1970 దశకంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్కూలు, కాలేజీ, విశ్వవిద్యాలయం విద్యావ్యవస్థలో ఒక పెద్దమార్పు తెచ్చారు. 1969లో నేను నర్సంపేట హైస్కూలులో 11వ తరగతి పూర్తి చేసుకుని డిగ్రీ చదవడానికి వరంగల్ ఆర్ట్స్‌అండ్ సైన్స్ కాలేజీలో చేరాలంటే మధ్యలో ఒక సంవత్సరం ప్రి–యూనివర్సిటీ (పీయూసీ) చదవాల్సి వచ్చింది. నాటి ఆ తరహా విద్యా విధానం మారి మధ్యలో పీయూసీ తొలగించి 10+2+3+ విధానాన్ని ప్రవేశపెట్టారు. అంటే 10వ తరగతి వరకు హైస్కూల్లో, రెండు సంవత్సరాలు ఇంటర్, మూడు సంవత్సరాలు డిగ్రీ చదవాలి.
ఆ తరువాత పై చదువులకు పోవాలంటే 2 సంవత్సరాలు మాస్టర్ కోర్సు, ఆ తరువాత ఒకటిన్నర సంవత్సరం మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ కోర్స్ (ఎం.ఫిల్) తరువాత 3 సంవత్సరాలు పీహెచ్‌డీ కోర్సు విధానం ఉండేది. ఆ రోజులలో 11వ తరగతి వరకు గ్రామీణ వ్యవస్థలో చదవాలంటే పాత తాలుకా స్థాయిలోనే అది ఉండేది. డిగ్రీ జిల్లా స్థాయిలో, యూనివర్సిటీ కేవలం హైదరాబాద్ (ఉస్మానియా)లో ఉండేది.
తెలంగాణ మారుమూల గ్రామం నుంచి ఉస్మానియాకు రావాలంటే ఢిల్లీ నుంచి లండన్‌కు పోయి చదివినదానికంటే కష్టం. తెలంగాణలో భూస్వాములు అసలు బడులు పెట్టనిచ్చేవారుకాదు. కింది కులం పోరగాండ్లు చదువుకుంటే మాకు జీతగాండ్లుగా ఎవరుంటారని వాళ్లు అసలు పంతుళ్లను గ్రామాలకు రానిచ్చేవారు కాదు.
నేను పాపయ్యపేట, చెన్నరావుపేట మండల్‌లో 5వ తరగతి చెట్టుకింద బడిలో నాగిల్ టీచర్ చెబితే చదువుకుని పెద్దారెడ్డి భూస్వాముల గ్రామమైన గూడురుకు 6వ తరగతికి పోయాను. ఆ రోజులలో మండలాలు లేవు. గూడురు ఆ ప్రాంతపు పంచాయతీ సమితి హెడ్ క్వార్టర్. నేను కులం సర్టిఫికెట్ తీసుకోవడానికి సమితి ఆఫీసుకు పోయా. అప్పుడే ఆ సమితిలో అపాయింట్ అయిన టీచర్లకు ఆర్డర్లు ఇచ్చి సమితి వైస్ ప్రెసిడెంట్ దొర వాళ్లతో ఇలా మాట్లాడుతున్నారు. ‘అరె! మీకందరికీ పంతులు ఉద్యోగాలిచ్చినం.
మీరు గ్రామాలకు పొయ్యి పోరగాండ్లకు చదువు, గిదువు చెప్పొద్దు. ఉళ్లో ఉన్న కూలినాలి వెధవల పోరగాండ్లు చదువుకుంటే మాకు జీతగాండ్లు యాన్నించి వస్తారు. మీరు పోయి రిజిస్టరులో సంతకాలు పెట్టి మా వ్యవసాయం దగ్గర శేర్‌దార్లు (అంటే పెద్ద జీతగాండ్లు)గా పనిచేయండి. అది ఇష్టం లేకపోతే ఇంటికిపొండి. జీతాలిస్తం కానీ చదువు మాత్రం చెప్పొద్దు’. అది విని నేను షాక్ తిన్న. నేను పోరగాన్నే. మా వూరికి వచ్చిన రాజలింగం పంతులు చదువు చెప్పారు కనుక నేను గూడురు వరకు, తరువాత నర్సంపేటకు, ఆ తరువాత హన్మకొండకు, తరువాత ఉస్మానియాకు పోయి చదువుకున్న.
