- ‘సైబరాబాద్ మూవ్స్’లో పాల్గొన్న నిపుణులు, ప్రజల అభిప్రాయం
- వారంలో జేఎన్టీయూ నుంచి రాయదుర్గ్ వరకు ప్రత్యేక బస్సు లేన్
హైదరాబాద్ సిటీ, వెలుగు: సైబరాబాద్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపాలంటే ప్రైవేట్ వాహనాల వినియోగాన్ని తగ్గించి, ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయాలని ‘సైబరాబాద్ మూవ్స్’ కార్యక్రమంలో పాల్గొన్నవారు సూచించారు. విదేశాల్లో మాదిరిగా 90 శాతం ప్రయాణాలు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు ద్వారానే జరిగేలా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. ప్రజా రవాణా అందుబాటులో ఉంటేనే సొంత వాహనాలపై ఆధారపడడం తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం సీఎంసీ పరిధిలో 390 సిటీ బస్సులు 3,990 ట్రిప్పుల ద్వారా రోజూ సుమారు 2.50 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో 3,200 బస్సులు 32,994 ట్రిప్పులు నిర్వహిస్తూ నిత్యం 25 లక్షల మందికి సేవలందిస్తున్నాయి. ప్రైవేట్ వాహనాల రద్దీ తగ్గితేనే రోడ్లపై బస్సుల సంఖ్యను మరింత పెంచేందుకు వీలుంటుందని, తద్వారా ట్రాఫిక్‌తో పాటు కాలుష్యం కూడా తగ్గుతుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
జేఎన్టీయూ–రాయదుర్గ్ మధ్య ప్రత్యేక బస్ లేన్
నగరంలో మెట్రో సౌకర్యం లేని ప్రాంతాల్లోనూ ప్రజా రవాణాను వేగవంతం చేసేందుకు ప్రత్యేక బస్ లేన్ల ఏర్పాటుపై అధికారులు దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా జేఎన్టీయూ నుంచి రాయదుర్గ్ వరకు ప్రత్యేక బస్ లేన్ ఏర్పాటు చేసేందుకు సీఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు కసరత్తు చేస్తున్నారు. వారంలో ఈ మార్గంలో ప్రయోగాత్మకంగా ప్రత్యేక బస్ లేన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జేఎన్టీయూ నుంచి రాయదుర్గ్ వైపు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రాయదుర్గ్ నుంచి జేఎన్టీయూ వైపు ఈ ప్రత్యేక లేన్‌లో బస్సులు నడపనున్నారు.
ముగిసిన ‘సైబరాబాద్ మూవ్స్’
నాలెడ్జ్ సిటీలోని టీ-హబ్‌లో మూడు రోజుల పాటు నిర్వహించిన ‘సైబరాబాద్ మూవ్స్-2026’ సదస్సు శనివారం ముగిసింది. 200 మందికి పైగా భాగస్వాములు, 5 వేల మందికి పైగా ప్రజలు హాజరైన ఈ వేదికపై భవిష్యత్ రవాణా, ప్రజా రవాణా బలోపేతం, రహదారి భద్రత వంటి అంశాలపై చర్చించారు. 2027 నాటికి ఉద్యోగుల వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని 10 శాతం తగ్గించేందుకు 15కు పైగా ప్రముఖ కార్పొరేట్ సంస్థలు ప్రతిజ్ఞ చేశాయి.
గంటన్నర ప్రయాణం.. 20 నిమిషాల్లోనే!
జేఎన్టీయూ–రాయదుర్గ్ మధ్య దూరం సుమారు 7 కిలోమీటర్లు మాత్రమే అయినప్పటికీ, ట్రాఫిక్ రద్దీ కారణంగా ప్రస్తుతం గంటన్నర సమయం పడుతోంది. ప్రత్యేక బస్ లేన్ అందుబాటులోకి వస్తే ఈ ప్రయాణ సమయం 15 నుంచి 20 నిమిషాలకు తగ్గనుంది. ప్రస్తుతం ఈ మార్గంలో ఆర్టీసీ 33 బస్సులతో 66 సర్వీసులు నడుపుతుండగా, రోజూ సుమారు 40 వేల మంది ప్రయాణిస్తున్నారు. ప్రత్యేక లేన్ ఏర్పాటు తర్వాత అదనంగా మరో 40 బస్సులను నడపాలని, తద్వారా ప్రతి నిమిషానికి ఒక బస్సు అందుబాటులో ఉండేలా చూడాలని ఆర్టీసీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. మెట్రో లేని ప్రాంతాల్లో ఇలాంటి ప్రత్యేక లేన్లు ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
