లు ఉన్నాయి. డిజిటల్ మీటర్, బ్లూటూత్ ద్వారా కాల్, SMS అలర్ట్స్, రియల్ టైమ్ మైలేజ్ సమాచారం వంటి సదుపాయాలు ఉంటాయి. i3S టెక్నాలజీ కూడా ఉంది. XTEC 2.0 వేరియంట్‌లో LED హెడ్‌ల్యాంప్, హజార్డ్ లైట్లు, మొబైల్ ఛార్జింగ్ పోర్ట్, కొత్త డిజైన్ సీటు వంటి ఎక్స్ట్రా ఫీచర్లు ఉన్నాయి.

హోండా షైన్ 125లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది. దీని ద్వారా రియల్ టైమ్ మైలేజ్, పెట్రోల్ అయిపోవడానికి ఇంకా ఎంత దూరం ప్రయాణించవచ్చనే వివరాలు తెలుసుకోవచ్చు. USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్, ఆటోమేటిక్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్ కూడా ఉన్నాయి. అయితే ఇందులో స్మార్ట్‌ఫోన్ బ్లూటూత్ కనెక్టివిటీ లేదు.

ఈ మూడింటిలో ఎక్కువ ఆధునిక ఫీచర్లు ఉన్న బైక్ TVS రైడర్. వేరియంట్‌ను బట్టి కలర్ TFT డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్, వాయిస్ అసిస్టెన్స్ వంటి సదుపాయాలు ఉంటాయి. ఫీచర్ల పరంగా చూస్తే TVS రైడర్ ముందుంది. తర్వాత హీరో స్ప్లెండర్ XTEC, ఆ తర్వాత హోండా షైన్ 125 నిలుస్తాయి.

 ధర విషయంలో ఏది తక్కువ?
బైక్ కొనేటప్పుడు చాలామంది మొదట చూసేది ధరనే. ఈ మూడు బైక్‌లలో హీరో స్ప్లెండర్ ప్లస్ XTEC ప్రారంభ వేరియంట్ ధర తక్కువగా ఉంటుంది. అయితే ఇందులో XTEC 2.0, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వంటి ఎక్స్ట్రా  ఫీచర్లు ఉన్న వేరియంట్ల ధర పెరుగుతుంది.

హోండా షైన్ 125 ధర ఈ రెండింటి మిడ్ రేంజ్లో ఉంటుంది. ఇందులో కూడా డిస్క్ బ్రేక్, లిమిటెడ్ ఎడిషన్ వంటి వేరియంట్లను బట్టి ధర మారుతుంది.

TVS రైడర్‌లో అధునాతన ఫీచర్లు, TFT డిస్‌ప్లే, ABS వంటి సదుపాయాలు ఉన్న టాప్ వేరియంట్లు ఎక్కువ ధరకు లభిస్తాయి.

ధర విషయంలో హీరో స్ప్లెండర్ ప్లస్ XTEC తక్కువ బడ్జెట్ కొనుగోలుదారులకు అనుకూలంగా ఉంటుంది. TVS రైడర్ మాత్రం ఎక్కువ ఫీచర్లు కోరుకునేవారికి మంచి అప్షన్.

 మీకు ఏ బైక్ సరిపోతుందంటే 
ఇప్పుడు ఈ మూడు బైక్‌లలో మీ అవసరాలకు తగ్గట్టుగా ఏది కొనాలంటే..  మంచి మైలేజ్, తక్కువ ఖర్చు కావాలంటే హీరో స్ప్లెండర్ ప్లస్ XTEC. 

మీరు రోజూ ఆఫీసుకు వెళ్లడానికి, చిన్న చిన్న పనుల కోసం బైక్ ఉపయోగిస్తుంటే హీరో స్ప్లెండర్ ప్లస్ XTEC మంచి అప్షన్. దీని తక్కువ బరువు, ఈజీ  మెయింటెనెన్స్, i3S టెక్నాలజీ, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉపయోగపడతాయి. అయితే చిన్న ఇంజిన్, నాలుగు గేర్లు మాత్రమే ఉండటంతో హైవేపై ఎక్కువ స్పీడుతో ప్రయాణించాలనుకునేవారికి ఇది అంతగా సరిపోకపోవచ్చు.

పవర్, సౌకర్యం రెండూ కావాలంటే హోండా షైన్ 125 
మీకు మంచి పర్ఫార్మెన్స్ తో పాటు సౌకర్యవంతమైన ప్రయాణం కావాలంటే హోండా షైన్ 125ను పరిశీలించవచ్చు. దీని 125cc ఇంజిన్, ఐదు గేర్లు, సౌకర్యవంతమైన సీటింగ్ పొజిషన్ ఎక్కువ దూరం ప్రయాణించేవారికి ఉపయోగపడతాయి. మైలేజ్, పర్ఫార్మెన్స్, సౌకర్యం.. ఈ మూడింటి మధ్య మంచి బ్యాలెన్స్ కోరుకునేవారికి ఇది సరైన అప్షన్ కావచ్చు.

స్పోర్టీ లుక్, ఎక్కువ ఫీచర్లు కావాలంటే  
మీకు సాధారణ కమ్యూటర్ బైక్ కాకుండా స్పోర్టీ లుక్, ఎక్కువ పవర్, ఆధునిక ఫీచర్లు కావాలంటే TVS రైడర్‌ను ఎంచుకోవచ్చు. దీని ఇంజిన్ పవర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే TFT డిస్‌ప్లే, బ్లూటూత్, నావిగేషన్ వంటి ఫీచర్లు కూడా వేరియంట్‌ను బట్టి లభిస్తాయి. అయితే మిగతా రెండు బైక్‌లతో పోలిస్తే దీని ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది.

చివరిగా ఏ బైక్ కొనాలి?
ఈ మూడు బైక్‌లు వాటి ప్రత్యేకతలతో ఆకట్టుకుంటున్నాయి. తక్కువ బడ్జెట్, రోజు ప్రయాణాలు, తక్కువ మెయింటెనెన్స్ కోసం హీరో స్ప్లెండర్ ప్లస్ XTEC. మంచి పవర్, సౌకర్యం, పర్ఫార్మెన్స్ కోసం హోండా షైన్ 125. స్పోర్టీ లుక్, ఎక్కువ ఫీచర్లు, మెరుగైన పవర్ కోసం TVS రైడర్. కాబట్టి బైక్ కొనేముందు మీ బడ్జెట్, రోజు ప్రయాణ దూరం, మైలేజ్ అవసరం, మీకు కావాల్సిన ఫీచర్లను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోండి. వీలైతే మూడు బైక్‌లను టెస్ట్ రైడ్ చేసి, మీకు ఏది సౌకర్యంగా అనిపిస్తుందో దానిని తీసుకోవడం మంచిది.

గమనిక:  వీటి ధరలు, వేరియంట్లు, ఫీచర్లు ప్రాంతాన్ని బట్టి మారవచ్చు. కొనే  ముందు సంబంధిత కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదా షోరూమ్‌లో తాజా వివరాలు తెలుసుకోండి.