సమ్మక్క సాగర్ కింద  తాగునీటి కష్టాలకు చెక్..చత్తీస్‌‌‌‌గఢ్ గ్రీన్ సిగ్నల్తో  బ్యారేజీ నింపుతున్న ఆఫీసర్లు

సమ్మక్క సాగర్ కింద  తాగునీటి కష్టాలకు చెక్..చత్తీస్‌‌‌‌గఢ్ గ్రీన్ సిగ్నల్తో  బ్యారేజీ నింపుతున్న ఆఫీసర్లు
  • 5 టీఎంసీల నిల్వకు నిర్ణయం.. ఇప్పటికే 4 టీఎంసీలకు చేరిక
  • ఇంద్రావతి నుంచి రోజూ 10 వేల క్యూసెక్కులకుపైగా వరద
  • ఉమ్మడి వరంగల్, దేవాదుల కింద తాగునీటికి తప్పనున్న తిప్పలు 
  • వరుస భేటీలతో పొరుగు రాష్ట్రాన్ని ఒప్పించిన సర్కార్ 

 

హైదరాబాద్, వెలుగు: సమ్మక్కసాగర్​ బ్యారేజీ జలకళ సంతరించుకుంటున్నది. ఏండ్లకేండ్లుగా పెండింగ్​లో ఉన్న నీటి నిల్వ సమస్యకు పరిష్కారం చూపడంలో కాంగ్రెస్​ సర్కారు విజయవంతమైంది. చత్తీస్​గఢ్​ అనుమతించడంతో బ్యారేజీలో అధికారులు నీటిని నింపుతున్నారు. బ్యారేజీ పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 6.94 టీఎంసీలు కాగా, ప్రస్తుత అవసరాల దృష్ట్యా 5 టీఎంసీల వరకు నిల్వ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే దాదాపు 4 టీఎంసీల మేర నీటిని ప్రాజెక్టులో నింపారు. ఇంద్రావతి నది నుంచి రోజూ 10 వేల క్యూసెక్కులకు పైగా వరద వస్తుండటంతో నీటిని ఒడిసిపడుతున్నారు. బ్యారేజీ ఫుల్​ రిజర్వాయర్​ లెవెల్​83 మీటర్లు కాగా.. ప్రస్తుతం 80.3 మీటర్లకు చేరింది. డిసెంబర్​ చివరి వరకు ప్రవాహాలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో రానున్న వేసవిలో ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు దేవాదుల ఎత్తిపోతల పథకం కింద తాగునీటి అవసరాలకు భరోసా దక్కింది. సమ్మక్క సాగర్ బ్యారేజీకి అతి సమీపంలోనే జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం (జేసీఆర్​డీఎల్ఐఎస్) ఇన్​టేక్ వెల్ ఉంది. బ్యారేజీలో కనీసం 4 నుంచి 5 టీఎంసీల నీటిని నిల్వ చేయడం వల్ల దేవాదుల పంపులను నడిపేందుకు వీలుంటుంది. దీని ద్వారా దేవాదుల గొలుసుకట్టు రిజర్వాయర్లయిన ధర్మసాగర్, భీంఘన్​పూర్, బొమ్మకూర్, చిట్యకోడూరు, గండిరామారం, అశ్వారావుపల్లి వంటి రిజర్వాయర్లను  నింపాలని యోచిస్తున్నారు. ఫలితంగా ఎండాకాలంలో ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ జిల్లాల్లోని గ్రామాలకు తాగునీటి ఇబ్బందులు తొలగిపోతాయంటున్నారు.  