ఇప్పుడు భూస్వాములంటే మంచి ఇంగ్లిష్, తెలుగు నేర్చుకున్నారు. కానీ గ్రామంలో 5ఆ తరువాత, పెద్దగ్రామంలో 6,7 ఆ తరువాత తాలుకాలో 11 వరకు చదవడం, కాలినడక, సొంత వంట ఆ గోస మామూలుది కాదు. అయినా చదువు నేర్చుకున్నా. ఇప్పడు మా వూళ్లో 10వ తరగతి ఉంది. నా కృషితో అక్కడే 10వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో 25 ఏండ్లు మరో స్కూలు నడిసింది. ఇప్పుడు మా ఊరి బడి ఇంగ్లిష్ మీడియం బడిగా మారింది. అయితే అక్కడే 12వ తరగతి వరకు చదువుకుంటే అమ్మాయిలు, అబ్బాయిలు ఎంత సులభంగా చదువు నేర్చుకోగలరు. ఇప్పుడున్న ప్రతి గ్రామ హైస్కూళ్లో ఇంగ్లిష్ మీడియంలో 12వ తరగతి వరకు ఆడ, మగపిల్లు చదువుకుంటే ఎంత గొప్ప మార్పు వస్తుందో తెలుసా!.
ప్రతి గ్రామం ఇంగ్లిష్ మాట్లాడే తల్లులతో నిండి ఉంటుంది. అందరూ పై చదువులకు పోలేరు. కానీ 12వరకు చదవిన గ్రామస్తులు చాలామంది గొప్ప మేధావులు కాగలరు. అదీ ఖర్చు లేకుండా, చదవడం వల్ల గ్రామ ఆర్థిక వ్యవస్థ మారుతుంది. కొత్త పంటలు, కొత్త బిజినెస్‌లు గ్రామాల్లో పుట్టుకొస్తాయి.
ఎన్నికల రంగాన్ని ప్రభావితం చేస్తున్న ప్రయివేటు కాలేజీలు
ప్రయివేటు ఇంటర్, డిగ్రీ కాలేజీల యాజమాన్యం రాజకీయ నాయకులను తమ ఏజెంట్లుగా మార్చుకున్నారు. పార్టీల మీటింగ్‌లకు బస్సుల సప్లై వీళ్లదే. డబ్బు సప్లై వీళ్లదే. ఒక్కొక్క ప్రయివేటు విద్యాసంస్థకు 50, 60 బస్సులు ఉన్నాయి. ఈ బస్సులు పార్టీల మీటింగుకు జన సమీకరణకు సప్లై చేస్తారు. వీరికి నష్టంవచ్చే ఏ నిర్ణయం ఈ శక్తులు తీసుకోనివ్వవు. రెండు సంవత్సరాలు చదివే ఇంటర్ కాలేజీలు విపరీతమైన దోపిడీ రంగాలు. కేవలం శ్రీ చైతన్య, నారాయణే కాదు, అటువంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ పాత భూస్వాములు.
కొత్తగా ఏర్పడిన విద్యా వ్యాపారులు అంతా ఒక్కటై వారి చేతుల్లో లేదా తరతరాలుగా వ్యాపార రంగంలో ఉన్నవారి చేతుల్లో ఉన్నాయి. ఇంటర్ మీడియట్ ఎత్తివేస్తే తెలుగు రాష్ట్రాలలో సగం విద్యా దోపిడీ తగ్గుతుంది. విద్యా రాహిత్యం తగ్గుతుంది. గ్రామీణ ప్రాంతంలో కంటే పట్టణ ప్రాంతాల్లో చదువు బాగా వస్తుందనేది పూర్తిగా తప్పు.
ముఖ్యంగా విద్యార్థులు తల్లిదండ్రులతో జీవిస్తూ కష్టసుఖాలలో పాల్గొంటూ, పని, పాటలో పాలుపంచుకుంటూ స్కూలు విద్య సాగాలి. యూనివర్సిటీ చదువుకు ఎలాగూ పట్టణ ప్రాంతాలకు పోతారు. చిన్పప్పటి నుంచి పిల్లలను హాస్టళ్లలో, బోర్డింగు స్కూళ్లల్లో పెట్టి చదివించడం మంచిది కాదు. తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదవడమో, ఉద్యోగం చేసుకోవడమో 18వ ఏట తరువాత మాత్రమే ప్రారంభం కావాలి.
