ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు మినీ మేడారం జాతర

ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు మినీ మేడారం జాతర

ములుగు జిల్లాలో జరిగే మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు మినీ మేడారం జాతర జరగనుందని మంత్రి ప్రకటించారు. రాబోయే రెండు నెలల పాటు మినీ జాతర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. భవిష్యత్ జాతరల అవసరాలకు అనుగుణంగా శాశ్వత మౌలిక వసతుల కల్పనకు ఏర్పాట్లు చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు.

మేడారంతో పాటు అనుబంధ జాతరల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, ట్రాఫిక్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రహదారుల విస్తరణ జరగాలని మంత్రి చెప్పారు. గోదావరి పుష్కరాలకు ముందస్తు కార్యాచరణ కచ్చితంగా చేయాలని, శాఖల వారీగా ప్రతిపాదనలు సమర్పించాలని.. ఐలాపురం జాతరలో మౌలిక వసతుల కల్పనపై ఐటీడీఏ ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సీతక్క అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఫిబ్రవరి 17 నుంచి 20వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు మినీ జాతర కొనసాగనుంది. మేడారం సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. జాతరను సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు పూజారులు ఏర్పాట్లు చేయనున్నారు.

నాలుగు రోజుల పాటు కార్యక్రమాలు

  • ఫిబ్రవరి 17న మేడారం మినీ జాతర ప్రారంభం. అదే రోజు సారలమ్మను గద్దెపైకి తీసుకురానున్నారు.
  • ఫిబ్రవరి 18న సమ్మక్కను గద్దెపైకి తీసుకురానున్నారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవార్లను దర్శించుకోనున్నారు.
  • ఫిబ్రవరి 19న భక్తులు తమ మొక్కులు చెల్లించుకునే రోజు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోనున్నారు.
  • ఫిబ్రవరి 20న మినీ మేడారం జాతర ముగియనుంది.