అండాల దందా కేసులో సద్గురు హెల్త్ డైరెక్టర్లకు ఉచ్చు ..దేశ వ్యాప్తంగా 43 క్లినిక్‌‌‌‌‌‌‌‌లలో నెలకు 600 అండాలు సేకరణ

అండాల దందా కేసులో  సద్గురు హెల్త్  డైరెక్టర్లకు ఉచ్చు ..దేశ వ్యాప్తంగా 43 క్లినిక్‌‌‌‌‌‌‌‌లలో నెలకు 600 అండాలు సేకరణ
  • దేశవ్యాప్తంగా 43 క్లినిక్‌‌‌‌‌‌‌‌లలో నెలకు 600 అండాల సేకరణ
  • ఇందుకోసం యువతులకు హార్మోనల్ ఇంజెక్షన్స్​ 
  • 39 బ్యాంక్ అకౌంట్లు, నెలకు రూ. 28 కోట్ల లావాదేవీలు 
  • ఎనిమిది నెలల్లో రూ.487.82 కోట్ల టర్నోవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వివరాలు వెల్లడించిన 
  • మేడ్చల్ మల్కాజిగిరి సీపీ సుమతి  
  • సీఓఓ ప్రతీక్‌‌‌‌‌‌‌‌, మెడికల్‌‌‌‌‌‌‌‌ అడ్మినిస్ట్రేటర్‌‌‌‌‌‌‌‌ రాజర్షి దేబ్‌‌‌‌‌‌‌‌ అరెస్ట్‌‌‌‌‌‌‌‌
  • పోలీసుల అదుపులో సద్గురు ఎండీ సూర్యకిరణ్ భార్య 

 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: అండాల సేకరణ, మహిళల అక్రమ రవాణా కేసులో సద్గురు హెల్త్‌‌‌‌‌‌‌‌ కేర్ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్ల మెడకు ఉచ్చు బిగుస్తోంది. సద్గురు హెల్త్‌‌‌‌‌‌‌‌ కేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన 11 మంది డైరెక్టర్లకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ‘సద్గురు హెల్త్‌‌‌‌‌‌‌‌ కేర్‌‌‌‌‌‌‌‌ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌’కు చెందిన చీఫ్‌‌‌‌‌‌‌‌ ఆపరేటింగ్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌(సీఓఓ) ప్రతీక్‌‌‌‌‌‌‌‌ అనిల్‌‌‌‌‌‌‌‌ గగ్లానీ, మెడికల్‌‌‌‌‌‌‌‌ అడ్మినిస్ట్రేటర్‌‌‌‌‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌ రాజర్షి దేబ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మేడ్చల్ మల్కాజిగిరి పోలీసులు చర్యలు చేపట్టారు. శనివారం వీరిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. వీరి వద్ద మూడు సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్లు, ల్యాప్‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎల్బీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని క్యాంప్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో మేడ్చల్ మల్కాజిగిరి సీపీ సుమతి మీడియా సమావేశం నిర్వహించారు. 
 

అండాల దందా వెనుక ఉన్న సద్గురు హెల్త్‌ కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన ఆర్థికలావాదేవీల వివరాలు వెల్లడించారు. ఒక్కో ఎగ్‌ డోనర్‌‌కు రూ.30 వేల నుంచి రూ.50 వేల చొప్పున అందిస్తూ.. డిమాండ్‌ను బట్టి రూ.కోటికి పైగానే దండుకుంటున్నట్లు గుర్తించామన్నారు. కేవలం 8 నెలల కాలంలోనే ఏకంగా రూ.487.82 కోట్లు లావాదేవీలు తమ విచారణలో తేలిందని వెల్లడించారు. ఇందుకోసం 39 బ్యాంక్ అకౌంట్లు వినియోగించినట్లు తెలిపారు. ఒయాసిస్ పేరిట నిర్వహిస్తున్న షెల్‌ కంపెనీల వివరాలను సేకరిస్తున్నామని చెప్పారు. ప్రతిక్, రాజర్షి దేబ్‌ వాంగ్మూలం ఆధారంగా సద్గురు హెల్త్‌ కేర్ సర్వీసెస్ డైరెక్టర్లకు నోటీసులు ఇవ్వడంతో పాటు బాధ్యలైన వారిని అరెస్ట్ చేస్తామని ఆమె తెలిపారు. 

దేశవ్యాప్తంగా 43 క్లినిక్‌ల నెట్‌వర్క్‌..  

 
బంజారాహిల్స్‌ కేంద్రంగా సద్గురు హెల్త్‌కేర్ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మేనేజింగ్‌ డైరెక్టర్‌‌గా గేదెల వెంకట సూర్యకిరణ్‌ సహా మరో ఐదుగురు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. సద్గురు హెల్త్‌ కేర్ సర్వీసెస్‌ ఆధ్వర్యంలో అండాల సేకరణ సప్లయ్‌కు సంబంధించిన ఒయాసిస్‌ ఫెర్టిలిటీ సెంటర్లు నిర్వహిస్తున్నారు. కాగా, అక్రమంగా అండాలు సేకరిస్తున్న కేసులో డీఎంహెచ్‌వో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సరూర్‌‌నగర్‌‌ పీఎస్‌లో రెండు కేసులు నమోదు కాగా. సద్గరు హెల్త్‌ కేర్‌ సర్వీసెస్‌ సీఓఓ ప్రతిక్‌ అనిల్‌ గగ్లానీ, మెడికల్‌  అడ్మినిస్ట్రేటర్‌ రాజర్షి దేబ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వీరిద్దరి వాంగ్మూలాలు రికార్డ్ చేశారు. దేశవ్యాప్తంగా సద్గురు హెల్త్‌ కేర్‌ సంస్థకు చెందిన 43 క్లినిక్‌లను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వీటిలో హైదరాబాద్‌లోనే పది ఒయాసిస్‌ ఫెర్టిలిటీ సెంటర్లు ఉండగా వీటిలో బంజారాహిల్స్‌, మియాపూర్‌, సికింద్రాబాద్‌, దిల్‌సుఖ్‌నగర్‌లలో నాలుగు లెవల్‌ టూ ఐవీఎఫ్‌ క్లినిక్‌లు ఉన్నాయి.

