‘మెతుకు సీమ’కు పరిశ్రమల వెల్లువ..కొత్త యూనిట్ల ఏర్పాటుకు ముందుకొస్తున్న బడా కంపెనీలు

 ‘మెతుకు సీమ’కు  పరిశ్రమల వెల్లువ..కొత్త యూనిట్ల ఏర్పాటుకు ముందుకొస్తున్న బడా కంపెనీలు
  • వందల కోట్ల పెట్టుబడులు
  • వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
  • పారిశ్రామిక రంగంలో ప్రత్యేక గుర్తింపు

మెదక్​, వెలుగు: పారిశ్రామిక రంగంలో ప్రపంచ స్థాయి గుర్తింపు ఉన్న పలు బడా కంపెనీలు ఉమ్మడి మెదక్​ జిల్లాలో  వందల కోట్ల వ్యయంతో తమ కొత్త యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయి.  సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు ప్రాంతంలో ఉన్న ఆసియాలో అతిపెద్ద పారిశ్రామిక వాడతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉండగా ఇప్పుడు విదేశాలకు ఎగుమతులు లక్ష్యంగా కొత్తగా వెలుస్తున్న కంపెనీలతో పారిశ్రామిక రంగంలో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు వస్తోంది. 

మనోహరాబాద్ లో ‘ఐటీసీ’

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం జీడిపల్లిలో సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో రూ.450 కోట్లతో ఐటీసీ అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ ఫుడ్ మ్యాన్ ఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేసింది. ఇక్కడ ఐటీసీకి చెందిన ప్రముఖ బ్రాండ్ ల ఆహార ఉత్పత్తులైన ఆశీర్వాద్ గోధుమ పిండి, సన్ ఫీస్ట్ బిస్కట్ లు, బింగో చిప్స్, ఇప్పి నుడుల్స్ వంటివి తయారవుతాయి. భవిష్యత్​లో ఈ కంపెనీని విస్తరించనుండగా రెండో దశలో పెట్టుబడి రూ.800 కోట్లకు  చేరనుంది. కంపెనీ నడిపేందుకు అవసరమైన కరెంట్​ కోసం రూప్ టాప్​ సోలార్​ ఎనర్జీ మాడ్యూల్స్​ ఏర్పాటు చేసి సోలార్​ పవర్​ ను వినియోగిస్తుండటం విశేషం. అలాగే జల సంరక్షణ కోసం రేయిన్​ వాటర్​ హార్వెస్టింగ్​ సిస్టంను కూడా ఏర్పాటు చేశారు. 

తూప్రాన్​వద్ద ‘అమూల్​​ డెయిరీ’

తూప్రాన్ మండలంలోని ఉర్జా ఇండస్ట్రియల్ పార్క్ లో గుజరాత్​ కు చెందిన అమూల్ డెయిరీ కంపెనీలో రూ.400 కోట్లతో 18 ఎకరాల విస్తీర్ణంలో 5 లక్షల లీటర్ల చిల్లింగ్ సామర్థ్యంతో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సాబర్ డెయిరీ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. గత నెలలో ఈ యూనిట్​ ఏర్పాటుకు కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి శంకుస్థాపన చేశారు. మాడ్రన్​ టెక్నాలజీతో ఏర్పాటు చేయనున్న ఈ డెయిరీ ప్లాంట్​ను18 నెలల్లో పూర్తి చేయాలని అమూల్​ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.  జిల్లాలోని గ్రామాల్లో  సహకార విధానంలో సొసైటీలు ఏర్పాటు చేసి రైతుల దగ్గర నుంచి పాలను సేకరించి ప్రాసెసింగ్​ చేసి పాలు, పెరుగు, మజ్జిగ, లస్సీ, బాదాం మిల్క్, పన్నీర్​, నెయ్యి, స్వీట్ లు వంటి అనేక రకాల పాల ఉత్పత్తులు ఇక్కడ తయారు కానున్నాయి.  అమూల్​ డెయిరీ యూనిట్​ ద్వారా ప్రత్యక్షంగా చాలా మందికి ఉద్యోగ అవకాశాలు లభించడంతోపాటు, పాడి గేదెల పెంపకం, సొసైటీల ద్వారా పాల అమ్మకం ద్వారా రైతులకు, మహిళలకు ఉపాధి లభించనుంది. 

వర్గల్​లో ‘వింటేజ్ ​కాఫీ కంపెనీ’

సిద్దిపేట జిల్లా వర్గల్‌‌‌‌‌‌‌‌మండలం అవుసులోనిపల్లి వద్ద ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ లో ‘వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్’ కంపెనీ రూ.1,500 కోట్ల భారీ పెట్టుబడితో నూతనంగా ‘ఫ్రీజ్ డ్రైడ్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టంట్ కాఫీ’ ప్లాంట్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేస్తోంది. దీనికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్​ బాబు భూమి పూజ చేశారు. మొదటి దశలో ఏటా 5,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. దక్షిణాసియాలోనే తొలిసారిగా అత్యాధునిక ‘రోటో టెక్నాలజీ’తో ఈ ప్లాంట్ నిర్మాణం జరుగుతుండటం విశేషం. ఇది వంద శాతం ఎగుమతి ఆధారిత యూనిట్. ఇక్కడి నుంచి యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా తదితర దేశాలకు ఇన్ స్టంట్ కాఫీ ఎగుమతి కానుంది. ఈ కంపెనీ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వెయ్యి మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

ప్రాంతాల అభివృద్ధికి బాటలు

వందల కోట్లతో భారీ పరిశ్రమల ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆయా ప్రాంతాల అభివృద్ధికి బాటలు పడనున్నాయి. బడా కంపెనీలకు ముడి సరుకు, ఆయా పరిశ్రమల ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు, దేశాలకు రవాణా చేసేందుకు వీలుగా రహదారి సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. లాజిస్టిక్ పార్క్​ లు ఏర్పాటు కానున్నాయి. 

నిమ్జ్​ లో ‘హ్యుందాయ్​ ప్రాజెక్ట్’​
 సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లోని నేషనల్​ ఇన్వెస్ట్​మెంట్​ అండ్​ మాన్యు​ఫాక్చరింగ్ జోన్​ ( నిమ్జ్​) లో  హుందాయ్ మోటార్​ ఇండియా కంపెనీ రూ.8,528 కోట్లతో  ఇంటిగ్రేటెడ్​ గ్లోబల్​ ఆర్​ అండ్​ డీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. మొత్తం 678 ఎకరాల విస్తీర్ణంలో దశల వారీగా అభివృద్ధి చేయనున్న ఈ ప్రాజెక్ట్​ ద్వారా సుమారు ఐదువేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి అనుమతుల ప్రక్రియ పూర్తి కాగానే ఈ ప్రాజెక్ట్​ కు భూమి పూజ జరగనుంది.