గ్రామ చదువు సంపూర్ణమైనది
గ్రామీణ ప్రాంతంలో ఇంగ్లిష్ మీడియం 12వ తరగతి వరకు చదివి, గ్రామ పంటల్లో, ప్రకృతిలో, పశుపోషణలో పాలుపంచుకోవడం వల్ల పాత బ్రాహ్మణీయ శ్రమ వ్యతిరేక విద్యా విధానాన్ని మార్చడానికి వీలు అవుతుంది. చెట్లతో, మట్టితో, పక్షితో, జంతువుతో, శ్రమతో పిల్లలందరికి చాలా దగ్గరి సంబంధం ఉండాలి. గ్రామీణ ప్రాంతంలో శ్రమ గౌరవ పాఠాలు, పాఠ్య పుస్తకాల్లో ఉంచి చదువు చెప్పినట్లయితే స్కూలు స్థాయిలో పిల్లలు వ్యవసాయ రంగంలో, కుటీర పరిశ్రమల్లో చాలా మార్పులు తెస్తారు. గ్రామస్థాయి విద్యలో అన్ని కులాల పిల్లలు ప్రేమతో కలిసిమెలిసి తిరగడం, ఆడుకోవడం అవసరం. గ్రామాల్లో 12వ తరగతి వరకు ఉన్నప్పుడు తమ ఇష్టానుసారం ఆడ– మగ పిల్లల మధ్య కులాలకు అతీతంగా ప్రేమ సంబంధాలు కూడా ఏర్పడతాయి. ఒకరి కుటుంబం గురించి, కులం గురించి మరొకరికి తెలిసి ఉండి పిల్లలు ఆ వయసులో ప్రేమతో జీవించడం చాలా మార్పులకు దారితీస్తుంది.
పిల్లల మధ్య ప్రేమ సంబంధాల్ని చంపొద్దు. గ్రామ జీవితం రాజకీయాలను కూడా బాగా నేర్పుతుంది. పట్టణ జీవితంలో రాజకీయాలు స్కూలు పిల్లలకు దూరంగా కనిపిస్తాయి. కానీ గ్రామాల్లో అలా కాదు. గ్రామ రాజకీయ వ్యవస్థ, సంఘర్షణలు, స్నేహసంబంధాలు ఆ దశలో అర్థమైతే దేశ, ప్రపంచ రాజకీయాలు కూడా చాలా సులభంగా అర్థమవుతాయి. అయితే ఆ దశలోనే ఇంగ్లిష్, తెలుగు భాషలపైన పట్టు ఒకేస్థాయిలో నేర్పించవచ్చు. అందుకు టీచర్లుకు పుస్తకాలు, పత్రికలు చదివి పిల్లలతో చర్చించే అలవాటు ఉండాలి.
స్కూలు పాత్ర.. ఇంటి పాత్ర కంటే సాంస్కృతిక, జ్ఞానమార్పులో చాలా కీలకమైనది. ఇప్పుడు టీచర్లు, జూనియర్
లెక్చరర్లు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా కొత్త పుస్తకాలు చదవడం లేదు. పిల్లలతో తాత్విక పునాదిలో చర్చించడం లేదు. అందువల్లనే మేధావి వర్గం ఎదగడం లేదు. ఇంటర్మీడియట్ రద్దుపర్చే ఈ ప్రక్రియను ఆపకుండా వచ్చే అకడమిక్ సంవత్సరం వరకు ప్రతి హైస్కూలులో 12 క్లాసు పెట్టాల్సిందే.
ఇంటర్ ప్రయివేటు మాఫియా
ఇప్పుడున్న ఇంటర్ కాలేజీలు పెద్ద దొపిడీ మాఫియా సంస్థలు. అక్కడ చెప్పేది చదువు కాదు. ప్రభుత్వ ఇంటర్ కాలేజీలు కూడా చదువు చెప్పడం లేదు. ఇంటర్ బోర్డు ఇంటర్ మాఫియా కొత్త విద్యా వ్యాపార–భూస్వామ్య శక్తుల చేతుల్లో ఉన్నది. ఆడపిల్లలుఉన్నత చదువులకు ఇంటర్ ఒక పెద్ద అడ్డంకిగా మారింది. ఆ కాలేజీలన్నీ పాత తాలుకా పట్టణాల నుంచి పైకి మాత్రమే ఉన్నాయి. అవి బీద ఆడపిల్లలల చదువుకు పెద్ద అడ్డంకి. అందుకే వాటిని రద్దు చేయాలని నేను చాలాకాలం నుంచి పోరాడుతున్నాను.
కానీ చాలా ధనవంతులైన, భూస్వామ్య లక్షణాలు గలిగిన శక్తులు, గ్రామాల్లో ఇంగ్లిష్ మీడియంను, గ్రామాల్లో 12వ తరగతి వరకు చదువు ఉండడాన్ని వ్యతిరేకిస్తూ వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ఈ శక్తులు మళ్లీ లొల్లి మొదలెట్టాయి. అందులో కొద్దిమంది జూనియర్ లెక్చరర్లు ఆ వ్యాపారంలో భాగస్తులై వ్యతిరేకిస్తున్నారు. ఈ శక్తుల్ని జెన్ జీ పూర్తిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. వారికి ఇష్టం లేకుంటే ఉద్యోగాలకు రాజీనామా చేయవచ్చు.
- ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ [email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.