అండాల సేకరణకు హార్మోనల్ ఇంజెక్షన్స్...​

అండాల సేకరణ కోసం తీసుకొచ్చిన మహిళలకు అండాశయాల ఉద్దీపనకు సంబంధించిన హ్యూమోగ్‌, ఫోల్లీ సర్జ్‌, మెటెర్నా, ట్రెగర్‌ తదితర ఇంజెక్షన్లు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం వారిని లెవల్‌ ఫెర్టిలిటీ కేంద్రాలకు తరలించి ట్రిట్‌మెంట్‌ నిర్వహించినట్లు విచారణలో వెల్లడైందని సీపీ సుమతి తెలిపారు. ఇందుకోసం మియాపూర్‌లోని సద్గురు ఏఆర్‌టీ బ్యాంకు ఇన్‌చార్జి సునీల్‌రాయ్‌ ద్వారా వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలను ఏజెంట్ల సహాయంతో అండాల సేకరణ కోసం తీసుకొచ్చినట్లు పోలీసుల విచారణలో బయట పడిందన్నారు. ఒక్కో యువతిని 15 రోజుల చొప్పున తమ ఆధీనంలో పెట్టుకుని అండాల ఉత్పత్తి అనంతరం తిరిగి పంపించే వారని సీపీ తెలిపారు. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న 43 క్లినిక్‌లలో ప్రతి నెలా సుమారు 600 అండాలు సేకరిస్తుండగా ఇందులో 100 దాక అండాల దాతలు పలుమార్లు ఇస్తున్నట్లు గుర్తించారు. వీటి ద్వారా నెలకు రూ.27 కోట్ల నుంచి రూ.28 కోట్ల వరకు ఆదాయం వస్తున్నట్లు సీపీ వెల్లడించారు.

8 నెలల్లో రూ.487.82 కోట్ల లావాదేవీలు..

అండాల దందా వ్యవహారం సంస్థ వ్యవస్థాపకుడు, డైరెక్టర్‌ డాక్టర్‌ గేదెల దుర్గారావు సూచనల మేరకు సాగినట్లు పోలీసులు గుర్తించారు. సద్గురు సర్వీసెస్‌ పేరుతో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాను పరిశీలించగా.. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి నవంబర్‌ 26 వరకు వరకు మొత్తం రూ.487.82 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఈ మొత్తం అండాల సేకరణకు సంబంధించిన లావాదేవీలేనా లేదంటే ఇతర ట్రాన్సాక్షన్స్ జరిగాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సీపీ సుమతి వెల్లడించారు. కాగా, సంస్థలో 2025 నుంచి సీఓఓగా పనిచేస్తున్న ప్రతిక్‌ అనిల్‌ గగ్లానీ.. ఈ మొత్తం కార్యకలాపాల నిర్వహణ, వైద్య పరికరాలు, సామగ్రి కొనుగోలు, అవసరమైన సదుపాయాల ఏర్పాటు, నిధుల సమన్వయంలో కీలక పాత్ర పోషించినట్లు సీపీ తెలిపారు. కంపెనీ సీఎఫ్‌ఓ ఆశిష్‌ అగర్వాల్‌తో కలిసి లావాదేవీలు నిర్వహించినట్లు గుర్తించామన్నారు. అండాల దాతల ప్యాకేజీల గురించి రోగులకు వివరించడం, ఏఆర్‌టీ బ్యాంకు ఇన్‌చార్జి సునీల్‌రాయ్‌తో నిరంతరం సంప్రదింపులు జరపడం వంటి అంశాలనూ ప్రస్తావించారు. రాజర్షి దేబ్‌ క్లినికల్‌ నాణ్యత, ఆపరేషన్‌ థియేటర్లు సిద్ధం చేయడంతో పాటు డాక్టర్ల నియామకాలను పర్యవేక్షించినట్లు పోలీసులు తెలిపారు.
 
ఇద్దరిపై లుక్‌అవుట్ నోటీసులు..

అండాల దందా కేసు బయటపడిన వెంటనే సద్గురు హెల్త్‌ కేర్‌‌ సర్వీసెస్‌ ఎండీ సూర్యకిరణ్‌ విదేశాలకు వెళ్లినట్లు తెలిసింది. ఆయన భార్య కూడా విదేశాలకు పారిపోయేందుకు యత్నించగా బేంగపేట పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా, వీరిద్దరిపై ఇప్పటికే లుక్‌అవుట్‌ సర్క్యులర్‌‌ అమలులో ఉన్నాయి. సీఓఓ ప్రతిక్‌, రాజర్షి దేబ్‌ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సద్గురు హెల్త్‌ కేర్‌‌ సర్వీసెస్​ డైరెక్టర్లతో పాటు అండాల దందా వెనుక ఉన్న వారికి నోటీసులు ఇవ్వడంతో పాటు అవసరమైతే అరెస్ట్‌ చేస్తామని సీపీ సుమతి తెలిపారు.