- ఏయూడీ (హెచ్‌ఎండీఏ పరిధి) కార్యదర్శిగా సర్ఫరాజ్ అహ్మద్
- జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్‌గిరి కార్పొరేషన్లకు
- స్పెషల్ ఆఫీసర్‌గా నియామకం
- మెట్రో రైల్ ఎండీగా బి.అజిత్ రెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలు
- జాయింట్ ఎండీగా బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్
- శంషాబాద్ జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్‌గా
- మయాంక్ మిత్తల్‌కు పూర్తి అదనపు బాధ్యతలు
హైదరాబాద్, వెలుగు: హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా ఈవీ నర్సింహా రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు పలువురు ఐఏఎస్‌లు, నాన్–కేడర్ అధికారులను బదిలీ చేయడంతో పాటు మరికొందరికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా పనిచేస్తున్న సర్ఫరాజ్ అహ్మద్ ను మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్‌మెంట్(హెచ్‌ఎండీఏ పరిధి) కార్యదర్శిగా నియమించింది. ఆయన స్థానంలో మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న ఈవీ నర్సింహా రెడ్డి ని నియమిస్తూ.. మూసీ రివర్‌ఫ్రంట్ ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు కొనసాగించింది. దీంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ), సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్‌గా బాధ్యతలు అప్పగించింది.
మరోవైపు పరిశ్రమలు–వాణిజ్య శాఖలో ఇన్వెస్ట్ తెలంగాణ సీఈవోగా ఉన్న బి.అజిత్ రెడ్డికి హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించి, ఆ బాధ్యతల నుంచి సర్ఫరాజ్ అహ్మద్‌ను రిలీవ్ చేసింది. జలమండలి జాయింట్ ఎండీగా ఉన్న మయాంక్ మిత్తల్ కు శంషాబాద్ జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు ఇచ్చారు. అక్కడి నుంచి బదిలీ అయిన కె.చంద్రకళను హెచ్‌ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్(కోర్ అర్బన్ రీజియన్, ల్యాండ్ పూలింగ్, మెట్రో రైల్)గా నియమించడంతో పాటు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ స్పెషల్ కలెక్టర్(ఎల్ఏ)గా ఎఫ్ఏసీ బాధ్యతలు అప్పగించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సబ్ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఐ.ఈ.ఎస్.ఎస్.డి.మనోజ్ ను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. అలాగే వరంగల్ స్టేట్ ఆడిట్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ పి.రామును విద్యా శాఖ స్పెషల్ ఆఫీసర్(ప్రాజెక్ట్స్)గా నియమించగా, ఆ పోస్టులో ఉన్న వి.శ్రీనివాస్ రెడ్డిని బదిలీ చేసి మాతృ శాఖలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