వరుస భేటీలతో ఒప్పుకున్న చత్తీస్​గఢ్​

బ్యారేజీ నిర్మాణం పూర్తయినప్పటికీ చత్తీస్‌‌గఢ్​ నుంచి నో అబ్జెక్షన్​(ఎన్​ఓసీ) రాకపోవడంతో నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకుండాపోయింది. సమస్య పరిష్కరించేందుకు మంత్రి ఉత్తమ్​ మూడు సార్లు ఆ రాష్ట్ర సీఎం విష్ణుదేవ్​ సాయ్​తో సమావేశమయ్యారు. సెప్టెంబర్​ 4న ఢిల్లీలో ఆయనతో మంత్రి ఉత్తమ్​ భేటీ అయ్యి పరిహారంపై స్పష్టమైన హామీ ఇచ్చారు. తర్వాత ఈ నెల 17న సీఎం రేవంత్​ రెడ్డి, మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఆయనతో సమావేశమయ్యారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తక్షణమే నీటి నిల్వకు అనుమతించాలని రేవంత్ రెడ్డి కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన విష్ణుదేవ్ సాయ్.. అధికారిక ఎన్​ఓసీ వచ్చేదాకా ఆగకుండా బ్యారేజీలో నీళ్లు నింపుకోవచ్చని చెప్పారు. 

ముంపు భయాలు తొలగించిన ఐఐటీ నివేదిక

వాస్తవానికి ఈ ప్రాజెక్టును తొలుత కాంతనపల్లి వద్ద ప్రతిపాదించినప్పుడు చత్తీస్‌‌గఢ్​లో 11,408 ఎకరాల భూమి, 17 ఆదివాసీ గ్రామాలు ముంపునకు గురయ్యే పరిస్థితి ఉండేది. కానీ ముంపు తీవ్రతను తగ్గించేందుకు ప్రాజెక్టును ఎగువన ఉన్న తుపాకులగూడెంకు మార్చారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం కోరిన మేరకు తెలంగాణ సర్కార్ రూ.9.883 కోట్లు చెల్లించి ఐఐటీ ఖరగ్​పూర్​తో ప్రత్యేక అధ్యయనం చేయించింది. +83 మీటర్ల పూర్తిస్థాయి నీటిమట్టం (ఎఫ్ఆర్ఎల్) వద్ద నీటిని నిల్వ చేసినా చత్తీస్‌‌గఢ్​లో కేవలం 33 ఎకరాలు మాత్రమే ప్రభావితమవుతాయని, 500 ఏళ్లకోసారి వచ్చే అత్యధిక వరద సమయాల్లో సైతం బీజాపూర్ జిల్లాలోని ఐదు గ్రామాల్లో అదనంగా100 ఎకరాలు కంటే ఎక్కువ ముంపు ఉండదని ఐఐటీ నివేదిక తేల్చింది. ముంపునకు సంబంధించి భూసేకరణ, నష్టపరిహారం భరించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించడంతో చత్తీస్‌‌గఢ్​ అభ్యంతరాలు తొలగిపోయాయి.
 

వచ్చే వానాకాలం నాటికి పూర్తి స్థాయి క్లియరెన్స్

ప్రస్తుతం 5 టీఎంసీల నిల్వతో వేసవి తాగునీటి గండం గట్టెక్కుతుండగా, ప్రాజెక్టు పూర్తిస్థాయి ఫలాలు రైతులకు అందేలా ప్రభుత్వం తదుపరి చర్యలపై దృష్టి సారించింది. చత్తీస్‌‌గఢ్​ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో మూడు సర్వేలు పూర్తి చేసి వచ్చే వానాకాలం నాటికి అధికారిక ఎన్​ఓసీ ప్రక్రియను ముగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సెంట్రల్​ వాటర్​ కమిషన్​ (సీడబ్ల్యూసీ) సాంకేతిక అనుమతులు, డీపీఆర్ ప్రక్రియ కూడా కొలిక్కి వస్తే.. సమ్మక్క సాగర్ ద్వారా 46.96 టీఎంసీల గోదావరి జలాలను మళ్లించి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) రెండో దశ కింద 4.40 లక్షల ఎకరాలను, రామప్ప–పాకాల లింక్ కెనాల్ కింద 30 వేల ఎకరాలను, భూపాలపల్లిలో కొత్తగా 32,563 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేందుకు పూర్తి స్థాయిలో మార్గం సుగమమవుతుంది.