తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం కొండపై శనివారం కార్తీక మహాదీపం వెలగడంతో భక్తులు భావోద్వేగానికి గురయ్యారు. కొండపై ఉన్న పురాతన దీపథూన్ రాతి స్తంభంపై దీపం వెలిగిన క్షణం భక్తులు ఆనందంతో పరవశించిపోయారు. కొందరు చేతులెత్తి మురుగన్ స్వామిని ప్రార్థించగా, మరికొందరు కన్నీళ్లు పెట్టుకున్నారు. 'వెట్రివేల్ మురుగనుక్కు అరోగరా' అంటూ నినాదాలు చేస్తూ బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.
#WATCH | Madurai, Tamil Nadu: Devotees turned emotional as the sacred Deepam was lit at Thiruparankundram hill following the Supreme Court's verdict. https://t.co/gApjGmjh5B
— ANI (@ANI) November 28, 2026
ఇంకొందరు ఆనందాన్ని తట్టుకోలేక ఆనంద భాష్పాలతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఒక్క దీపం వెలగడం వెనుక ఎన్నో రోజులుగా కొనసాగుతున్న వివాదం, భక్తుల నిరీక్షణ, న్యాయస్థానంలో సాగిన న్యాయపోరాటం, ఆదేశాల అమలుపై నెలకొన్న ఉత్కంఠ కారణం కావడం గమనార్హం. అందుకే రాతి స్తంభంపై దీపం వెలిగిన క్షణం భక్తుల్లో అంతటి భావోద్వేగాన్ని నింపింది.
నవంబర్ 24న కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపథూన్ దగ్గర దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ, అక్కడ దీపం వెలగలేదు. సంప్రదాయంగా దీపం వెలిగించే దీప మండపం వద్దే ప్రభుత్వం దీపం వెలిగించడంతో భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిరసనలకు దిగారు. ఈ వ్యవహారంపై మరోసారి విచారణ జరిపిన సుప్రీంకోర్టు నవంబర్ 27న కీలక ఆదేశాలు జారీ చేసింది.
#WATCH | Madurai, Tamil Nadu: Devotees celebrate and turn emotional as the sacred Deepam is lit atop Thiruparankundram hill following the Supreme Court's verdict https://t.co/t1tTR9Il0j
— ANI (@ANI) November 28, 2026
ఆలయ ధర్మకర్తల మండలిని సస్పెండ్ చేసి, మద్రాస్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ ఎస్. వైద్యనాథన్, జస్టిస్ వి. పార్థిబన్‌లను దీపోత్సవ నిర్వహణ పర్యవేక్షకులుగా నియమించింది. దీంతో.. నవంబర్ 28న కట్టుదిట్టమైన భద్రత మధ్య దీపథూన్ దగ్గర రాతి స్తంభంపై మహాదీపం వెలిగించారు. ముందస్తు అనుమతి పొందిన 50 మంది భక్తులకే కొండపైకి వెళ్లేందుకు అవకాశం కల్పించారు. మిగిలిన భక్తులు కొండ దిగువ నుంచే దీపాన్ని దర్శించారు.
